Monday, December 24, 2012

అధికార రాజదండమే పుంలింగం

మరణశిక్ష అన్యాయమనే నమ్మాను, కసబ్ విషయంలో కూడా అట్లాగే అనిపించింది. కానీ, వీళ్ల విషయంలో అట్లా అనిపించడంలేదు- అంటోంది మా అమ్మాయి. మీ అమ్మాయి, ఆ అమ్మాయి, మరో అమ్మాయి, ఎవరైనా అమ్మాయి బహుశా ఇప్పుడు అటువంటి మాటే అంటారు. ఆ మాట విన్నపుడు, దేశమంతటా నగరాల్లో పట్టణాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న, కొవ్వొత్తులు వెలిగించిన, శనివారం నాడు రాష్ట్రపతి భవన్ ముందు జలఫిరంగులకు, లేజర్ బెత్తాలకు ఎదురొడ్డి నినదించిన ఆ వయసు పిల్లలందరి మనస్సూ ఒకటేనని అనిపించింది.

ఉగ్రవాది ఎప్పుడో ఒకప్పుడు విరుచుకుపడి కాసేపు బీభత్సం చేసి కొన్ని ప్రాణాలు తీసేసి నిష్క్రమిస్తాడు. కానీ, మానవత్వపు సీమోల్లంఘన చేసే మగ ఉగ్రవాది ఇక్కడా అక్కడా నీ పక్కనా నా పక్కనా మనమధ్యలో సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఢిల్లీ అమానుషం ఆడపిల్లలందరిలో, ముఖ్యంగా పట్టణప్రాంతాల ఆడపిల్లల్లో కలిగించిన భయం, ఆందోళన, బీభత్సం సామాన్యమైనది కాదు. అందుకే ఇంతటి ఆక్రోశం.

ఇదంతా దోషులను భౌతికంగా నిర్మూలించాలనే ఆవేశం కాదు. ప్రతీకారంగా మరో హత్య చేయాలనే ఉన్మాదమూ కాదు. చేయని నేరానికో, అభిప్రాయ వ్యక్తీకరణకో, సమాజాన్ని మార్చడానికో ప్రయత్నించే వారిని అన్యాయంగా శిక్షించినప్పుడు అది కూడదని పోరాడే సంస్కారమే, నిజమైన నేరాలను, మనుషుల సంఘనీతిని భగ్నపరిచే దారుణాలను అరికట్టమని దోషులను శిక్షించమని రాజ్యాన్ని అర్థించవలసి వస్తుంది. ఎంతటి వైరుధ్యం? హక్కులను దెబ్బతీసి హద్దుమీరవద్దనీ ప్రభుత్వాన్ని అడగాలి, బాధ్యతని నిర్వర్తించి నేరాన్ని అరికట్టమనీ అడగాలి. రేపిస్టులను ఉరితీయమని గర్జిస్తున్న యువజనం వాస్తవంలో కోరుకుంటున్నది భద్రతను
కల్పించమని, మానవత్వాన్ని నిలబెట్టమని. నేరాన్ని జరగనిచ్చి, నేరస్థులను ఉరితీసుకుంటూ పోవడం వల్ల రక్షణ కోరుకునే వారికి ఒరిగేదేమీ లేదు. నేరానికి పాలుపోసి పెంచుతున్న సంస్కృతిని, నేరమే అధికారమైన దుర్మార్గాన్ని మూలం నుంచి పెకిలించివేయకపోతే, పదే పదే ఇదే ఘోరకలిని అనుభవించవలసి వస్తుంది.

దేశరాజధాని నగరం. ఆది నుంచి దుశ్శాసనపట్టణమేమీ కాదు. అక్కడ కూడా ఆ నగరాన్ని సొంతం చేసుకున్న మనుషులూ ప్రేమించిన మనుషులూ ఒకప్పుడుండేవారు. ఆ ఊరికీ ఒక సహజీవన సంస్క­ృతి, ఒక తెహజీబ్ ఉండేవి. పట్టణమన్నాక నేరం ఉండకుండా ఉండదుకానీ, ఇట్లా కౌరవసభ మాదిరిగా ఉండేది కాదు. ఇంద్రప్రస్థం, మొగలుల రాచపీఠం, బ్రిటిషర్ల చివరి రాజధాని ఎన్నో పురాతన జనావాసాలను, సమాజాలను జీర్ణం చేసుకుని మహానగరమైంది. ఇప్పటికీ, కమ్యూనిటీజీవితం ఢిల్లీలో మిగిలే ఉన్నది కానీ, దాన్ని కార్పొరేట్, పారిశ్రామిక, మాఫియా సంస్క­ృతి చుట్టుముట్టి బలహీనం చేసింది. ఇప్పుడా ఊరు ఎవరికీ చెందని అనాథ, ఎవరికీ సొంతం కాని అవారా. సంఘజీవనమనేదే మరుగైన ఏకాకుల నగరం. భద్రజీవులందరూ గేటెడ్‌కమ్యూనిటీల్లోనో, గన్‌మెన్‌ల పహారాలోనో ఆదమరిస్తే, ఉన్న పోలీసుబలగమంతా విఐపీల కాపలాకే సరిపోతే, రోడ్డుమీది మనిషి మాత్రం క్రూరమృగాల మధ్య లేడిపిల్ల వలె బిక్కుబిక్కుమంటూ బతకవలసిందే. చుట్టుపక్కల మధ్యయుగాల భూస్వామ్యం, అవిద్య, దౌర్జన్య సంస్క­ృతుల చీకటి, నడుమ దేదీప్యమానంగా వెలిగే పిశాచనగరం!

విత్తు ఒకటి నాటితే చెట్టు ఒకటి మొలుస్తుందా? అధికార రాజదండమే పుంలింగం. వ్యవస్థ ఆయువుపట్టు పార్లమెంటులోనో, రాష్ట్రపతిభవన్‌లోనో, టెన్ జనపథ్‌లోనో ఉందనుకుంటే అది అర్థసత్యమే. మాయలఫకీరు ప్రాణం గ్రామంలో ఉన్నది. ఢిల్లీనగరికి కూతవేటు దూరంలో స్త్రీపురుష, సంబంధాలను శాసించే ఖాప్ పంచాయతీల్లో ఉన్నది. వంచిన తల ఎత్తితే నరికేసే అగ్రవర్ణభూస్వామ్యంలో ఉన్నది. చారెడు నేల కోసం కళ్లుపెరికి గొంతుకోసిన లక్ష్మింపేటలో ఉన్నది. పబ్‌ల వద్ద కాపలా కాసి రోడ్డు మీది కీచకవినోదం పంచే అభినవ నైతిక రక్షకుల ఆభిజాత్యంలో ఉన్నది.

నీతిని, సభ్యతను, నడవడిని చూపుడువేళ్ల లాఠీలతో నిర్ణయించాలనుకునే సరికొత్త నాజీలలో ఉన్నది. సకల వ్యవస్థలలో పరిమళించేది మగదుర్వాసనే. కెమెరాలెన్సు మగదే. సినీకవి కలమూ మగదే. చానెళ్ల నిండా ప్రవహించే ఉద్రిక్తవార్తాస్రవంతి పరమ పురుషత్వానిదే. గర్భంలోనే ఆడశిశువును చిదిమేసే, నాలుగుడబ్బుల కోసం గర్భాశయాలను కోసే వైద్యుడి వృత్తీ పురుషప్రవృత్తే. కోడల్ని హింసించే అత్త, ఆరడి పెట్టే ఆడబిడ్డా మగపాత్రలే. కట్నం ఇవ్వలేక అణగారిపోయే పిల్ల తండ్రి ఆడపాత్రే. పురుషాధిక్యం ఒక వ్యవస్థ. ఆడామగా నిమిత్తం లేకుండా బలహీనతలో ఆడతనం, ఆధిక్యంలో పురుషత్వం స్థిరపడిపోయాయి. పీల్చే గాలి, చేసే ఆలోచన, చూసే చూపు, మాట్లాడే మాట- సమస్తమూ పురుషాహంకారభరితం అయినప్పుడు ఎవరిని శిక్షించాలి? మూలచ్ఛేదం దేనిని చేయాలి? అంగచ్ఛేదన ఎక్కడ జరగాలి?

ఫేస్‌బుక్ యువతరం సరదా కబుర్ల నుంచి, ఉత్తుత్తి స్నేహోన్మాదాలనుంచి- తమను తాము పెకిలించుకుని కొవ్వొత్తులైనా సరే పట్టుకుని రోడ్డు మీదికి వస్తున్నారు. అంతర్జాలంలోనే తమ వ్యక్తిత్వాలను నిమజ్జనం చేసినవారు, వర్చువల్ రియాలిటీ నుంచి రియాలిటీలోకి దిగివస్తున్నారు. సంతోషమే. కానీ, యంగ్‌తరంగాల్లారా, అత్యాచారం ఈ వ్యవస్థలో ఒక అధికారతత్వమని, నియంత్రణా రూపమని మీకు ఇంకా తెలిసిరాలేదు. బీదాబిక్కీలోని అసాంఘికశక్తులు, ధనమదాంధులైనా మాఫియాబాస్‌లు, ముఠాకోరులు, విలాసపురుషులు- వీరు మాత్రమే కాక, ప్రభుత్వాలు కూడా దాన్ని అణచివేత రూపంగా అనుసరిస్తాయని మీరు చదువుకుని ఉండకపోవచ్చు. ఢిల్లీ మహానగరంలో రహదారులపై వాహనంలో సంచరిస్తూ యథేచ్ఛగా అమానుషం జరిపినప్పుడు మీ కళ్లు తెరుచుకున్నాయి కానీ, దేశమంతటా గ్రామాల్లో, ఆదివాసీప్రాంతాల్లో ఆధిపత్యశక్తులు, గూండాలు చేస్తున్న అత్యాచారాలు ఏ సంచలనమూ లేకుండానే విస్మ­ృతిలోకి జారుకుంటాయి. ఈశాన్య ప్రాంతంలో సాయుధబలగాల ప్రత్యేకాధికారాల చట్టం ఆసరాతో యథేచ్ఛగా హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని షర్మిల అనే మహిళ ఏళ్ల తరబడి నిరాహారదీక్షలో ఉన్నారని ఈ యువకులలో ఎందరికి తెలుసును?

ఒక్క ఈశాన్యం అనేముంది, స్వేచ్ఛను, ప్రత్యేక ప్రతిపత్తిని కోరుతున్న ఉద్యమప్రాంతాలలో, విప్లవ పోరాటాల కేంద్రాలలో అత్యాచారాల హాహాకారాలు ఇనుపగోడలను దాటి బయటకు వినిపించవు. తమపై అఘాయిత్యం జరిగిందంటూ పదకొండు మంది విశాఖ జిల్లా వాకపల్లికి చెందిన ఆదివాసీ మహిళలు ఊరూరికి తిరిగి, ప్రతి అధికారకేంద్రాన్నీ అర్థించినా అది అరణ్యరోదనమే అయింది. ఢిల్లీ ఘోరంతో ఉలిక్కిపడిన యువజనం ఈ ఆక్రందనలకు కూడా స్పందించే సున్నితత్వాన్ని అలవరచుకుంటారా?

ఢిల్లీలో జరిగింది కేవలం భౌతిక హింస కాదు, కేవలం అవమానమూ కాదు. అది కొత్త స్థలాలకు, కొత్త జీవనసాఫల్యాలకు, సాధికారతకు ఎదుగుతున్న స్త్రీలకు ఒక హెచ్చరిక, ఒక ఆధునిక లక్ష్మణరేఖ. ఆ హెచ్చరికను తిరస్కరించడంలోనే, ఆ రేఖను అధిగమించడంలోనే మహిళలకు భద్రత ఉన్నది. దోషులకు శిక్ష పడడం, సమాజం రక్షణ బాధ్యతను స్వీకరించడం ఒక ఎత్తు అయితే, ఆడవారి పురోగమనానికి సానుకూలత కల్పించే చర్యలు తీసుకోవడం మరో ఎత్తు. తమ స్వేచ్ఛను, ఆత్మాభిమానాన్ని, ధిక్కారాన్ని రాష్ట్రపతి భవన్ ముందు వినిపించిన యువతులు, తమ నిరసనను ఒక సామూహిక సంకల్పంగా మలచుకోవాలి. సమాజంలోని సమస్త రంగాలను ప్రజాస్వామ్యీకరించడానికి, స్త్రీకరించడానికి ప్రయత్నించాలి. లాభదృష్టే పరమావధి అయిన సంస్క­ృతి ఆర్థిక అవినీతినే కాదు, సాంఘిక విలువల క్షీణతనూ ప్రోత్సహిస్తుంది. గర్భస్థమరణాల నుంచి జననానికి, చాకిరీల బాల్యం నుంచి పాఠశాలలకు, వంటింటి బందిఖానా నుంచి బహిరంగ జనజీవనానికి వేగంగా దూసుకువస్తున్న స్త్రీలు, దుర్మార్గధనస్వామ్యపు అమానవీయ సంస్క­ృతినీ, అవశేషపు సాంప్రదాయ అణచివేతను ఎదుర్కొనవలసి వస్తున్నది. ఇప్పుడిక ఇది మనుగడకు సంబంధించిన పోరాటం. ఆకాశంలో సగం పిడుగులు కురిపించవలసిందే.

అందుకే, లలిత లలితంగా మృదువుగా దీనంగా ఆడపిల్లలు మాట్లాడడం లేదు.
ప్లకార్డులమీది వాళ్ల నినాదాలను చదవండి.

No comments:

Post a Comment