Thursday, February 21, 2013

రెండో రాజధాని : భ్రమలు, భయాలు

 తెలంగాణ ఉద్యమం మళ్లీ ఒక సుదీర్ఘ విరామంలోకి వెడుతున్నట్టే కనిపిస్తోంది. సడక్ బంద్‌లు విజయవంతంగా, ఉధృతంగా జరగవచ్చును కానీ, ఆ తరువాత ఇక పరీక్షల సీజన్ ప్రవేశిస్తుంది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉద్యమాలు నిర్వహించాలనే విలువను తెలంగాణ ఉద్యమం తనంతట తానే ఆమోదించింది కాబట్టి, తాను మౌనం పాటించక తప్పదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గురువారం నాడు ప్రారంభమవుతున్నాయి, అవి ముగిసేలోగా ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం ప్రకటించే అవకాశాలేమీ కనిపించడం లేదు. సమస్య పరిష్కారానికి గడువులంటూ ఏమీ లేవని, గతంలో నెలగడువు పెట్టిన షిండేయే తేల్చిపారేయడంతో, కేంద్రం దీర్ఘకాలపు వాయిదా వేసినట్టు స్పష్టమవుతోంది. సహకార ఎన్నికలు ముగిసి, స్థానిక ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో, రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కూడా భిన్నరూపం తీసుకోనున్నది.

అన్నీ కలిసి, కెసిఆర్ ఆశిస్తున్నట్టుగానే 2014 ఎన్నికలే లక్ష్యంగా, లేదా గడువుగా తెలంగాణ ఉద్యమం నిరీక్షించ వలసి వస్తుంది. దాన్నట్లా ఉంచితే, రాష్ట్ర విభజనకు సంబంధించిన చర్చల నేపథ్యంలోనే ఒక ఉపచర్చ కూడా మొదలయింది. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ బలంగా కాకపోయినా ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది. ఒక రాష్ట్ర రాజధానికి దేశరాజధాని హోదా సంక్రమించడం ఎదుగుదలగానే భావించడం సహజం కాబట్టి, దాన్ని తీవ్రంగా వ్యతిరే కిస్తూ ఎవరూ మాట్లాడడం లేదు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను అడ్డుకోవడం కోసం, విభజన సమస్యను గందరగోళ పరచడం కోసం జరుగుతున్న వాదన ఇది అని ఒకరిద్దరు తెలంగాణ వాద మేధావులు మాత్రం వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వడానికి, హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడానికి వైరుధ్యం ఉన్నదన్న అవగాహనే ఒకరి ప్రతిపాదనకు, మరొకరి ప్రతికూలతకు కారణం. ఆ అవగాహన ఎంతవరకు సమంజసమో పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

హైదరాబాద్‌ను భారతదేశానికి రెండో రాజధాని చేయాలన్న డిమాండ్ చేస్తున్న వారిలో తెలంగాణవాదులు ఎవరూ లేరన్నది వాస్తవం. రాష్ట్ర విభజన ఎలాగూ తప్పనప్పుడు, హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర ప్రాంతాల వారి ప్రయోజనాలను కాపాడడానికి లేదా, హైదరాబాద్‌పై తెలంగాణ అదుపును సాధ్యమైనంతగా తగ్గించడానికి రెండో రాజధాని ప్రతిపాదన ఉపకరిస్తుందని ఆ వాదన చేస్తున్నవారు భావిస్తూ ఉండవచ్చు. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తే వారు కోరుతున్నటువంటి రక్షణ కానీ, నిరోధం కానీ సాధ్యపడతాయా? అసలు హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయడం సాధ్యపడే విషయమేనా?

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలను తోడు తెచ్చుకుని వాదనలు చేయడం ఈ మధ్య పెరిగిపోయింది. చిన్నరాష్ట్రాలను అంబేద్కర్ సమర్థించాడని తెలంగాణవాదులు, హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ చెప్పాడని ఇతరులు తమ వాదనలకు పదునుపెట్టుకుంటున్నారు. వర్తమాన సమస్యల విషయంలో జాతీయ చారిత్రక నాయకుల ఉటంకింపులను ఆశ్రయించడంలో తప్పేమీ లేదు. కానీ, అంబేద్కర్ అభిప్రాయాల స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా, యాంత్రికంగా ప్రస్తావించడం ఆయనకు అపచారం చేయడమే. రాజ్యాంగసభ చర్చల సందర్భంగా భాషాప్రయుక్త రాష్ట్రాలనే వ్యతిరేకించిన అంబేద్కర్, ఫజల్ అలీ కమిషన్ నివేదిక తరువాత భిన్నమయిన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఆధిపత్య శక్తులు చెలరేగకుండా ఉండాలంటే బలమైన కేంద్రం ఉండాలని మొదట అభిప్రాయపడిన అంబేద్కర్, ఆ తరువాత చిన్న రాష్ట్రాలు సామాజిక న్యాయానికి అనుగుణమైనవని అన్నారు.

ఒక రాష్ట్రంలో ఒకే భాష అన్న నినాదంలో ప్రజాస్వామికతను గుర్తించడంతో పాటు, ఒకే భాషా వ్యవహర్తలకు అనేక రాష్ట్రాలుంటే మరింత వికేంద్రీకరణ సాధ్యపడుతుందని ప్రతిపాదించారు. ఆయా సందర్భాలలోని నిర్దిష్ట పరిస్థితులకు తన అవగాహనను అన్వయించి అంబేద్కర్ నాడు అభిప్రాయాలను చెప్పారు. భిన్నమైన పరిష్కారాలను చెప్పినప్పటికీ, ఆయన ప్రాధాన్యం మాత్రం, ఫ్యూడల్ ఆధిపత్యశక్తుల పెత్తనాన్ని విశాల సామాన్య ప్రజానీకం ఎట్లా అధిగమించి నెగ్గుకు రాగలరన్న లక్ష్యమే. భాషాప్రయుక్త చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడా, ఆ రాష్ట్రాల్లోని రకరకాల అల్పసంఖ్యాక వర్గాల రక్షణకు తీసుకోవలసిన చర్యలను కూడా ఆయన నిర్దిష్టంగా పేర్కొన్నారు. నవ స్వతంత్ర భారతదేశంలో బలంగా కనిపిస్తున్న ఉత్తరాది-దక్షిణాది అంతరాన్ని తగ్గించడానికి రెండో రాజధాని ప్రతిపాదనను అంబేద్కర్ చేశారు. వికేంద్రీకరణ- ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తుందనే మౌలిక అవగాహనతోనే ఆయన ఆ రకమైన ప్రతిపాదన చేశారు. దేశభద్రత దృష్టి నుంచి, అందరికీ సమదూరంలో ఉండడం వల్ల కలిగే సదుపాయం నుంచి కూడా రెండో రాజధాని ప్రతిపాదనను ఆయన చర్చించారు. ప్రస్తుతం కూడా దేశంలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల మధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, విద్యావిషయికంగా అంతరాలున్నప్పటికీ, 1950లలో కనిపించిన ఉద్వేగపూరితమైన విభజన ఉన్నదని చెప్పలేము. సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే ఖండాంతర క్షిపణుల యుగంలో, రాజధాని ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా శత్రుప్రమాదం సమానమే. మన రాజధాని కంటె పాకిస్థాన్ రాజధాని దేశసరిహద్దులకు సమీపంలో ఉంటుందని గుర్తించాలి. అంబేద్కర్ ఇప్పటి పరిస్థితులలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయడంపై గట్టి పట్టు పడతారని భావించలేము.

అన్నిటి కంటె ముఖ్యమైన విషయం- దేశానికి రెండో రాజధానినంటూ ఏర్పాటు చేస్తే, అంబేద్కర్ చెప్పినటువంటి కారణాలపై చేస్తారు కానీ, తెలుగువాళ్లు కోరారని, ఆంధ్రప్రదేశ్ విభజనలో ఒక ఏర్పాటుగా పనికివస్తుందని చేయరని వేరే చెప్పనక్కరలేదు. రెండో రాజధాని కావాలా, అయితే ఏ నగరం కావాలి- అన్న విషయంపై నిర్ణయం కానీ, ఆకాంక్ష కానీ ఇతర రాష్ట్రాల ప్రాధాన్యాలపై, అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది.

రెండు రాజధానులుండడం భారత్‌కు కొత్తేమీ కాదు. మొగలుల కాలంలో ఢిల్లీకి తోడుగా వేసవి రాజధానిగా శ్రీనగర్ ఉండేది. బ్రిటిషర్లు కలకత్తా రాజధానిగా ఉన్న కాలంలోను, ఢిల్లీకి మారిన కాలంలోను కూడా సిమ్లాను వేసవి రాజధానిగా ఉపయోగించుకున్నారు. ఎండల బారి నుంచి తప్పించుకోవడం తప్ప ఆ పాలకులకు మరో ఉద్దేశ్యం లేదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో రెండు మూడు రాజధానులున్న దేశాలున్నాయి. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. కాలాల వారీగా కాకుండా, ప్రభుత్వ కార్యక్రమాల పరంగా అక్కడ విభజన జరిగింది. అధికార యంత్రాంగానికి ప్రిటోరియా, చట్టసభలకు కేప్‌టౌన్, న్యాయవ్యవస్థకు బ్లూమ్‌మౌంటెన్ రాజధానులుగా వ్యవహరిస్తాయి. బొలీవియాలో, చిలీలో, మలేషియాలో, శ్రీలంకలో, నెదర్‌లాండ్స్‌లో ఇటువంటి విభజనలతోనే రాజధానులున్నాయి. ప్రధానమైన రాజధాని మినహా తక్కిన నగరాలకు ప్రత్యేకమైన ప్రతిపత్తి కానీ, స్థానిక పరిపాలనల నుంచి మినహాయింపులు కానీ ఏమీ ఉండవు. ఆరునెలలకో నగరం చొప్పున పూర్తిస్థాయి రాజధానులు రెండు ఉండే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. సమస్త యంత్రాంగమూ తట్టాబుట్టా సర్దుకుని ఊర్లు మారే పద్ధతి సాధ్యపడేది కాదు.

ఒకవేళ హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసినప్పటికీ, చట్టసభలో, సుప్రీంకోర్టో, కేంద్రసచివాలయమో పంచుకోవడం తప్ప, మూడు వ్యవస్థలకూ కేంద్రం అయ్యే అవకాశం ఉండదు. ఏదో ఒక జాతీయవ్యవస్థకు వేదిక అయినంత మాత్రాన, ఆంధ్రప్రదేశ్‌కో, తెలంగాణాకో రాజధానిగా ఉండే ప్రతిపత్తికి వచ్చే విఘాతంకానీ, తరుగుదల కానీ ఉండదు. హైదరాబాద్‌లోనూ తెలంగాణలోనూ స్థిరపడిన ఇతర ప్రాంతాల వారి రక్షణల కోసం, హక్కుల కోసం నిర్దిష్టమైన ప్రతిపాదనలను, డిమాండ్లను చేయడం కాక, అనిర్దిష్టమయిన ఉద్వేగపూరితమయిన ప్రతిపాదనలు చేయడం వల్ల విభజన సమస్యలకు పరిష్కారం లభించదు. రాష్ట్ర విభజన పరిణామాలపై ఆందోళన చెందుతున్నవారు, ఏదో ఒకరకమయిన మెజారిటీ గుంపుతత్వం వల్ల హరించుకుపోగల మైనారిటీల హక్కులపై అంబేద్కర్ చెప్పిన మాటలను ఆశ్రయిస్తే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలన్న అంబేద్కర్ ప్రతిపాదనను అసందర్భంగా ఉటంకిస్తే, అదే సందర్భంలో ఆయన చెప్పిన మాటలు హైదరాబాద్‌పై తెలంగాణేతర ప్రాంతాల హక్కువాదనకు ప్రతికూలంగా పనిచేస్తాయి. ఢిల్లీ మహానగరం కంటె అన్నివిధాల యోగ్యమైన నగరమని హైదరాబాద్ హంగుల గురించి అంబేద్కర్ వివరంగా పేర్కొన్నారు. 1955లో, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు హైదరాబాద్ గొప్పతనాన్ని అంబేద్కర్ మాటలలో చదివిన తరువాత, సమైక్యరాష్ట్ర రాజధాని అయిన తరువాతనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందనే వాదనను ఎవరైనా ఎట్లా చేయగలరు?

రాజధాని హోదాకు అభివృద్ధికి అనివార్యమైన సంబంధమున్నదనే వాదనే పొరపాటు. అమెరికాతో సహా యాభైకి పైగా దేశాలలో దేశరాజధానులు వేరు, మహానగరాలు వేరు. ఒక నగరం అభివృద్ధి చెందడానికి దానికి సొంత నైసర్గిక, భౌగోళిక, సాంస్క­ృతిక కారణాలుంటాయి. కౌలాలంపూర్ వంటి దేశరాజధానులు తమ విస్తరణకు ఆటంకంగా ఉన్నదని, రాజధానిని ఊరికి దూరంగా తరలించాయి. కాబట్టి, హైదరాబాద్ 'అభివృద్ధి'కి ఆంధ్రప్రదేశ్ రాజధాని హోదా రావడం ఏకైక కారణమో, తార్కికమైన కారణమో కాదు.

హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావడం వల్ల ఆ నగరం ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ ఉండదు. రెండో రాజధాని కావడం వల్ల, కేంద్రపాలన ఉంటుందని, కేంద్రపాలితం అవుతుందని ఎవరు భ్రమపడ్డా, భయపడ్డా అది నిర్హేతుకమే.

No comments:

Post a Comment