Thursday, December 13, 2012

తెలంగాణ అంటే ఇంత తేలిక ఎందుకు?

పందొమ్మిదివందల ఎనభై. జనతాప్రయోగమో, స్వప్నమో భగ్నమయింది. మళ్లీ ఎన్నికలు. అప్పుడే మరచిపోతారా అత్యవసర పరిస్థితిని, తిరిగి అనుశాసనిక పర్వాన్ని ఆహ్వానిస్తారా? - ప్రత్యర్థులందరూ చీలిపోయారు నిజమే కానీ, మూడేళ్లలోనే మేడమ్‌ని క్షమిస్తారా?- సందేహంగానే ఉండింది. ఇందిరాగాంధీకి కూడా సందేహంగా ఉండింది. అందుకే, రెండు స్థానాల నుంచి పోటీచేయాలనుకున్నారు. రాయబరేలీని నమ్మలేరు, అలాగని, బరిని వదిలి పారిపోలేరు. దానితోపాటు ఒక సురక్షితమైన స్థానం కూడా కావాలనుకున్నారు.

ఆశ్చర్యం, ఆమె మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సంచలనం. ఎందరో ఆనందించారు. పచ్చిగా ఉన్న అనుభవాలను మరచిపోలేని వారు మాత్రం అసహనం ప్రదర్శించారు. ఒక మిత్రుడు ఇందిరమ్మ ఎంపికకు ఒక కల్పనాత్మక కారణాన్ని కనుగొని వినోదించాడు. ఎంతటి అణచివేతనైనా భరించగలిగే సహనం కలిగినవారు, శత్రువునైనా క్షమించగలిగేవారు, ఎంతగా అవమానించినా ఎదురాడలేనివారు ఎవరున్నారబ్బా దేశంలో అని అధ్యయనం చేసిన తరువాత, వచ్చిన ఫలితాన్ని బట్టి ఇందిరమ్మ మెదక్‌ను ఎంచుకున్నారని ఆ మిత్రుడి సరదా కథనం.

మెతుకుసీమ రాజకీయ చైతన్యాన్ని గాని, అక్కడి ప్రజల పోరాటశీలతను గాని అవమానించడం కోసం అన్న మాట కాదది. అత్యంత మంచితనమూ మెతకదనమూ ఉన్న చోటును ఎంచుకుని ఇందిర సురక్షితంగా పోటీచేశారని చెప్పడానికి అన్న మాట. మెదక్ ఒక్కటేమిటి, 1977లో యావత్ దేశమూ ఇందిర పాలనను తిరస్కరిస్తే, మన రాష్ట్రం తలకెత్తుకుంది. అప్పటికి ఆరేళ్ల కిందటే, ఉద్యమాన్ని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసి అపఖ్యాతిపాలైన చెన్నారెడ్డిని తెలంగాణ కళ్లకద్దుకుంది. ప్రజలు గొప్పవాళ్లే కాదు, వెర్రివాళ్లు కూడా. తెలుగువాళ్లు వెర్రితనంలో నాలుగాకులు ఎక్కువే చదివారు. తెలంగాణ సంగతయితే చెప్పనే అక్కర్లేదు, తన్నిన పాదాలనే ముద్దాడే సహనం వారిది.

అదే ఆశ్చర్యం వేస్తుంది. నిజామునే ఎదిరించారు కదా, ఊడలు దిగిన భూస్వామ్యాన్నే సవాల్ చేశారు కదా, రాజ్యాన్నే గడగడలాడించారు కదా, తెలంగాణ ఇంతటి తేలిక ఎందుకయింది, ఎవరయినా సరే
ఆడుకోగలిగిన వస్తువెట్లా అయింది? అదే ఆశ్చర్యమూ విషాదమూ కూడా. సాహసమూ త్యాగనిరతీ అన్నీ ఎదుటివారి చాకచక్యాల ముందు రాజకీయ తంత్రాల ముందూ నిష్పలమెట్లా అవుతున్నాయి, తెలంగాణ విషయంలో ఎంతటి నిర్లిప్తతను నిర్లక్ష్యాన్నీ ప్రదర్శించినా పరవాలేదు లెమ్మనే ధైర్యం ఏలికలకు నేతలకు ఎట్లా వస్తున్నది- అన్నవి సులువుసమాధానాలు లేని ప్రశ్నలయ్యాయి.

ఇవాళ్టికి మూడు సంవత్సరాలు. దేశ ఆంతరంగిక వ్యవహారాల మంత్రే సాక్షాత్తూ ఒక ప్రకటన చేశారు. రెండు వారాలాగి దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయనొక్కడే కాదు వెనక్కి తీసుకున్నది, కేంద్రప్రభుత్వ నిర్ణయానికి నేపథ్యంగా ఉన్న ప్రకటనలన్నీ రెండుగా చీలిపోయాయి. రాష్ట్రం సమైక్యంగానే ఉంది, రాజకీయులకి మాత్రం రెండు నాలికలు, రెండు కళ్లు, రెండు వాదనలు. తొలి అఖిలపక్షంలో ఒక పార్టీ, రెండు వైఖరులు. సంబరం క్షణికమే అయినా, తెలంగాణ నిరాశను దిగమింగి, వందలాది ప్రాణహారతులిచ్చి మరీ తమ ఆకాంక్షను ప్రకటించింది. కమిటీలన్నారు, నివేదికలన్నారు- అన్నీ వచ్చాయి వెళ్లాయి.

జనాభీష్టం మారలేదు. కొత్త నిర్ణయమేదీ జరగలేదు. ద్వంద్వార్థాలతో మాట్లాడడంలో, వాయిదాలు వేయడంలో కేంద్రం ఆరితేరిపోయింది. సమస్యను సజీవంగా ఉంచాలి, 2014లో కూడా దాన్నుంచి జీవరసం పిండుకోవాలి. అందుకని అటో ఇటో తేల్చరు. ఒకే పార్టీ- పార్లమెంటు సభ్యులు పోరాడుతుంటారు, శాసనసభ్యులు పదవుల కోసం ఆరాటపడుతుంటారు. అణు ఒప్పందం నెగ్గించుకోవడానికి అందరినీ మెప్పించి ఒప్పిస్తారు. చిల్లరవర్తకంలో డాలర్లు కన్నం వేయడానికి చర్చల మీద చర్చలు జరిపి గట్టెక్కుతారు. తెలంగాణ సమస్య పరిష్కరించడానికి మాత్రం గడువులెన్ని దాటినా, పండగలెన్ని వచ్చిపోయినా, తీరుబాటు దొరకదు.

అయినా సరే సహనమే తెలంగాణ సంస్కృతి. పోరాటమే వారసత్వమని, గతమే కాదు వర్తమానమని చెప్పుకుంటారు, చేసి చూపిస్తారు కూడా. కానీ, అందరూ కలిసి చిత్రించిన సంక్లిష్టచిత్రపటంలో, తమ భవితవ్యం ఏమిటో అర్థం కాక, అయోమయంలో పడిపోయి, ఆశానిరాశల మధ్య ఊగిసలాడుతుంటారు. దెబ్బ మీద దెబ్బతో చితికిపోయిన తరువాత, మళ్లీ వేటుపడినప్పుడు మూలగడానికి కూడా శక్తిలేక మౌనంలో పడిపోతారు. ఈ నిస్సహాయత పాలకులకు తెలుసు కాబోలు, ఆట మాత్రం ఆపరు.

డిసెంబర్ తొమ్మిదికి మూడేళ్లు నిండుతున్న సందర్భంలో, తెలంగాణా ఎంపీలు అలకపాన్పు ఎక్కితే, అఖిలపక్షాన్ని మంజూరు చేశారు. ఓటు పడ్డ మరుక్షణం- చేసిన వాగ్దానం చిల్లుల జల్లెడ అయిపోయింది. కొత్త హోంమంత్రికి అవగాహన కోసమే తప్ప దానికి ప్రాధాన్యం లేదని ఒక మాట, ఒకరిని పిలుస్తామో ఇద్దరిని పిలుస్తామో తెలియదని మరో మాట. కాంగ్రెస్ తన అభిప్రాయం చెబుతుందో లేదో తెలియదు. అది చెప్పకపోతే, టీడీపీ వైసీపీ చెబుతాయన్న నమ్మకం లేదు. చివరకు అఖిలపక్షం విలువ ఎంత దిగజారిందంటే, ప్రపంచ తెలుగు మహాసభల కోసం తేదీ వాయిదా పడేంత. తెలంగాణ వాదులకు ఆ సభలే పుండుమీద కారం వంటివి. ఎటువంటి మౌలికవిధాన నిర్ణయాలు లేకుండా జరిగే తిరణాల వంటి సభల కోసం కీలకమయిన రాజకీయచర్చలను వాయిదా వేయడం అంటే, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో సమస్యకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి?

చిత్తశుద్ధి లేకుండా తూతూమంత్రంగా, ఎన్నికల దాకా సాగదీసే తంత్రంగా అఖిలపక్షం చర్చలను ఉద్దేశించి ఉంటే, తెలంగాణవాదులు ఏమి చేయాలి? పోరాటాన్ని తీవ్రం చేయాలి, ఉధృతం చేయాలి అనే వారూ ఉంటారు. వచ్చే ఎన్నికల దాకా ఓపిక పట్టి, నూరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని కేంద్రానికి బలం చాటాలి అని తీర్మానించేవారూ ఉంటారు. ఎన్ని ఎన్నికలకు తన జీవశక్తిని అర్పించగలదు తెలంగాణం? అసలు అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు గెలుచుకుని మాత్రం, తన మాట నెగ్గించుకోగల శక్తి తెలంగాణకు ఉన్నదా, ఆ దిశగా పరిణామాలను నడిపించగలిగిన యుక్తి తెలంగాణ నేతలకు ఉన్నదా- అంతిమంగా ఈ సందేహమూ వస్తుంది.

పోనీ, అణచిపారేయరాదూ, ఓపికుంటే ప్రతిఘటిస్తాం, లేకపోతే, ఖర్మ ఇంతేనని ఊరుకుంటాం- అని ఒక సగటు తెలంగాణవాది అనుకుంటున్నాడు. అణచివేత ఇప్పుడు లేదని కాదు. కానీ, తెలంగాణ ఆకాంక్ష అన్నది ఆ ప్రాంతంలోని సకల రాజకీయపక్షాలవారు మాటవరసకయినా వ్యక్తం చేస్తున్నది కాబట్టి, దానికి ఒక అనివార్యత ఉన్నది. అందుకని, ఉక్కుపాదానికి రబ్బరుతొడుగులు అలంకరిస్తున్నారు. పోలీసుతూటాలు చేయవలసిన పనిని, నిరాశానిస్ప­ృహల వాతావరణమే చేస్తున్నది. ఆత్మహత్యలు విరగపండుతున్న నేలలో, చేతికి నెత్తురంటే హత్యలెందుకు?

కేంద్రాన్ని నిందించవలసిందే. కానీ, పంజాబ్ విషయంలో, కాశ్మీర్ విషయంలో అది అనుసరించిన నాన్పుడు-అణచివేత ద్వంద్వ వైఖరి ఎవరికి తెలియనిది. ఆరు దశాబ్దాలుగా ఆరనికుంపటిగా ఉన్న ఈశాన్యం మరో విషాద ఉదాహరణ. ఏ సమస్యను మాత్రం పూనుకుని పరిష్కరించింది కాంగ్రెస్? కానీ, ఈ మూడేళ్ల కాలంలో తక్కిన రాజకీయపార్టీలు ఏమి చేశాయి? రెండు ప్రాంతాల్లో రెండువాదనలను పెంచిపోషించి కలహభోజనం చేయడం తప్ప, ప్రజల్లో ఒక అవగాహన, ఏకాభిప్రాయం కల్పించడానికి చేసిందేమిటి? తమ పార్టీ వారే కదా, ఉభయప్రాంతాల్లోనూ? ఎందుకు చర్చలు పార్టీల్లో ఆంతరంగికంగా జరగవు? ఎందుకు ఒక సీరియస్ సమస్యను సీరియస్‌గా తీసుకోవు?

వెయ్యి ఆత్మహత్యల నెత్తురు అన్ని పార్టీల చేతికీ అంటింది. ఇక ఇది అయ్యేది కాదనుకుంటే, రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాల్లో జరిగినట్టే, కొత్త పార్టీని ఆశ్రయించే ధోరణి తెలంగాణాలోనూ ప్రబలుతుంది. ప్రమాద సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. అప్పుడు సహేంద్ర తక్షకాయ స్వాహా అన్నట్టుగా, తెలంగాణ వాదమూ తెలంగాణ పార్టీలూ అన్నిటితో పాటు, రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలని, సాధించాలని ఆశిస్తున్న పాతపార్టీలన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. ప్రాంతీయ అసమానతలు పరిష్కారం కాకపోగా, స్థానికులకు అధికారం అన్న నినాదం ఆవిరైపోయి- సమస్త వనరులూ కబళించగలిగిన రాబందు రాజ్యం రెపరెపలాడుతుంది.

No comments:

Post a Comment