Thursday, February 14, 2013

ప్రాంతీయ న్యాయం, సామాజిక న్యాయం

కాస్త అటూఇటూగా పదిహేనేళ్లు అయింది. అప్పటికింకా ఆరంభమే. భువనగిరి సభ జరిగింది వరంగల్ సభా జరిగింది కానీ, ఉద్యమం అని చెప్పదగ్గ జోరు మాత్రం లేదు. మొదట మేలుకొన్నవారిలో ఒకరైన రచయితలు అక్కడక్కడా మీటింగులు పెట్టుకుని చర్చలు చేసుకుంటున్నారు. అటువంటి ఒకానొక తొట్టతొలి మీటింగులో ఒక కవి ఆవేశంగా ఒక ప్రశ్న వేశాడు. "అయితే ఏంది? తెలంగాణ ఉద్యమం పేరుతో ఇప్పుడు మేం పటేళ్లతోటి దొరలతోటి కలసి పనిచేయాల్నా?''. సామాజిక న్యాయ భావాల ప్రభావంలో ఉన్న యువకవి అతను. మలిదశ తెలంగాణ ఉద్యమం మొగ్గతొడగగానే, వినిపించిన తొలిప్రశ్నలన్నీ అటువంటివే అనుకుంటాను.

ఆశ్చర్యం ఏమిటంటే, పుల్లాపుడకా ఏరుకుని వచ్చి తెలంగాణ పోరాటగూడును కట్టిన మొట్టమొదటి పిట్టల్లో సామాజిక న్యాయశక్తులు కూడా ఉన్నాయి. ఒకవైపు విప్లవ బృందాలు, మరోవైపు సామాజిక విప్లవ బృందాలు- జనసభలు మహాసభల పేరిట తెలంగాణలో మరోమారు ప్రత్యేకరాష్ట్ర ఉద్యమ సందడిని తీసుకువచ్చాయి. ఒకరు సామాజిక ప్రజా తెలంగాణ అని, మరొకరు ప్రజాస్వామిక తెలంగాణ అని ఆనాడే తమ లక్ష్యాలకు పేర్లు పెట్టుకున్నారు. ప్రాంతీయ అస్తిత్వ కోణం నుంచి, వాదం నుంచి తెలంగాణ సమస్యను చూసినవారెవరూ అప్పటికి లేరు. తెలంగాణ వాదం అన్న మాట వినిపించినప్పుడు విపరీతంగా వ్యతిరేకత వినిపించింది కూడా.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఉన్న పరిమితులేమిటి? సామాజిక, ప్రజాస్వామిక ఆదర్శాలను ఎంత వరకు అందులో అంతర్లీనం చేయగలం? ఒక ప్రత్యేక వాదంగా అది అందించే సార్వత్రక, సార్వజనీన విలువలేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ వాస్తవిక దృక్పథాన్ని నిర్మించే ప్రయత్నాన్ని మేధావులు,
రచయితలు, సంస్థలు చేయకపోలేదు. కానీ, ఆ దిశగా ఆ నాటి ఉద్యమశక్తులు తమ దృష్టిని సారించలేదు. ఇంతలో, కాగల కార్యం గంధర్వులే తీర్చారు. అనేక శక్తులు, బృందాలు, సంఘాలు కలసి నిర్మించిన వేదికపై తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో అధిష్ఠించి, సిద్ధాంత రాద్ధాంతాలు వద్దని, భౌగోళిక తెలంగాణాయే నినాదమని ప్రకటించింది. దీన్ని ప్రతికూలదృష్టితో చూసి వ్యాఖ్యానించవచ్చును కానీ, అది అనివార్యమైన, అతి వాస్తవికమైన పరిణామమని కూడా గుర్తించాలి.

ప్రత్యేక రాష్ట్రం వంటి ఆకాంక్షల వెనుక అమాయకమైన నిస్వార్థమైన భావోద్వేగాలో, ప్రాంతీయాభివృద్ధి కావాలన్న దృఢమైన సంకల్పాలో మాత్రమే ఉండవు. ఆ మాటకు వస్తే, ఏ గొప్ప ఉద్యమంలోనూ ఉండకపోవచ్చు. ఆ ఉద్యమఫలితాల నుంచి లభించే భౌతిక ప్రయోజనాలను ముందే కనిపెట్టిన వర్గం చేసే ఉద్దేశ్యపూర్వక ప్రయత్నం లేకపోతే, సదుద్యమాలు సైతం సఫలం కావు. కర్ణాటక రాష్ట్ర ఉద్యమంలో లింగాయతులు, ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో రెడ్లు, మహారాష్ట్రలో మరాఠాలు వంటి మధ్యస్థాయి ఆధిపత్య శూద్రకులాలు తమ సొంత రాజకీయభవిష్యత్తు కోసం వహించిన పూనిక ఆయా ఉద్యమాలను సఫలం చేసింది. రాజ్యాంగ సభ చర్చల్లో రాష్ట్రాల పునర్విభజనను బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ప్రాంతీయ ప్రాబల్యకులాలు కేంద్రప్రభుత్వాన్ని చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. అదే అంబేద్కర్ ఫజల్ అలీ కమిషన్ నివేదిక వచ్చిన తరువాత అభిప్రాయం మార్చుకున్నారు.

రాష్ట్రాల పరిమాణం తగ్గితే, మైనారిటీలకు (మతపరమైన మైనారిటీలు మాత్రమే అని అంబేద్కర్ ఉద్దేశ్యం కాదు), ఇతరులకు మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని, బలహీనులకు రాజకీయాల్లో ఎక్కువ పాత్ర లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, కమిషన్ భావించినట్టు, భాషాప్రయుక్త రాష్ట్రాలంటే, ఒక భాషకు ఒకే రాష్ట్రం అని కాదని, ఒక రాష్ట్రంలో ఒక భాషగా అర్థం చేసుకోవాలని అంబేద్కర్ వివరించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, యుపిలను ఒకటి కంటె ఎక్కువ రాష్ట్రాలుగా విభజించాలని ఆయన ప్రతిపాదించారు. ఒక భాషను మాట్లాడే ప్రజల భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే ఉనికిలో ఉండే ప్రాబల్య సామాజిక వర్గం- ఆ భాషారాష్ట్రం ఏర్పాటును అందరికంటె ఎక్కువ వాంఛిస్తుందని ఆయన సూత్రీకరించారు. అయితే, భౌగోళికంగా విశాలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకే సామాజికవర్గం కూడా ప్రాంతాల వారీగా వేర్వేరు ప్రయోజనాలతో, భిన్న శైలిలో వ్యవహరిస్తుంది కాబట్టి, అక్కడ ఇతర ప్రాతిపదికల మీద విభజన అవసరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ దృష్టిలో భాషాప్రయుక్త రాష్ట్రాలైనా, చిన్న రాష్ట్రాలైనా బలమైన సామాజిక పార్శ్వం ఉన్న అంశాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనుక, అది కేవలం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదు, సామాజిక పరిణామం కూడా.

రాయలసీమ, కోస్తాంధ్రలోని వేరువేరు ప్రాబల్యకులాలకు, కొసరు బలాన్ని అందించి అధికారాన్ని అప్పగించే వేదికగా తెలంగాణ ఉపయోగపడుతోంది. తెలంగాణ వేరయితే, సీమాంధ్రప్రాంతాలు తమలో తామే సామాజిక పోరాటం చేయవలసివస్తుంది, సమీకరణాలూ మార్చుకోవలసి వస్తుంది. అది పెద్ద విషయం. తెలంగాణపై నిర్ణయం తేలకపోవడం వెనుక ఇది కూడా ఒక ముఖ్యకారణం. తెలంగాణలోని సాంప్రదాయిక ఆధిక్య కులం కానీ, తరవాతి కాలంలో ఎదిగివచ్చిన వెనుకబడిన కులాలు కానీ, మొత్తం రాష్ట్ర రాజకీయపటంలో ద్వితీయశ్రేణి నేతలుగానే ఉండిపోయినందువల్లనే- ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఈ రెండు ప్రధాన సామాజిక శిబిరాలనుంచి స్థూలమయిన సమర్థన పొందగలిగింది. దీర్ఘకాలం స్థానికమయిన నేతృత్వానికి, రాష్ట్రస్థాయిలో అధిష్ఠానాల, అధినేతల కనుసన్నలలో మాత్రమే మెలిగే స్వభావానికి బద్ధులయి ఉన్న తెలంగాణ నేతల్లో చాలా మందికి ఇప్పటికీ ప్రత్యేక రాష్ట్రం కోసం కోరిక ఉన్నంతగా సంకల్పం, తెగింపు లేదని కూడా గుర్తించాలి. తెగింపు సాహసం ఉన్నవారు, తెలంగాణ రాష్ట్రఅవతరణ వల్ల తక్షణ ప్రత్యక్ష లాభం లేని వారు అయిన దళిత, బహుజన యువకులు దృఢచిత్తం లేని నేతలను బతిమాలి, బామాలి, బెదిరించి ఉద్యమింపజేయాలని చేస్తున్న ప్రయత్నం అపురూపమైనది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, మొదటి ఒకటి రెండు అసెంబ్లీల్లో సామాజిక నిష్పత్తులు ప్రస్తుతమున్న తరహాలోనే కొనసాగవచ్చు, రెడ్డి, వెలమ కులాల ఆధిక్యం మరికొంత కాలం కొనసాగక తప్పకపోవచ్చు (వారి పెత్తనం వల్ల మాత్రమే కాదు, వారి నాయకత్వం తెలంగాణకు 'అవసరం' కూడా కావచ్చు) కానీ, అతి తొందరలోనే గౌడ, యాదవ, మున్నూరుకాపు, ముదిరాజు, పద్మశాలి కులాలు బలమైన సామాజిక వర్గాలుగా అవతరిస్తాయి. ఇక సొంతంగా ఆత్మగౌరవ ఉద్యమం కలిగిన దళిత కులాల సంగతి చెప్పనక్కరలేదు. కొత్త రాజకీయవ్యవస్థమీద తీవ్రమైన విమర్శ పెట్టడం దగ్గరనుంచి, తనలో తాను సర్వతోముఖ వికాసం చెందడం దాకా వారు అనేక కర్తవ్యాలను నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు, ముస్లిం మైనారిటీలు జనాభాలో పెద్దశాతానికి వెడతారు. ఆ రాష్ట్ర సామాజిక చిత్రపటమే సబ్బండ వర్ణాల ప్రాతినిధ్యంతో  ఇంద్రధనుస్సు వలె మెరిసిపోతుంది.

తెలంగాణ ఉద్యమానికి ఉన్న సానుకూల సామాజిక కోణాన్ని, రాష్ట్రావతరణ కారణంగా కలిగే పర్యవసానాలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  తెలంగాణ ఉద్యమంపై సామాజిక విమర్శ, మూలానికే దెబ్బతగిలేవిధంగా తరచు అవధులు దాటడం బాధ కలిగిస్తుంది. ఇందుకు కారణం- ఉద్యమాన్ని తెలంగాణవాదం నుంచి చూడడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడమే. ఒక దళిత వాది, దళితుల్లోని పెద్దలను, చిన్నలను, సంపన్నులను, పేదలను అందరినీ ఒకే సామాజిక అస్తిత్వంతో గుర్తించి- వారి రక్షణకు పూనుకుంటాడు. ఒక బహుజనవాది వెనుకబడిన కులాల్లోని క్రీమీ లేయర్‌ను కూడా సామాజిక కోణంలో సమర్థిస్తాడు. మరి ప్రాంతీయ అస్తిత్వ వాది- ఒక బాధిత ప్రాంతంలోని 'ప్రాబల్య' నాయకత్వాన్ని ఎందుకు వెనకేసుకు రాలేకపోతున్నాడు? తెలంగాణ ప్రాంతపు సంప్రదాయ నాయకత్వానికి భూస్వామ్యపు, పెత్తందారీ దుర్మార్గగతమూ, అవశేష వర్తమానమూ ఉండవచ్చును. ఎంత కాలమని ఆ బూచిని చూపించి, చూసి,  నాయకత్వమే లేకుండా ఉండగలరు?  ఏ ప్రాంత ప్రజలైనా వారి సొంత నాయకత్వం కింద, పాలన కింద ఉంటే అణగారిపోతారని, పీడితులవుతారని అనడంలో ఎంత మాత్రం శ్రేయోభిలాషిత్వం ఉన్నది? సామాజిక విమర్శ పెట్టి, ప్రత్యేక రాష్ట్రం వద్దనే దాకా వెళ్లినవారున్నారు, మరి సమైక్యరాష్ట్రంలో మాత్రం సామాజిక న్యాయాన్ని వారెందుకు కోరరు? సామాజిక సమైక్యాంధ్ర కోరేవారెవరూ కనిపించరేమి?

తెలంగాణ ఉద్యమాన్ని  అనేక ఆంతరంగిక విమర్శలు, బాహ్య విమర్శలు చికాకు పరిచాయి. కొన్ని విమర్శలు లోపాలను సరిదిద్దాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఏమాత్రం మార్పులేని అవలక్షణాలు కూడా తెలంగాణ నాయకత్వంలో అనేకం ఉన్నాయి. అవి అంతే. వాటితో ప్రస్తుతానికి సర్దుకోవలసిందే. మొత్తం మీద, తెలంగాణ ప్రాంతం అప్పటిదాకా తన నేల మీద జరిగిన అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల విలువలను ఈ ప్రాంతీయ ఉద్యమంలోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేసిందని గుర్తించాలి, చాలా వరకు సఫలమూ అయింది. ప్రజాస్వామిక విప్లవాన్ని కాంక్షించే, పూర్తి సామాజిక న్యాయాన్ని, రాజ్యాధికారాన్ని కోరుకునే ఉద్యమాల క్రమం సుదీర్ఘమైనది. రాష్ట్ర అవతరణ తరువాత కూడా అవి కొనసాగవలసినవి.


No comments:

Post a Comment