Saturday, January 5, 2013

నిర్ణయాత్మక దశలో వివేకమే కీలకం

ఎక్కడా ఏ చడీ చప్పుడూ వినపడకున్నా , అదిగో తెలంగాణ వస్తోందని హడావుడి చేసే కెసిఆర్‌, ఇప్పుడు ఎందుకు అఖిలపక్షం బూటకం, నెలగడవు నాటకం అని నిరాశాగీతం ఆలపిస్తున్నారు? ఉద్యమం చేయాలనేవాళ్లంతా తాము విఫలమైతే చూసి సంతోషించాలనుకునేవాళ్లే అని నిర్ధారించిన చంద్రశేఖరరావు, ఇప్పుడు ఉద్యమమొక్కటే తెలంగాణకు మార్గం అని ఎందుకు నినదిస్తున్నారు?  సాగరహారం జనసమీకరణలో  జెఎసి తలమునకలై ఉంటే, ఢిల్లీ  వెళ్లి నెలరోజులు బసచేసి, తనకేవో సంకేతాలున్నాయంటూ  హడావుడి చేసిన టిఆర్‌ఎస్‌ నేత ఇప్పుడు ఏ సంకేతాలందాయని పోరాటకార్యక్రమం ప్రకటించారు? 

అప్రియమైనవే అయినా తెలంగాణవాదులను కూడా తొలుస్తున్న ప్రశ్నలివి. తెలంగాణ నాయకుడి మీద అపనమ్మకంతోనో, అనుమానంతోనో వేసుకునే ప్రశ్నలు కానక్కరలేదు. ఒక వ్యక్తి లేదా నేత ఆచరణలో పొంతన కనిపించనప్పుడు నిజంగా కలిగే సందేహాలు అవి. ఈ వైరుధ్యాలకు ఎవరి ఆపాదనలు వారికి ఉండవచ్చును కానీ, విషయాన్ని నిష్పాక్షికంగా అంచనా వేయవలసిన అవసరం మాత్రం ఉద్యమశ్రేయోభిలాషులకు ఉంటుంది.

నిజమే. నెలరోజుల్లో పరిష్కారం ఇస్తామని, ఇదే ఆఖరి అఖిలపక్షమని కేంద్రమంత్రి షిండే చెప్పారు తప్ప, తెలంగాణ ఇస్తామని చెప్పలేదు. నిర్ణయం ఏదైనా రావచ్చు. విభజనకు అనుకూలంగానూ రావచ్చు. ఏదో ప్యాకేజీయో, ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటో కావచ్చు. అటువంటప్పుడు, అఖిలపక్షంలో వాతావరణం సానుకూలంగా కనిపించిందని చెప్పి, తెలంగాణ అభిమానుల్లో లేనిపోని ఆశలను నాయకుడు కల్పించకూడదు. అలాగని, సాగుతున్న ప్రక్రియలో కనిపించిన మార్పును చూడడానికి నిరాకరించి, పూర్తి వ్యతిరేక వైఖరినీ అనుసరించడమూ నాయకుడికి తగినది కాదు. మూడేళ్ల తరువాత అఖిలపక్షం జరిగింది,. అది వాస్తవం. దానిలో టిఆర్‌ఎస్‌ కూడా పాల్గొన్నది. అదీ వాస్తవం. సమావేశంలో పాలుపంచుకున్నవారు, నిర్వహించిన వారు చెప్పిన అంశాలను, వ్యక్తం చేసిన వైఖరులను, ఉద్యమగమనాన్ని బేరీజు వేసుకుని, ఆచరణాత్మకమైన వైఖరిని అనుసరించడం ఉద్యమనాయకుల లక్షణం. సమావేశం నుంచి బయటకు రాగానే, అంతా బూటకమని తీసిపారేయడం మంచిదో చెడ్డదో వేరే విషయం కానీ, కెసిఆర్‌ ఇంతకాలంగా అనుసరిస్తూ వస్తున్న వైఖరి అయితే కాదు. అందువల్లనే, ఆ మార్పు ఆశ్చర్యకరంగానూ, ఆందోళనకరంగానూ కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ తాజా వైఖరి విషయంలో కూడా టిఆర్‌ఎస్‌ «తీరు పొంతన లేకుండానే ఉన్నది. గతంలో ఎదురయిన అనుభవాల రీత్యా తెలుగుదేశం పార్టీని తెలంగాణ వాదులు విశ్వసించకపోవడానికి ఇప్పటికీ ఆస్కారం ఉన్నది. అయితే, ఆవిశ్వాసం భావావేశాలతో కూడుకుని ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ తాను నూటికి నూరుపాళ్లు సానుకూలమని ప్రకటించినట్టు చెప్పుకుంటోంది. దాన్ని టిఆర్‌ఎస్‌ కానీ, తెలంగాణవాదులు
కానీ విశ్వసించనక్కరలేదు. కానీ నూటికి యాభయ్యో అరవయ్యో పాళ్లు మార్పు వచ్చిందని గుర్తించాలి కదా? ఇప్పటికి తెలుగుదేశం చేసినదాన్ని గుర్తిస్తూనే, మరింత స్పష్టత కావాలని కోదండరామ్‌ అన్నారు. అది వాస్తవ వైఖరి అవుతుంది కానీ, నిరాకరణ వల్ల సాధించేది ఏమిటి?

ఫలానా వైఖరికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికీ, ఆ వైఖరిని ఉపసంహరించుకోలేదని చెప్పడానికీ తేడా తప్పకుండా ఉన్నది. ఆ తేడా లేకపోతే, డొంకతిరుగుడు మాటలతో లేఖ రాయవలసిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఏముంటుంది? తమ పార్టీకి చెందిన తెలంగాణేతర ప్రాంతాల నేతలను సంతృప్తిపరచడానికి చంద్రబాబు అటువంటి వ్యక్తీకరణను ఎంచుకుని ఉంటారు. షిండేకు తెలుగుదేశం నేత రాసిన లేఖలో ఎన్ని సార్లు తెలంగాణ అన్న మాట ప్రస్తావితమైంది, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని నేరుగా చెప్పారా లేదా అన్న చర్చ- లోతులకు వెడితే నిలబడేది కాదు. తెలంగాణ డిమాండ్‌కు అనాసక్తమైన (ఞ్చటటజీఠ్ఛి) ఆమోదాన్ని వ్యక్తం చేయడం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత వైఖరి. అనాసక్తమైనదైనా అది ఆమోదమే. ఫలానా పాత వైఖరికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనడానికి, ఆ ఫలానా వైఖరిని ఉపసంహరించుకోలేదనడానికీ - అర్థంరీత్యా ఉన్న తేడా అనాసక్తత మాత్రమే. సిపిఐ కూడా మొదట్లో అనాసక్త ఆమోదాన్నే తెలిపింది. తెలంగాణ డిమాండ్‌ను ఆమోదిస్తున్నామని, అయితే దాని కోసం ప్రత్యేకంగా పోరాటం చేయబోమని ఆ పార్టీ చెప్పింది. తరువాత ప్రత్యక్ష పోరాటంలోకి వచ్చింది.  తెలంగాణ విషయంలో మార్క్సిస్టు పార్టీ ఇప్పుడు ప్రదర్శిస్తున్నది కూడా అనాసక్తమైన వ్యతిరేకతే.  ప్రత్యేక రాష్ట్రడిమాండ్‌ను అది వ్యతిరేకిస్తుంది కానీ, అందుకోసం అది ప్రత్యేకంగా కార్యక్రమం ఏదీ తీసుకోదు.  తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చే సరికి- అది 2008లో పూర్తి స్థాయి ఆమోదాన్ని ప్రకటించి, 2009లో చిదంబరం ప్రకటన తరువాత వెనక్కు తగ్గింది.  అప్పుడు నాలుగడుగులు వెనక్కు వేస్తే, ఇప్పుడు ఒక మూడడుగులు ముందుకు వచ్చింది. అయినా అందులో ఒకడుగు ముందడుగే.

ఏమి చేసినా తెలుగుదేశం పార్టీని నమ్మరాదని కెసిఆర్‌ భావిస్తూ ఉంటే, మరి ఆయన 2009లో తెలుగుదేశం పార్టీతో చేసిన రాజకీయ స్నేహానికి సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది. బొంతపురుగునైనా కావలించుకుంటానని చేసిన ప్రకటనలను ఉపసంహరించుకోవలసి ఉంటుంది. నిజానికి, టిడిపిని అయినా, కాంగ్రెస్‌ను అయినా, వైసిపిని అయినా ఒక స్థాయికి మించి విశ్వసించకూడదనడానికి తెలంగాణవాదంలోని సైద్ధాంతిక అంశాలు సమర్థనగా పనికివస్తాయి. కానీ, సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా అప్పటికప్పుడు వ్యవహరించే శైలినే కెసిఆర్‌ మొదటినుంచి ఎంచుకున్నారు. ప్రాంతీయ న్యాయం కోసం పోరాడే ఉద్యమం- ఇతర ప్రాంతాలలో మూలాలు ఉన్న రాజకీయశక్తులను పూర్తిగా విశ్వసించవు. విశ్వసించకూడదు కూడా. కేవలం ప్రాంతప్రయోజనాల మీదనే దృష్టి పెట్టే ఆసక్తీ, అవగాహనా ఆ ప్రాంతానికే పరిమితమైన రాజకీయశక్తుల్లోనే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నేడు తెలంగాణకు పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ, ఆ పార్టీ అధినాయకత్వం తెలంగాణేతరమైనది కాబట్టి, రేపు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల ఆధిపత్యమే పరోక్షంగా కొనసాగుతుంది. వైసిపి విషయంలో కూడా అది వర్తిస్తుంది. ఇటువంటి అవగాహనతో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ ఉండి ఉంటే, అది వేరే విషయం. కానీ, కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ తెలుగుదేశంపై గురిపెట్టింది ఎన్నికల రాజకీయాల దృష్టితో మాత్రమే అని తెలిసిపోతూ ఉంది. అలా కాకపోతే, శుక్రవారం నాడు టిడిపి లేఖపై పాక్షికమయిన సంతృప్తిని వ్యక్తంచేసి, రానున్న నెలరోజుల కాలంలో తెలంగాణ విషయమై ఒత్తిడి తేవడానికి కలసిరావలసిందిగా టిటిడిపి ప్రజాప్రతినిధులను కోరి ఉండవలసింది. ఎందుకంటే, ఈ నెలరోజుల కాలాన్ని పూర్తిస్థాయిలో ఉద్యమప్రయోజనార్థం వినియోగించుకోదలచుకుంటే, తెలంగాణకోసం సంపూర్ణంగా, పాక్షికంగా ముందుకు వచ్చే వారందరి బలాన్నీ, బలగాన్నీ నాయకత్వం ఉపయోగించుకోవాలి.  అటువంటి వివేకాన్ని ప్రదర్శించకపోతే కలిగే నష్టాలు తీవ్రమైనవి, దీర్ఘకాలికమైనవి. ప్రాంతీయ న్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య వైరుధ్యం రాకుండా వ్యవహరించాలని మేధావులు ఎన్నిసార్లు హెచ్చరించినా, దాన్ని పెడచెవిన పెట్టడం వల్ల తెలంగాణ రాజకీయపార్టీ అట్టడుగు జనశ్రేణులకు దూరమవుతూ వస్తున్నది. సహజంగానే ఆ వైరుధ్యాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన పలుకుబడిని పెంచుకుంటున్నది. అఖిలపక్షానికి చంద్రబాబు పంపిన ప్రతినిధుల సామాజిక వర్గాలేవో గమనిస్తే, తెలుగుదేశం వ్యూహం అర్థమవుతుంది. తెలంగాణకు సంబంధించిన భావావేశాలు బలంగా ఉన్నప్పుడు- సామాజిక కోణం మరుగైనట్టు కనిపించవచ్చును కానీ, ఉద్యమంలో విరామం వచ్చినప్పుడల్లా తెలంగాణవాదాన్ని వదులుకోకుండానే ఇతర పార్టీలవైపు మరలేవారి సంఖ్య పెరుగుతున్నది. బడుగు వర్గాలు తెలుగుదేశం వైపు వెడుతుంటే, ప్రాబల్యవర్గాల్లో ఒకదానికి చెందినవారు వైసిపి వైపు వెడుతున్నారు. తెలంగాణవాదంపై తన పట్టును టిఆర్‌ఎస్‌ ఆ మేరకు కోల్పోతున్నది. పరిష్కారం సమీపిస్తున్న దశలో అది వాంఛనీయం కాదు.

తెలంగాణ ఇవ్వబోరని తనకు ప్రత్యేకమైన సంకేతాలేమైనా అంది ఉంటే, అప్పుడు కూడా కెసిఆర్‌ ఆచరణాత్మకమైన వ్యూహంతోనే ముందుకు వెళ్లాలి. తనను తాను ఒంటరి చేసుకునే తప్పుడు వ్యూహాలు ఆయననే కాదు, ఆయన పార్టీని, మొత్తం ఉద్యమాన్ని దెబ్బతీస్తాయి. ముప్పై రోజుల తరువాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చినా, ప్రతికూలంగా నిర్ణయం వచ్చినా - తెలంగాణ ప్రజలకు తమదైన పార్టీ  ఉనికిలో ఉండాలి, అది ప్రజాస్వామికంగా పనిచేస్తూ ఉండాలి. అనుకూలంగా నిర్ణయం వస్తే, విభజనకు సంబంధించిన పంపకాల ప్రక్రియలో ప్రాంత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే ప్రత్యేక శక్తి అవసరం. వ్యతిరేకంగా నిర్ణయం వస్తే, ఉద్యమాన్ని కొనసాగించడానికి, ఉధృతం చేయడానికీ పోరాట సంస్థ అవసరం. పొరపాటు వ్యూహాలు అసలుకే మోసం తెస్తే, తెలంగాణ వచ్చినా రాకున్నా ప్రాంతప్రజలు నిస్సహాయులవుతారు. 

కేసిఆర్‌ దృష్టి అంతా తనకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సమకూరే ప్రయోజనాలే అని విమర్శకులు ఆరోపిస్తున్నారు. వారసుల కోసం తపించడం, వారి కోసమే పదవులూ ఆస్తులూ సిద్ధం చేసి పెట్టడం అన్ని పార్టీలలోనూ ఉన్నదే కాబట్టి అది పెద్ద విషయం కాదు కానీ, స్వకార్యంతో పాటు ప్రజాకార్యం కూడా నెరవేర్చడం ఉద్యమనేతల బాధ్యత.
No comments:

Post a Comment