Wednesday, December 19, 2012

రుద్రమాంబా భద్రకాళీ లోచనోజ్జ్వల రోచులేవీ?

రెండున్నరేళ్ల కిందట దుబాయ్‌లో ప్రపంచ పర్యాటకస్థలాల ప్రదర్శన జరిగింది. వివిధ దేశాల వారు తమ తమ దేశాల్లోని పర్యాటక స్థలాలను వివరించే స్టాల్స్ అందులో ఏర్పాటు చేశారు. 'ఇండియా టూరిజమ్' వారు కూడా అందులో పాల్గొన్నారు. కేరళ, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు భారత్ తరఫున ఆ మేళాలో తమ తమ రాష్ట్రాల్లోని పర్యాటకస్థలాలను అందమైన ఛాయాచిత్రాలతో, బ్రోచర్లతో సందర్శకులకు వివరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంవారు హంపీ విజయనగరాన్ని ఎంతో ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. యునెస్కో వారసత్వ హోదా పొందిన ఆ చారిత్రక స్థలాలను అంతర్జాతీయ పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా ప్రచారం చేస్తున్నారు.

విజయనగరం సామ్రాజ్యం వర్థిల్లింది ఐదారువందలేళ్ల కిందటే. మన గోలకొండ వయస్సు కూడా దాదాపు అదే. అంతకంటె నాలుగైదు వందలేళ్ల పాతదైన ఓరుగల్లు ప్రపంచవారసత్వ హోదాకు, పర్యాటకాన్ని ఆకర్షించడానికి మరింత అర్హమైనది. మరి ఎందుకు తెలుగు చరిత్రకు గుర్తింపు లేదు? ప్రభుత్వం ఎందుకు శ్రద్ధపెట్టలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం అటువంటి ప్రదర్శనల్లో ఎందుకు ఉండడంలేదు? ఈ పరిస్థితికి కారణమేమిటని ఇండియా టూరిజమ్ ఉన్నతాధికారి అయిన ఒక మిత్రుడిని అడిగాను. మనవాళ్లు దేనికీ ఉత్సాహం చూపించరు, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపర్యాటక పటంలో భాగం చేయాలన్న దృష్టి వారికి ఉండదు- అని ఆయన పెదవి విరిచారు. అంత మాత్రమేనా? అంత మర్యాదగా చెప్పాల్సిన కారణమేనా?

ఒక దిశా లక్ష్యమూ లేని ప్రపంచ తెలుగుసభల కోసం నలభైకోట్లు ఖర్చుచేస్తూ, కాకతీయ ఉత్సవాల నిర్వహణకు మాత్రం కోటీ అరకోటీ విదిలిస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని చూస్తే, తెలుగువారి చరిత్ర అనాథగా మిగిలిపోవడానికి వేరే కారణాలు వెదకనక్కరలేదు. తెలుగుప్రాంతాలన్నిటినీ దాటి రాజ్యాన్ని పశ్చిమానికీ దక్షిణానికీ
కూడా విస్తరించిన తెలుగువారు కాకతీయులు. అంతటి మహారాజ్యానికి రాజధానిగా వర్థిల్లినది అనుమకొండ-ఓరుగల్లు. వెయ్యేళ్లకు పైగా వయస్సున్న పట్టణం. అంత వయస్సుండి, ఇప్పటికీ పెద్ద పట్టణంగా కొనసాగుతున్నవి వరంగల్లు, బెజవాడ మాత్రమే. నూరు నూటాయాభై సంవత్సరాల వయస్సున్న చారిత్రక స్థలాలను కూడా అపురూపంగా చూసుకుంటారు అమెరికన్లు. ఐదువందలేళ్లు అంటే వారికి చరిత్రపూర్వయుగమే. వెయ్యేళ్లు అంటే పురాతత్వమే. కానీ, మన దేశంలో మాత్రం వేల ఏళ్ల చరిత్ర ఆక్రమణలకీ, స్మగ్లింగ్‌కీ, అనాదరణకీ బలిఅయిపోతూ ఉంటుంది. మధ్యయుగాలలో పరాయి ఆక్రమణదారులు మన గుళ్లూగోపురాలను ధ్వంసం చేశారని గుండెలు బాదుకునేవారిని చూస్తుంటాం. ఇప్పుడు మన ప్రభుత్వాలు, ప్రణాళికాకర్తలు చేస్తున్న చరిత్రవిధ్వంసంతో పోలిస్తే, గజనీలు ఘోరీలు చేసినదెంత అనిపిస్తుంది.

చరిత్ర అంతా పవిత్రమైనది కాకపోవచ్చు. వర్తమానంలాగే, గ డచిన కాలం కూడా అన్యాయాలతో అక్రమాలతో అవినీతితో అణచివేతతో పోరాటాలతో విజయాలతో అపజయాలతో రాజీలతో నిండినదే. కానీ, అది మనం నడచివచ్చిన తోవ. మన శైశవం, మన బాల్యం. మన తప్పటడుగులు, మన కేరింతలు, మన నెత్తురు, మన కన్నీళ్లు. కాకతీయులు మహాసామ్రాజ్యాన్ని నిర్మించింది కేవలం యుద్ధాలతో జైత్రయాత్రలతో మాత్రమే కాదు. గహనాటవులతో, రాతినేలతో అతి పలచని జనసాంద్రత కలిగిన ఉత్తర దక్షిణ తెలంగాణాల్లో మనుషులు మనగలిగే జీవనవ్యవస్థలను నిర్మించి, అనేక నవ గ్రామాలను అవతరింపజేసి కాకతీయరాజ్యం వర్థిల్లింది. సాగు కోసం నీటి వసతిని కల్పించడానికి కాకతీయులు అనుసరించిన విధానాలు అపూర్వమైనవి, సృజనాత్మకమైనవి. కాలక్రమంలో పాక్షికంగా దెబ్బతిన్న కాకతీయ తటాకాలను నిజాములే పూర్తిస్థాయికి పునరుద్ధరించారు. తుగ్లక్ హయాంలో దండయాత్రలకు గురిఅయి ధ్వంసమయిన కాకతీయ శిథిలాలను పరిరక్షించింది కూడా ఏడో నిజాము కాలంలో నెలకొల్పిన పురాతత్వశాఖే కావడం విశేషం. తెలంగాణలోని గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఇరిగేషన్ కోసం కానీ, పురాతత్వ పరిరక్షణ కోసం కానీ ప్రజాస్వామ్యయుగంలో చెప్పుకోదగిన ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం విశేషం.

సామాజికంగా కూడా కాకతీయయుగం విశిష్టమైనది. శాతవాహనకాలంలో బౌద్ధాన్ని, ఆతరువాతి శతాబ్దాలలో జైనాన్ని నేల నిండా నింపుకున్న తెలంగాణ- శైవానికి పరివర్తితం అయిన పరిణామాన్ని కాకతీయయుగం ప్రతిబింబిస్తుంది. అదికూడా కులధర్మాలనీ, ఆదిమ రాజ్యనీతిని అనుసరించిన రాజ్యమే కావచ్చును కానీ, శూద్రకులాలు పాలకస్థితికి ఎదిగిన కాలం కూడా అదే. వివిధ సామాజికవర్గాల, వృత్తివర్గాల సహకారంతో పాలన నిర్వహించడానికి కాకతీయులు ప్రయత్నించారు. కాకతీయ సామ్రాజ్యం ఆర్థికంగా ఎంతటి పరిపుష్టిగా ఉండేదంటే, ఢిల్లీ నుంచి ప్రతి రెండేళ్లకోమారి దండయాత్రలు సాగాయి. ఒకసారి కొల్లగొట్టిన ఖజానా మరి రెండేళ్లకే నిండుగా ఉండేదంటే, ఆ రాజ్యంలో ఉత్పాదకత ఎంత ఉండేదో ఊహించవచ్చు. తెలుగుసాహిత్యం ఆ రాజ్యం కేంద్రంగా పెద్దగా రాకపోయి ఉండవచ్చును కానీ, సంగీత, నృత్య, శిల్ప కళల్లో అత్యున్నతమైన ప్రమాణాలను, నైపుణ్యాన్నీ ఆ యుగం ప్రదర్శించింది.

ఆధునిక ప్రాబల్యకులాలు, కాకతీయులు తమ పూర్వీకులే అని చెప్పుకోవడానికి 20వ శతాబ్ది ఆరంభం నుంచి పరిశోధనోద్యమం ద్వారా ఎంతో ప్రయత్నించాయి. కాకతీయుల సామాజిక మూలాలు ఏమిటో స్పష్టం కాకపోవడంతో, నైజాం రాజ్యభూభాగంలో ఉన్న ఓరుగల్లును వదిలి, హంపీ విజయనగరం వైపు బ్రిటిష్ ఆంధ్రపరిశోధకులు, కవులు, పండితులు దృష్టిసారించారు. ఫలితంగా విస్మరణ స్వాతంత్య్రానంతరం, ఆంధ్రప్రదేశ్ అవతరణానంతరం కూడా కొనసాగింది. ఓరుగల్లు శిల్పసంపదను మొన్నమొన్నటిదాకా తెలుగు చిత్రపరిశ్రమ గుర్తించి చిత్రీకరించనేలేదు. కాకతీయరాజ్యశిథిలాలకు, ఓరుగల్లు కోటకు అంతర్జాతీయ హోదా కోసం ప్రయత్నించకపోవడంలో రాష్ట్రప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగానే కనిపిస్తుంది. శిథిలాలు ఉన్న ప్రాంతంలో తవ్వకాల కొనసాగింపు నిలిచిపోయింది. వేయిస్తంభాల గుడి వెనుక మంటపాన్ని పునర్నిర్మాణం కోసం కూల్చివేసి పదేళ్లు కావస్తున్నా, పునరుద్ధరణ ప్రారంభం కాలేదు.

కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం, ఇంకా వరంగల్లు జిల్లాలోని అసంఖ్యాకమైన దేవాలయాలు- ఇవన్నీ చరిత్ర అభిమానులను, పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అవకాశమున్నా- సంబంధిత శాఖలు కావలసిన మౌలిక సదుపాయాలను, ప్రచారాన్ని చేపట్టలేదు. కాకతీయ సామ్రాజ్యకాలం నాటి అంశాల గురించి పరిశోధన కోసం విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పీఠాన్ని స్థాపించడం కానీ, పర్యాటక సహాయకులను తీర్చిదిద్దే విద్యాకార్యక్రమాలను ప్రారంభించడం కానీ చేస్తే- వరంగల్లు కేంద్రానికి కొంత హంగు సమకూరి ఉండేది. కాకతీయ కాలం నాటి నృత్య, నృత్త కళలనుంచి స్వీకరించి అభివృద్ధి పరచిన పేరిణి శివతాండవం- నటరాజ రామకృష్ణతోనే చరిత్రలో కలసిపోయింది.

పర్యాటకగమ్యంగా తీర్చిదిద్దడం పెద్ద ఘనకార్యమని కాదు, చిత్తశుద్ధితో చారిత్రకస్థలాలను పరిరక్షిస్తే, నిర్వహిస్తే, ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుంది, వాటి శైథిల్యమూ తగ్గుతుంది. స్థానికంగా కొన్ని మౌలికవసతులు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యవసాయం సంక్షోభంలో పడి ఆత్మహత్యల కేంద్రంగా మారిపోయిన వరంగల్లు జిల్లాకు ఒక అనుబంధ ఆర్థిక రంగం ఏర్పడి ఉండేది. అన్ని రకాల పాలనావిభాగాల లాగానే, మన పర్యాటక విభాగం కూడా భావదారిద్య్రంతో వర్థిల్లుతోంది. నాలుగు డాలర్లు సంపాదించాలని మన ప్రభుత్వాలకు తహతహగానే ఉంటుంది. కానీ, అందుకు సొంత బుర్రనీ, స్వావలంబననీ ఉపయోగించాలని మాత్రం వారికి తెలియదు.

పర్యాటకస్థలాల అభివృద్ధి అనగానే, నాలుగు ఎయిర్ కండిషన్డ్ గెస్ట్‌హౌస్‌లు, ఒకటో రెండో బార్‌లు కల్పిస్తే సరిపోతుంది అనుకుంటారు. స్థానికమయిన పరిస్థితులకు, అవకాశాలకు అనుగుణమైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధివ్యూహాన్ని రూపొందించే దూరదృష్టి కానీ, జనహిత దృష్టి కానీ లేని పాలకుల కారణంగా- సకలాన్ని విధ్వంసం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకునే దళారీతనమే వర్ధిల్లుతోంది.

కాకతీయ ఉత్సవాలంటే, కొందరు ఆస్థాన కళాకారులతో నిర్వహించే సాంస్క­ృతిక ప్రదర్శనలు కావు. లేదా రుద్రమదేవినో, ప్రతాపరుద్రుడినో కీర్తించే భజన కార్యక్రమాలూ కావు. ఒక ఘనమైన చారిత్రక యుగంతో స్థానిక ప్రజల జ్ఞాపకాన్ని పునస్సంధానం చేసే గొప్ప కర్తవ్యం. పొందవలసిన ప్రేరణను, తీసుకోవలసిన గుణపాఠాలను, రచించుకోవలసిన భవిష్యత్ సమాజచిత్రాన్ని ప్రత్యక్షం చేసే వర్తమాన అవసరం. పాలకులు ఏలికలు తమ పూర్వీకులను కూడా గుర్తుచేసుకోలేనంత అజ్ఞానపు విలాసంలో పడిపోయినా, ప్రజలు మాత్రం మంచీచెడూ రాజూపేదా కలగలసిన చరిత్రతో పెనవేసుకోవాలనే కోరుకుంటారు. రుద్రమదేవినుంచి ఒక స్ఫూర్తిని, సమ్మక్క సారక్కల నుంచి మరో ఉద్వేగాన్ని స్వీకరిస్తారు.

No comments:

Post a Comment