Wednesday, December 5, 2012

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను..

తెలుగు భాషను రక్షించుకోవడానికి, సాధికారం చేయడానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను విన్నవించడానికి ఒక ప్రతినిధి బృందం ఈ మధ్య ముఖ్యమంత్రిగారిని కలిసిందట. అధికార భాషా సంఘం ఏర్పాటును, ప్రపంచ మహాసభల ఆలోచనను స్వాగతిస్తూనే, తెలుగు మనుగడకు అవసరమైన నిర్దిష్ట విధానచర్యలను చేపట్టకపోతే, సభల వల్ల ఉపయోగం లేదని, నిరసనల నుంచి తప్పించుకోవడం కోసమైనా కొన్ని నిర్ణయాలను తీసుకోవాలని సూచించిందట. ప్రతినిధిబృందం చెప్పిన మాటలన్నిటిలో, నిరసనలు అన్నమాట ఒక్కటే ముఖ్యమంత్రిగారిని ఆకర్షించినట్టుంది, 'నిరసనలకు భయపడాలా, ఎవరికో భయపడి పనులు చేయం' అని ఆయన జవాబిచ్చారట.

ఆయన అట్లా అని ఉంటారనడంలో ఏ సందేహమూ ఉండనక్కరలేదు. ఎవరికీ భయపడేది లేదని, మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలున్నవాళ్లు వెళ్లిపోవచ్చునని ముఖ్యమంత్రి బాహాటంగానే అన్నారు. భయపడకుండా ఉండడం పరిపాలకుని వ్యక్తిత్వంలో ఒక వాంఛనీయ లక్షణమే అయి ఉండవచ్చు. శత్రుదేశాల విషయంలోనో, అసాంఘిక శక్తుల విషయంలోనో
చలించని ధైర్యాన్ని ప్రకటించడం ఉత్తమ నాయకత్వ లక్షణం కావచ్చు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కాదు, ఏ పాలనా వ్యవస్థలో అయినా ప్రజాభిప్రాయానికి భయపడడమే మేలైన రాజనీతి. కానీ, ప్రతి భిన్నాభిప్రాయాన్నీ, ప్రతి నిరసననూ శత్రుపూరితంగా చూసే లక్షణం పాలకులకు అలవడిపోయింది.

ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకునే ముందు, అసలు తెలుగుభాష ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, వాటిని ఎట్లా పరిష్కరించాలి అన్న అంశాలపై ప్రభుత్వం సంబంధిత నిపుణులతో, సంస్థలతో చర్చించి ఉండవలసింది. పాతిక, ముప్పై కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు, అది ఆశిస్తున్న ఫలితాలను ఇస్తుందా, ఇవ్వాలంటే కార్యక్రమాన్ని ఏ రీతిలో రూపొందించాలి అన్న ప్రశ్నలకు సమాధానం అన్వేషించాలి. మహాసభల నిర్వహణ వెనుక ప్రభుత్వానికి తెలుగు దుస్థితిని చక్కదిద్దాలన్న చిత్తశుద్ధిలేదని భావిస్తున్నందునే అనేక సాహిత్య సంస్థలు, రాజకీయ ఉద్యమాలు సభలను బహిష్కరించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. ఆశయంతో నిమిత్తం లేకుండా, ఒక రాజకీయచర్యగా సభలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున, ఆ రాజకీయ చర్యకు రాజకీయమైన ప్రతిస్పందనగా అటువంటి పిలుపులు రావడం సహజం.సభల నిర్వహణ కానీ, వాటి బహిష్కారం కానీ అసలు సమస్యను స్పృశించవు కాబట్టి, ఈ సందర్భాన్ని తెలుగు మనుగడకు దోహదం చేసే నిర్దిష్టమైన, వాస్తవమైన చర్యల గురించి చర్చించడానికి వినియోగించుకోవడం శ్రేయస్కరం.

నిజానికి తెలుగు ప్రేమికులం అని చెప్పుకునేవారు భయపడుతున్న రీతిలో భాషకు వచ్చిన తక్షణ ప్రమాదం ఏమీ లేదు. చదువుల్లో తెలుగు మాధ్యమం తగ్గిపోతుండడం, నిత్యవ్యవహారంలో అన్యభాషాపదాలు అధికం కావడం, చివరకు మాతృభాషలోనే ఉండవలసిన అమ్మా, నాన్నా వంటి సంబంధసంబోధవాచకాలు సైతం ఆంగ్లంలోకి మారిపోవడం- చాలా మంది దృష్టిలో తెలుగుకు ఏర్పడుతున్న ప్రమాదాలు ఇవే. నోటీసుబోర్డులు తెలుగులో లేకపోవడం, ఉన్నా తప్పులతో ఉండడం, ప్రభుత్వ పరిపాలనలో ఒక స్థాయిని దాటి తెలుగు వినియోగం లేకపోవడం- వంటి అంశాలను కూడా వారు ప్రస్తావిస్తారు. ఇవన్నీ కూడా తెలుగు క్షీణస్థితిని సూచించే అంశాలే అయినప్పటికీ, క్షీణత మూలకారణాలను చెప్పేవి కావు.

ఆధునిక ప్రజాస్వామిక యుగంలో భాష కూడా రాజకీయాలకు సాధనంగా, ప్రధానాంశంగా, కొన్ని సందర్భాలలో కేంద్రబిందువుగా ఉంటూ వస్తున్నది. భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం జరిగిన భాషాజాతీయోద్యమాలు- ఆయా భాషల వ్యవహర్తల రాజకీయ ఆకాంక్షల నుంచి వ్యక్తమయినవే. వేరు వేరు భాషలు మాట్లాడేప్రాంతాల మధ్య నీటి తగవులు, భౌగోళిక తగవులు, ఉపాధి కోసం ఒత్తిడి నుంచి వచ్చే ఘర్షణలు- భాషావివాదాలుగానే చెలామణి అయ్యాయి. ఒక భాష ఆధిపత్యాన్ని ఆ భాషావ్యవహర్తల రాజకీయార్థిక సాంస్క­ృతిక ఆధిపత్యంగా పరిగణించడం అనేక సందర్భాలలో చూడవచ్చు. ప్రత్యక్షంగా ఏదైనా భాష కానీ, ఆ భాషా వ్యవహర్తలు కానీ పెత్తనం చేయాలనుకునే సందర్భంలో, బాధిత భాషాప్రజలు సంఘటితం కావడం, తమ భాషను పరిపుష్టం చేసుకునే రీతిలో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. తమిళనాడులో తమిళభాషా జాతీయవాదం దృఢంగా పాదుకొనడానికి వారి ద్రావిడ వాదం, ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరించాలన్న రాజకీయసంకల్పం కారణాలు.

రామ్‌మనోహర్ లోహియా వంటి వారు ఇంగ్లీషు పెత్తనాన్ని ఎదిరించి హిందీవాదాన్ని ఎత్తుకోవడం వెనుక ఉత్తరాది గంగామైదానంలో ఆంగ్లవిద్యకు వెలిగా ఉన్న బడుగువర్గాల రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు తమకు విడిగా రాష్ట్రం కావాలని బ్రిటిష్ హయాం నుంచి ఉద్యమం చేయడానికి- తమిళ పెత్తనం మీద ఉన్న వ్యతిరేకత కారణం. నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు చదువుల కోసం జరిగిన పోరాటం- నాటి వ్యవస్థలో తెలుగు ప్రజల ప్రాతినిధ్యరాహిత్యాన్ని ఎదిరించడానికి జరిగిన ప్రయత్నమే.

ప్రస్తుతం తెలుగురక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి పైన పేర్కొన్న ఉద్యమాలకు పోలిక లేదు. నేడు తెలుగు స్థితికి కారకులైన ఇతర భాషావర్గాలేవీ లేవు. ప్రపంచాన్నంతా పీడిస్తున్న ప్రపంచీకరణే తెలుగుభాషను కూడా ప్రభావితం చేస్తున్నది తప్ప, మన భాషకు తమిళం నుంచో, కన్నడం నుంచో, హిందీ నుంచో వస్తున్న కొత్త ప్రమాదాలేమీ లేవు. నిజమే మాట్లాడవలసి వస్తే, తెలుగుదనపు విజృంభణ వల్ల మన రాష్ట్రంలో ఉర్దూ, కోయ, గోండి వంటి మైనారిటీ, ఆదివాసీ భాషలు ప్రమాదం ఎదుర్కొంటున్నాయి. మరి ప్రతినాయకుడు లేకుండా, భాషోద్యమానికి తగిన ఊపు లభిస్తుందా? లభించదు. అందువల్లనే ఇప్పటికీ ఈ ఉద్యమం పరిమిత వర్గాలలోనే పరిభ్రమిస్తున్నది. నేటి తెలుగు క్షీణతకు కారకులెవరన్నా ఉంటే, వారు తెలుగువారే.

అందరినీ కలిపి అనడం ఎందుకు కానీ, తెలుగును ఇంతకాలం నడిపిస్తున్నామనుకున్నవారూ, తెలుగు సమాజానికి ఆర్థికంగా, సాంస్క­ృతికంగా నాయకత్వం వహిస్తున్నవారూ, వారి ప్రతినిధులే అయిన ఏలినవారూ- వీరే తెలుగు స్థితిగతులకు కారకులు. ఎవరు కారకులో, ఆ వర్గాలలోనే ఉన్న కొందరు సజ్జనులు, తమ వర్గాలకు మించి ఆలోచించగలిగినవారు, దూరదృష్టి కలిగినవారు మాత్రమే తెలుగు గురించి ఆవేదన చెందుతున్నారు. అది సరిపోదు. కేవలం వయోధికులు కొందరి హితబోధల వల్ల తెలుగు బతికి బట్టకట్టదు. తెలుగు మనుగడలో, తెలుగుసమాజానికి చెందిన క్రియాశీల రాజకీయ, సామాజిక, వయో వర్గాలన్నిటి ప్రయోజనాలు కనిపిస్తేనే, భాషకు మేలు జరుగుతుంది.

ప్రభుత్వం కనుక నిజంగా డిగ్రీ దాకా తెలుగును ఒక తప్పనిసరి అంశంగా చేయగలిగితే, కొంతమేరకు తెలుగుకు తక్ష ణ చికిత్స జరుగుతుంది. ప్రాథమిక స్థాయిని దాటి తెలుగును మాధ్యమం చేయాలంటే మాత్రం తెలుగుకు మరమ్మత్తులు చేయవలసి ఉంటుంది. యూనికోడ్ ఫాంట్లు తయారుచే సి పంచిపెట్టడం వల్ల తెలుగుకు వచ్చే పెద్ద మేలు ఏమీ లేదు. తెలుగుకు స్పెల్‌చెకర్, గ్రామర్ చెకర్ వంటివి తయారుచే యాలంటే (కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు ఆ ప్రయత్నాన్ని సాధ్యమైనంతగా చేయగలిగారు), తెలుగుభాష ప్రమాణీకరణ ప్రక్రియ పునః ప్రారంభం కావాలి. అది గతంలో మాదిరిగా పండితులు కొందరు కూర్చుని చర్చిస్తే జరిగే పని కాదు. తెలుగుభాషలోని వివిధ కుల, వర్గ, ప్రాంతీయ మాండలికాలన్నిటినీ ప్రధానభాషలో అంతర్భాగం చేయడానికి కృషి జరగాలి.

సాహిత్యఅకాడమీ గతంలో చేసిన కృషి అర్థాంతరంగా ఆగిపోయింది. ఎన్‌టి రామారావు తెలుగు కోసం పరిత పించినమాట నిజమే కానీ, రాష్ట్ర అకాడమీలను రద్దు చేసి ప్రత్యామ్నాయాలను ఏర్పరచకపోవడం వల్ల తెలుగుకు చాలా అపకారం కూడా జరిగింది. అలాగే, తెలుగులో మౌలిక శాస్త్రీయ రచన చేయగలిగే సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరగాలి. గతంలో ఆ దిశగా జరిగిన కృషిని గుర్తించి, సమీక్షించుకుని ముందుకు సాగాలి. పత్రికలు, ప్రసార, వినోద మాధ్యమాల ద్వారా భాష ప్రమాణీకరణ, స్థిరీకరణ జరుగుతున్నాయి. ఆ రంగాలలో భాషావినియోగం శాస్త్రీయంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేట్టు పర్యవేక్షణలు ఉండాలి. ఇతర భాషాపదాల ఆదానాన్ని నియంత్రించడానికి ఒక విద్యావిషయికమైన స్వతంత్ర వ్యవస్థ అవసరం.

ఇన్ని చేసినప్పటికీ, తెలుగుసమాజపు స్థాయిని దాటి భాష ఉరుకులు పరుగులతో అభివృద్ధి చెందదు. భాష అంటే, దాన్ని మాట్లాడే ప్రజల చరిత్ర, సంస్క­ృతే. తెలుగుసమాజంలో మౌలికమయిన పరిశోధనలు, శాస్త్రసాంకేతిక పురోగతి జరగనిదే తెలుగుభాష ఉన్నతీకరణ జరగదు. భాషా పరిరక్షణకు, ఆధునికీకరణకు వైరుధ్యం లేదు. ప్రమాణీకరణ, ఆధునికీకరణలతో సమస్యలున్నాయి కానీ, వాటిని ప్రజాస్వామికీకరణ ద్వారా పరిష్కరించుకోవచ్చును. తెలుగుభాషను అభిమానించడం, ప్రేమించడం అంటే పాతపద్యాలను వల్లెవేయడమో, సంప్రదాయ సంగీతనాట్యాలకు పూర్వ వైభవం తేవడం మాత్రమే కాదు. సమకాలీన ప్రజాజీవితం మెరుగైన, ఉన్నతమయిన స్థితికి చేరుకోవడానికి చేసే ప్రయాణంలో భాష ఒక సాధనం.

తిరుపతిలో కాంగ్రెస్ ప్లీనరీ జరిగినచోటనే ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్ని ప్లీనరీలు, మేధోమథనాలు జరిగినా కాంగ్రెస్‌లో వచ్చిన పెద్ద మార్పులేమీ ఉండవు. తిరుపతి సభల తరువాత కూడా తెలుగు వేసిన చోటనే ఉండవచ్చు. భాషను ఉద్వేగాలతో ఆవేశాలతో ప్రేమించేవారికి కొంత హంగామా, ఒక జాతర సంతృప్తిని ఇవ్వవచ్చు. కానీ, తెలుగు వెలగాలంటే మాత్రం చేయవలసింది, చేస్తూనే పోవలసింది అంతకు మించి చాలా ఉన్నది.


1 comment:

  1. "తెలుగు వెలగాలంటే మాత్రం చేయవలసింది, చేస్తూనే పోవలసింది అంతకు మించి చాలా ఉన్నది"

    మహబాగా చెప్పారు! ముందు వాళ్ళేదో బాగుపడిపోతున్నారని ఏడవకుండా సాటి తెలుగువాళ్ళని గౌరవించటం నేర్చుకుంటే జాతికిపట్టిన సగం దరిద్రం వదులుతుంది.

    (ఏడవటమంటే మా ప్రాంతములో బాధపడటలెండి)

    ReplyDelete