Monday, February 18, 2013

తెగిన తల, తెగని ప్రశ్నలు

అయిపోయింది కదా, ఇక చర్చేముంది? కత్తిపోటు వల్లయినా, తుపాకి కాల్పుల్లో అయినా, ఉరితాడు బిగిసి అయినా ఎవరైనా చచ్చిపోతే, ఆ తరువాత చేయదగింది ఏముంటుంది? అంత్యక్రియలు తప్ప. అఫ్జల్ గురు గురించి కూడా ఇక చేయగలిగింది ఏమీ లేదు. అంత్యక్రియలు కూడా ప్రభుత్వమే చేసేసింది. అతనొక తీవ్రమైన నేరాభియోగాన్ని ఎదుర్కొన్నాడు. న్యాయస్థానం అతని ప్రమేయాన్ని నిర్ధారించింది. ఉరి తీయమని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఉరి తీసింది. అంతా పద్ధతి ప్రకారమే జరిగిపోయింది. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే విధేయపౌరులు దీనిపై చేయగలిగింది ఏముంటుంది?

అతన్నింతకు ముందే ఉరితీసి ఉండవలసిందా? అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి మరొక అవకాశం ఇచ్చి ఉండవలసిందా? పోనీ, అతను ఏ విచారణా నిర్ధారణా అక్కరలేని దోషియా? లేక అన్యాయంగా నింద పైబడిన అమాయకుడా? ఏదైనా సరే, అయిపోయింది కదా, ఇప్పుడేమి చేయగలం?

ఉరిశిక్ష అమానుషమా? నాగరిక, సంస్కార సమాజాల్లో అటువంటి శిక్షలు ఉండకూడదా? కానీ, అది ఆదర్శమే తప్ప చట్టం కాదు కదా? విదురనీతి ఉదారంగా ఉండమని చెబుతుంది కానీ, భగవద్గీత కాఠిన్యాన్నే ప్రబోధిస్తుంది కదా? ఉరిశిక్ష మానుకోండి అని ఐక్యరాజ్యసమితి ఈ మధ్య అడిగినప్పుడు, మన దేశం అదేం కుదరదని అప్పుడే అక్కడే కుండబద్దలు కొట్టింది కదా, కాబట్టి, ఆశ్చర్యం కూడా అక్కరలేదు. అంతా సజావుగానే జరిగింది. పాత ప్రశ్నలకు ఇక ఆస్కారం లేదు. అఫ్జల్‌గురు ఫైల్ క్లోజ్ అయిపోయింది కానీ, ఈ ఉరిశిక్ష కొన్ని కొత్త ప్రశ్నలను, కొత్త సన్నివేశాలను, కొత్త కలవరాన్ని ముందుకు తెచ్చింది. రాచపుండుగా మారబోయే కొత్త వ్రణాన్ని వెలికితీసింది.

...

బూటకపు ఎన్‌కౌంటర్ చేయబోయే ముందు పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారన్న వార్త మీడియా ద్వారా పొక్కక ముందే పనిపూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. అర్థరాత్రి తరువాత పత్రికలన్నీ ముద్రణ పూర్తిచేసుకున్న తరువాత, ముఖ్యంగా తెల్లవారుజాము వేళల్లో, ఎన్‌కౌంటర్ జరిగిపోతుంది. ఒక్కోసారి ఫలానా వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకున్నారని కుటుంబసభ్యులు ఇచ్చిన
సమాచారమూ, వారి ఎన్‌కౌంటర్ జరిగిందన్న పోలీసు సమాచారమూ ఒకే పత్రికలో పక్కపక్కనే వస్తుంటాయి. సంఘంలో సానుభూతి అసలు లేని వ్యక్తుల విషయంలో అయితే, పాత్రికేయులు కూడా ఉదారంగా ఆ కార్యక్రమానికి సహకరించిన సందర్భాలున్నాయి. ఎన్‌కౌంటర్ కర్తవ్యదీక్షలో ఉన్న పోలీసులకు తమ ఉద్దేశం నెరవేరడమే ముఖ్యం. అందుకోసం గోప్యత పాటిస్తారు. వారి పనితీరులో ఉన్న చాకచక్యం గురించి, తీసుకున్న జాగ్రత్తల గురించి పాత్రికేయులు ప్రశ్నించినా పోలీసులు పెదవి విప్పరు. తామటువంటి పద్ధతిలో వ్యవహరించలేదనే వాదిస్తారు. ఆఫ్ ద రికార్డ్ అయినా అంగీకరిస్తారని అనుకోను.

కానీ, మన కేంద్ర హోంశాఖ మంత్రి అతి ముఖ్యమైన పాత్రికేయసమావేశంలో 'పని పూర్తి కావడం' గురించి బాహాటంగానే మాట్లాడారు. అఫ్జల్ గురుకు క్షమాభిక్షను రాష్ట్రపతి నిరాకరించిన విషయాన్ని ఎందుకు బహిరంగ పరచలేదని అడిగినప్పుడు, అట్లా చేస్తే పనిపూర్తయ్యేదా? అని ఆయన ఎదురుప్రశ్న వేశారు. ఇతరుల విషయంలో అట్లా బహిరంగపరచినప్పుడు వారు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, దాన్ని నివారించడానికే తాము గోప్యత పాటించవలసి వచ్చిందన్నట్టు షిండే మాట్లాడారు. న్యాయపరంగా ఇంకా అవకాశాలున్నప్పుడు, అఫ్జల్ గురుకు వాటిని ఉపయోగించుకునే అవ కాశమిస్తే తప్పేమిటి? అని ఒక పాత్రికేయుడు కొంచెం ధైర్యంగానే ప్రశ్నించాడు.

'కసబ్ విషయంలో కూడా మీరు అదే వాదన చేయగలరా?' అని హోంమంత్రి తిరుగు ప్రశ్న వేశారు. ఆ వాదన చేయడానికి కానీ, అంతకు మించి ముందుకు వెళ్లడానికి కాని పాత్రికేయు లకుఅవకాశం కానీ, సంసిద్ధత కానీ ఉండదని వేరే చెప్పనక్కరలేదు. ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న విషయమేమిటంటే, 'పని పూర్తి కావడానికి గోప్యత పాటించాన'ని ఒక సాధారణ పోలీసు అధికారి కూడా చెప్పడానికి వెనుకాడేటప్పుడు, దేశ ఆంతరంగిక భద్రతకు బాధ్యుడయిన కేంద్రమంత్రి అంత బాహాటంగా ఎట్లా మాట్లాడగలిగారు? న్యాయప్రక్రియను అధిగమించి 'పని' పూర్తి చేయవలసిన అగత్యం ప్రభుత్వానికేమిటని ఎవరైనా ప్రశ్నించగలమా? ఈ ధోరణి రానున్న కాలంలో దేశంలో ఎటువంటి వాతావరణాన్ని కల్పించనున్నదో అన్న ఆందోళన కలగకపోతే, మనమింకా అఫ్జల్‌గురు ఉరి కల్పించిన సంతృప్తిలోనే మైమరచి ఉన్నామన్న మాట.

...

యాసిన్ మాలిక్. కాశ్మీర్ వేర్పాటువాదుల్లో స్వతంత్రవాది అని చెప్పదగ్గవారెవరన్నా ఉంటే అందులో అతను ప్రథముడు. కాశ్మీర్ భారత్‌లోను, పాక్‌లోను కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నది మాలిక్ వాదం. అతని నాయకత్వంలోని జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) మిలిటెంట్ సంస్థే అయినప్పటికీ, మతతత్వానికి దూరం. పాక్ అనుకూల మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిన తరువాత బలహీనపడిన యాసీన్ మాలిక్ వర్గం 1994లో హింసాయుత మార్గాలకు స్వస్తి పలికింది. అప్పటినుంచి శాంతియుత నిరసన మార్గాలలోనే ఆ సంస్థ ఆచరణ సాగుతూ ఉన్నది. చర్చల ప్రక్రియ మీద ఆసక్తి కలిగినప్పుడల్లా కేంద్రప్రభుత్వం మాలిక్‌తో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది.

అఫ్జల్ గురు జెకెఎల్ఎఫ్‌లో పనిచేసి భద్రతాదళాలకు లొంగిపోయిన మిలిటెంట్. అతన్ని ఉరితీసిన సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న యాసిన్ మాలిక్ ఇస్లామాబాద్‌లోనే నిరసన దీక్ష చేపట్టాడు. లష్కరే తోయిబా అనంతర రూపమయిన జమాయిత్-ఉద్- దవా నాయకుడు, అమెరికాలోనూ భారత్‌లోనూ నిషిద్ధ వ్యక్తి, ముంబై దాడుల సూత్రధారిగా ప్రసిద్ధుడు అయిన హఫీజ్ సయీద్, యాసిన్ మాలిక్ దీక్షాశిబిరానికి వచ్చి సంఘీభావంగా పాల్గొన్నాడు. సాధారణంగా మాలిక్ అటువంటి వ్యక్తులతో కలిసి వేదికను పంచుకోడు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలతో కలసి పనిచేయడు. అఫ్జల్ గురు ఉరికి నిరసన- ఆ ఇద్దరి కలయికకు వేదిక అయింది. భారత ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. యాసిన్ భారత్ వచ్చిన తరువాత విచారిస్తామని ప్రకటించింది.

మాలిక్‌ను విచారించడమో, అతని పాస్‌పోర్ట్‌ను నిలిపివేయడమో అధికారిక ప్రక్రియ అయితే కావచ్చునేమో కానీ, అది ఆ పరిణామంలోని తీవ్రతను పరిష్కరించదు. వివేకమూ విజ్ఞతా విడిచిపెట్టకుండా కేవల రాజకీయ పోరాటం చేస్తున్న వ్యక్తి, అతి ప్రమాదకారిగా భావించే మరో వ్యక్తి సంఘీభావాన్ని స్వీకరించే పరిస్థితి రావ డం వాంఛనీయం కాదు. మాలిక్ వంటి వాడే ఈ తీరులో ఆలోచిస్తున్నప్పుడు, అంతకు మించిన మిలిటెంట్ తత్వం ఉన్న కాశ్మీరీ యువత ఎట్లా ఆలోచిస్తారు? కొంత కాలంగా సాపేక్షంగా మెరుగుగా ఉన్న కాశ్మీర్‌లో అఫ్జల్ గురు అనంతర పరిణామాలు తిరిగి అగ్గి రాజేయబోతున్నాయా? ఇంతకాలం, కాశ్మీర్ సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఉరిని వాయిదా వేస్తూ వచ్చిన కేంద్రం (అట్లా అని అది ఒప్పుకోదు, కానీ, వాస్తవం అదే అని అర్థమవుతూనే ఉంది), ఇప్పుడు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా, పెద్ద తప్పిదం చేసిందా? 1984లో మక్బూల్ భట్ ఉరితీయడం-కాశ్మీర్‌లో రగలించిన పర్యవసానాలు ఆ ప్రాంతానికి, దేశానికి ఎంతటి నష్టం కలిగించాయో మనకు తెలుసు.

...
 
తెల్లవారుతోందంటే చాలు భయమేస్తోంది- అంటోంది పెరరివలన్ తల్లి అర్బుదమ్మాళ్. గురును ఉరితీసినప్పటి నుంచి ఆమె గుండెల్లో దడ తగ్గడం లేదు. గురు తరువాత ఎవరు? అని పత్రికల్లో చర్చలు సాగుతుంటే ఆమె కడుపు తరుక్కుపోతోంది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురిలో పెరరివలన్ ఒకరు. తమ క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించడానికి రాష్ట్రపతి పదకొండు సంవత్సరాల సమయం తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ, వారు ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను కొట్టివేస్తే, ఆ విషయం తనకు వెంటనే తెలియజేయాలని, గోప్యంగా ఉంచి అకస్మాత్తుగా ఉరితీసే అవకాశాన్ని నివారించాలని ఆమె సుప్రీంకోర్టును కోరుతోంది. గురును ఉరితీసిన పద్ధతి ఆమెకు వ్యవస్థపై అనేక అనుమానాలను కలిగించింది.

కసబ్, గురు సంగతి వేరు, తన కుమారుడు నిర్దోషి అని అర్బుదమ్మాళ్ అంటోంది. అఫ్జల్ కుటుంబసభ్యులు కూడా అదే అంటున్నారు. దోషిత్వాన్ని, నిర్దోషిత్వాన్ని నిర్ధారించే ప్రక్రియలు వేరు. ఆ ప్రక్రియల స్ఫూర్తితోనే శిక్షల అమలు జరుగుతోందన్న నమ్మకం ఇటీవలి సంఘటనలతో సడలిపోయిందనే చెప్పాలి. గురు ఉరిని ఒక రాజకీయ డిమాండ్‌గా మలచిన బిజెపి కూడా, శిక్ష అమలును సమర్థిస్తూనే కాంగ్రెస్ రాజకీయ పరిగణనతోనే వ్యవహరించిందని ఆరోపించింది. అఫ్జల్ గురును సత్వరం ఉరితీయాలన్న డిమాండ్‌ను పదేపదే ముందుకు తేవడంలో, కేవలం భద్రతాదృక్పథం మాత్రమే లేదని, మెజారిటీ మతతత్వపు ఛాయలే ప్రధానంగా ఉన్నాయని అనుమానాలున్నాయి. అటువంటి అనుమానం ఉండబట్టే, వచ్చే ఎన్నికలలో మెజారిటీ మతస్థుల ఓట్లను కోల్పోయే ప్రమాదాన్ని నివారించడానికి కాంగ్రెస్ దూకుడుతో వ్యవహరించి ఉండాలి. ముస్లిములకు గత్యంతరం లేదు కాబట్టి, తమనే అంటిపెట్టుకుని ఉంటారన్న ధీమా కాంగ్రెస్‌కు ఉన్నది. అయితే, ఉరిశిక్షల విషయంలో మతపక్షపాతం చూపినట్టు కలుగుతున్న భావనలను కూడా ఎంతో కొంత చక్కదిద్దాలి కదా! అందుకోసం లెక్క సమానం చేయడానికి, ఇప్పుడు కొందరు హిందూనేరస్థులు కూడా ఉరికంబమెక్కే అవకాశమున్నది.

పెరరివలన్ తల్లి భయం అకారణమైనది కాదు.
...
తాజాగా, వీరప్పన్ అనుచరులు నలుగురి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.

6 comments:

 1. మరి కాశ్మీరీ పండిట్ల గుఱించి ఏమాలోచించారండీ?

  ReplyDelete
  Replies
  1. మీ స్పందన కు కృతజ్ఞతలు.

   ఒక ఉరి శిక్షలోని అన్యాయాన్ని చర్చిస్తే, ఇతర బాధితుల గురించి విస్మరించినట్టు ఎందుకు అనుకోవాలి ? కాశ్మీరీ పండిట్ల ప్రవాసము, కాశ్మీర్ లోయలోని ఉద్రిక్త సంఘర్షణ ఒకే సమస్యలోని అంశాలు. పండిట్లు తమ సొంత నేలను వదులుకుని శిబిరాల్లో బతకవలసి రావడం అన్యాయం. అందుకు కారణాలు ఏమిటనే విషయంలో భిన్న వాదనలున్నాయి. నేను నా వ్యాసంలో పేర్కొన్న యాసిన్ మాలిక్ అనే పోరాటవాది , ఈ మధ్య కాలంలో అనేక మార్లు, పండిట్లను తిరిగి లోయలోకి రమ్మని ఆహ్వానించాడు. కాశ్మీర్ కు స్వతంత్రం కావాలనే వారిలో కూడా లౌకిక వాదులు, సామరస్య వాదులు ఉన్నారు. వారందరూ బలహీన పడే విధంగా, టెర్రరిస్టు మార్గమే బలపడే విధంగా ఏ పరిణామాలు దోహదం చేసాయో, వర్తమాన కాశ్మీర్ చరిత్రను మత భావనలకు అతీతంగా చూడగలిగితే అర్ధం అవుతుంది. అఫ్జల్ గురు ఉరితీత వల్ల పండిట్ లకు జరిగే న్యాయం ఏమి లేదు. పండిట్ లను తరిమి నందువల్ల అతనికి ఉరిశిక్ష పడలేదు. కాశ్మీర్ సమస్యను మరింత జటిలం చేసి, పండిట్ లతో సహా లోయ లోని ప్రజలందరి జీవితాలను మరింతగా దుర్భరం చేసేందుకు మాత్రమే ఉరితీత పనికివస్తుందేమో అన్న ఆవేదనతో ఆ వ్యాసం రాసాను. గురు ఉరిశిక్ష వల్ల కాశ్మీర్ పరిస్థితి మొదటికి వస్తుందా, ఉరితీసే ఆత్రుతలో కొన్ని సాధారణ సార్వత్రక మానవ, రాజ్యాంగ విలువలను ప్రభుత్వంలోని పెద్దలు విస్మరించారా?న్యాయం కోసమో, భద్రతా కోసమో కాక, ఓట్ల కోసం తీసే ఉరితీతలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి- అన్న అంశాలా మీద నా వ్యాసం సాగింది. ఇందులో కాశ్మీర్ ఉద్యమం మంచి చెడ్డల చర్చ కాని, పోరాతవడులకు సమర్ధన కాని లెవు. ఆ అంశాల మీద రాసినప్పుడు వాటిగురించిన నా అభిప్రాయాలు తెలియవచ్చు.

   Delete
 2. 1. ఉరిశిక్షలో మీరనుకుంటున్న అన్యాయం ఏమిటో పాఠకులు తెలుసుకోవచ్చనుకుంటాను! (ఉరిశిక్షలకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం)

  2. ఉగ్రవాద మార్గం బలపడినంతమాత్రాన అది సరైనదే అని మీరు భావిస్తున్నారా?

  3. ఇతగాడి ఉరితీతలో ప్రభుత్వం ఎలాంటి 'సాధారణ సార్వత్రిక మానవ, రాజ్యాంగ విలువలు' విస్మరించిందని మీరనుకుంటున్నారు?

  4. ఉగ్రవాదుల ఉరిశిక్షల అమలు రాజకీయాలతో కలిసిపోయాయని మీరు భావిస్తున్నారా?

  5. ఎవరో ఏదో బాధపడతారని చట్టప్రకారం శిక్షించవలసిన వ్యక్తులను స్వేచ్ఛగా విడిచిపెట్టాలని మీరు భావిస్తున్నారా?

  6. అసలు ఉరిశిక్షలపై మీ అభిప్రాయం ఏమిటి?

  ఈ అంశాలకు ఎక్కడా తగినంత వివరణ మీ వ్యాసములో నాకెక్కడా కనిపించలేదు మరి!

  ReplyDelete
  Replies
  1. అయ్యా, నేను ఈ వ్యాసం ఉరి శిక్ష మంచి చెడ్డల గురించి రాయలెదు. ఉరిశిక్షలను అంగీకరించినా కూడా పాటించవలసిన పద్ధతులను ప్రాతిపదిక గా చేసుకుని రాశాను. మీరు అడిగారు కాబట్టి, ఉరిశిక్షల మీద నా అభిప్రాయం కూడా చెబుతాను.
   ఉరిశిక్షకు నేను వ్యతిరేకిని. నేరము- శిక్ష అన్న ద్వంద్వం మీద నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నది కాని అది ఇక్కడ అప్రస్తుతం. ఉరిశిక్ష వల్ల ఏ ఫలితం సాధించాలని ఆశిస్తున్నారో అది నెర వేరదని నా నమ్మకం. సమాజంలో నేరానికి ఉన్న మూల కారణాన్ని తొలగించాలని, వ్యక్తీ బాధ్యతను బట్టి సంస్కరణాత్మకమైన శిక్షలు ఉండాలని అనుకుంటాను. ఒక నేరానికి ఫలానా శిక్ష తగదు అని అన్నామంటే ఆ నేరాన్ని సమర్ధిస్తున్నట్టు కాదు. నేర నిర్ధారణ, న్యాయ విచారణ, శిక్షల విధింపు- ఒక సమాజపు నాగరకతా స్థాయిని బట్టి, విలువలను బట్టి నిర్ణయం కావాలి కాని, నేరస్తుల నేరం స్థాయిని, తీవ్రతను బట్టి కాదు.
   ఉగ్రవాద మార్గాన్ని నేను సమర్ధించ లేదు. సమాజ సంక్షోభం అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది. ఆ మార్గాలు మనకు సమ్మతమైనవి కాకపొవచ్చు. ఉగ్రవాదం సమస్యలకు ఒక వికృత స్పందన. మంచి పరిష్కారాలు అయినా, చెడ్డ పరిష్కారాలు అయినా అణచివేత ద్వారా ఓడించాలేము. జబ్బును వికటింప చేసే ఔషధాల వల్ల ఉపయోగం లేదు.
   అఫ్జల్ గురు విషయంలో విస్మరించిన విలువల గురించి వివరణ అదిగారు. అతను ఆ నేరంలో పాలుపంచుకున్నాడా లేదా అన్న విషయంలో సందేహాలు ఉన్నాయి. నిజంగా ఆటను ఆ పని చేసి ఉన్నా, అతని ప్రమేయానికి శిక్షకు నిష్పత్తి సరిపోయిందా అన్నది మరో ప్రశ్న. తాను ఆ నేరం చేసానని, అయినా అది తప్పు కాదని అతను వాదించలేదు. తనను అక్రమంగా ఇరికించారని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాలు ఇవ్వలేదని ఆటను అంటూ వచ్చాదు. పార్లమెంట్ పై దాడిలో అతని ప్రమేయం గురించి భౌతిక ఆధారాలు తక్కువని ఆ కేసును పరిశీలిస్తే అర్ధం అవుతుంది. దాడి లో పాల్గొన్న మొహమ్మద్ అనే ఉగ్రవాది కి కారు కొనడానికి సహాయం చేయడం తప్ప గురు చేసిన నేరం మరొకటి లేదు ( ప్రాసిక్యూషన్ ప్రకారం) న్యాయ ప్రక్రియలో అతనికి అన్ని అవకాశాలు కల్పించిన తరువాత ఉరి తీసి ఉంటె, ఈరోజు మాట పడవలసి వచ్చేది కాదు. కాని, ఎక్కడ ఆతను మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాడో, దాన్ని నివారించాలని ప్రభుత్వం ఆత్రుత పదిన్ది. ఎలాగో ఒకలాగా అతన్ని చంపడమే ముఖ్యమైతే ఈ పది సంవత్సరాలు మాత్రం ఆగడం ఎందుకు?
   ఉరిశిక్షల అమలును కొన్ని సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఫలానా వాడిని వెంటనే ఉరితీయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేయడం ఇటీవలి పరిణామమే. అఫ్జల్ గురించి డిమాండ్లు చేసిన వారు రాజీవ్ కేసులోని దోషుల గురించి ఎందుకు చేయలేదు?అక్కడ ఇరవయ్యేళ్ళ ఆలస్యాన్ని యెట్లా సహిస్తున్నారు? బీజేపీ అడుగుతోంది కాబట్టి, రాజకీయంగా ఆ పార్టీ ని నిరాయుధం చేయడానికి కాంగ్రెస్ ఈ పనిచేసిందనే అభిప్రాయం ఏర్పడుతోంది.
   ఎవరో ఏదో అనుకుంటారని చట్ట ప్రకారం శిక్షించవలసిన వారిని వదిలేయాలా అని అడుగుతున్నారు. వదిలేయమని నేను చెప్పలేదే? ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరి వోట్లో ఎవరికో పడతాయని శిక్షలు అమలు చేయవద్దు అన్నాను. ఉరిశిక్ష అనేది రాజ్యవ్యవస్థ అమలు చేసే మరణశిక్ష. వ్యవస్థ నియమాలకు అనుగుణంగా వ్యవహరించకుండా, ఎట్లాగో అట్లా పని పూర్తి చేయాలనే కాంక్ష ఎందుకు అని ప్రశ్నించాను.
   ఉరిశిక్షలపై నా అభిప్రాయం పైనే చెప్పాను. అది వాంఛ నీయం కాదు. నేరం లేని సమాజం కావాలి. శిక్షలు లేని సమాజం కావాలి. నేరాలు జరిగే అవకాశం ఉన్న పరిస్థితులు కల్పించి, నేరాలకు శిక్షలు వేసే నైతిక అధికారం రాజ్యాలకు లెదు.

   Delete
 3. శ్రీనివాస్ గారు,
  గురు ఉరి శిక్ష గురించి అక్షరక్షరం పై కామెంట్ లోని మీ అభిప్రాయం తో ఏకీభవిస్తాను. మీ అభిప్రాయం చాలా స్పష్టం గా ఉంది.

  ReplyDelete