Saturday, February 16, 2013

అబ్రాహ్మణ బ్రాహ్మణత్వం నుంచి....

కె అంటే ఏమిటి శ్రీనివాస్? - అని అడిగారు బాలగోపాల్. ఆయనతో నేను వ్యక్తిగత సంభాషణ చేసింది అతి తక్కువ సార్లు. ఆయనంతట ఆయన అడిగిన వ్యక్తిగత ప్రశ్న మాత్రం అదొక్కటే. కండ్లకుంట- అని చెప్పాను. కందాడనో, కందాడైనో అనుకున్నాను- అన్నారాయన. నేను కూడా శ్రీవైష్ణవుడిని అని తెలుసుకుని సామాజిక కుతూహలంతో ఆ ప్రశ్న అడిగి ఉంటారు. బ్రాహ్మల్లాగా శ్రీవైష్ణవులు ఎక్కడ బడితే అక్కడ కాళ్లకూ చేతులకూ అడ్డం తగులుతూ ఉండరు కాబట్టి, ఎక్కడో ఎప్పుడో ఎవరో ఒకరు తారసపడినప్పుడు, పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా ఉండడం కష్టం.

ఈ శ్రీవైష్ణవ కులం విచిత్రమైనది. తక్కిన సమాజం దృష్టిలో బ్రాహ్మణుల్లో వీరు కూడా ఒక భాగం కాబట్టి, వీరిని ప్రత్యేకంగా చూడరు. శ్రీవైష్ణవులు మాత్రం వైదీకి, నియోగి వంటి బ్రాహ్మణ శాఖలతో సంబంధంలేని ఒక ప్రత్యేక తెగలాగా తమను తాము భావిస్తారు. వివాహ సంబంధాలు, సహపంక్తి భోజనాలు బ్రాహ్మణులతో నేమిటి, శ్రీవైష్ణవుల్లోనే తమిళ శాఖవారయిన అష్ట గోత్రీకులతోనే ఉండవు. ఇంకా వడహళ, తెంగల, వైఖానస- వంటి రకరకాల కోవలు, శాఖలు, భేదాలున్నాయి కానీ, వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. ఆమాటకొస్తే మా కులంలోని మా శాఖ వారి గురించే నాకు అన్ని వివరాలూ తెలియవు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య ఒక సందర్భంలో నా నేపథ్యం గురించి ఇటువంటి ఆరాయే తీశారు. 'శ్రీవైష్ణవులమండీ' అని చెప్పాను. అంటే బ్రాహ్మలే కదా, అన్నారాయన. కావచ్చు కానీ, మా అమ్మ ఒప్పుకోదండీ, మేం బ్రాహ్మలకంటె ఎక్కువ అంటుంది- అన్నాను. మీరనుకుంటే అయిపోయిందా, బ్రాహ్మల కంటె ఎక్కువ ఎట్లా ఉంటుంది? అన్నారాయన. ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ, బ్రాహ్మల కంటె పైనున్నామనుకుంటే ఆ ఫీలింగ్ బాగుంది అన్నాను. బ్రాహ్మలు కూడా మీ గురించి అట్లాగే అనుకోవచ్చు కదా- అని ఆయన ముక్తాయించారు.

వైష్ణవులకూ బ్రాహ్మలకీ మాత్రమే కాదు, తెలంగాణ వైష్ణవులకీ, ఆంధ్రా వైష్ణవులకీ తేడాలున్నాయి. తెలంగాణ వాళ్లు మాంస మద్యాలు తింటారు, తాగుతారు అని ఆంధ్రా వైష్ణవులకి ఫిర్యాదు. అంటే అదేదో రహస్యంగా
తినడం కాదు. సమాజానికి అంతటికీ తెలిసేట్టుగా బహిరంగంగానే తింటారు. తాగుతారు. ఆ రెంటినీ 'ద్వయవస్తువులు' అంటారు. భగవంతుడికి సమర్పించి ఆరగించేది ఏదయినప్పటికీ తప్పులేదని శ్రీవైష్ణవులు నమ్ముతారు. తెలంగాణలోని శ్రీవైష్ణవులు, ఆ మాటకొస్తే తెలుగుప్రాంతాలలోని శ్రీవైష్ణవులందరూ తమిళనాడు నుంచి ఐదారువందలేళ్ల కిందట వలసవచ్చారని చెబుతారు. తెలంగాణ ప్రాంతంలో, బహుశా కుతుబ్‌షాహీ పాలన మొదలయ్యాక, ఉభయశాఖల బ్రాహ్మల్లో అధికులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారని, మిగిలిపోయిన కొందరు నియోగులు వ్యాపారాల్లోకి వ్యవహారాల్లోకి దిగారని అంటారు. ఆంధ్రాప్రాంతంలోని తెలంగాణ బ్రాహ్మణుల గురించి మొన్న ఉండవల్లి సభలో చదివిన చిట్టాలోని ఇళ్లపేర్ల వాళ్లందరూ తెలంగాణ నుంచి వలస వెళ్లినవారే. అట్లా బ్రాహ్మణులు ఖాళీచేసిన సమాజంలోకి తమిళదేశం నుంచి పెద్ద సంఖ్యలో శ్రీవైష్ణవులు తరలివచ్చారు. ఇస్లామ్‌కు, ముఖ్యంగా షియా కోవలోని ఇస్లామ్‌కు, శ్రీవైష్ణవానికి ఉన్న తాత్వికమైన పోలికలు కూడా అందుకు దోహదపడి ఉంటాయి.

దైవంతో నేరుగా భక్తిసంబంధం కలిగి ఉండడం, సుఖజీవనానికి ఆధ్యాత్మికతకు వైరుధ్యం లేకపోవడం- తెలంగాణలోని పాలకమతంతో శ్రీవైష్ణవానికి పొత్తు కుదరడానికి కారణమై ఉండాలి. అంతే కాదు, శ్రీవైష్ణవంలోని తొలినాటి సామాజిక సమానత్వ భావన కూడా ఇస్లామ్‌తో సామరస్యానికి కారణం కావచ్చు. యాజ్ఞీకాలు, క్రతువులు, తతంగాలు- వీటిని అప్రధానం చేసి, భగవంతుడు, భాగవతుడు అన్న సంబంధాన్ని కీలకం చే సిన రామానుజ తత్వం- తొలిరోజుల్లో కులభేదం లేకుండా అందరికీ 'మతం' ఇచ్చింది. శంఖుచక్రముద్రలు పడిన ఎవరైనా సరే వైష్ణవుడే, సమానుడే అని చెప్పింది. ఆనాటి ఆ సంస్కరణతత్వం సమాజంలో అనేకులను ఆకర్షించింది కనుకనే ఇప్పటికీ తెలంగాణలో కరణాల నుంచి దళితుల వరకు అనేక కులాలలో వైష్ణవత్వం బలంగా కనిపిస్తుంది. అయితే, తొలితరాలలో ఉన్నంత ఉదారభావాలు, కులఅభేదం- రానురాను తగ్గిపోయింది. కులభేదాలను నిలుపుకుంటూనే వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయాలనే 'రివిజనిజం' మొదలయింది. శ్రీవైష్ణవతత్వాన్ని బ్రాహ్మణచట్రంలోకి తిరిగి తీసుకురావడంలో ప్రముఖపాత్ర వహించింది 14-15 శతాబ్దుల్లోని వరవరముని అంటారు.

శేషాద్రి రమణకవులని ఆంధ్రప్రాంతానికి చెందిన ఇద్దరు శ్రీవైష్ణవ సోదరులు, పాండిత్యమూ ప్రతిభా ఉన్నవారు తమ ప్రాంతంలో నెగ్గుకురాలేమని గ్రహించి 20 శతాబ్దపు తొలిదశాబ్దాలలో తెలంగాణకు వలసవచ్చారు. కొప్పరపు కవులకు, తిరుపతి వెంకటకవులకు, వెంకటరామకృష్ణకవులకు మధ్య పండిత స్పర్థలు శాఖాభేదాలై, పత్రికలూ విద్వాంసులూ అందరూ నియోగి వైదీకి వర్గాలుగా చీలిపోయిన సందర్భంలో, ఇక ఇక్కడ వైష్ణవునికి రాణింపు కష్టమని భావించి వారు తెలంగాణకు వచ్చారు. అందులో దూపాటి వేంకటరమణాచార్యులు పరిశోధకుడిగా, రచయితగా, ఆంధ్రమహాసభ కార్యకర్తగా తెలంగాణ సాంస్క­ృతిక వికాసోద్యమానికి అపారమైన దోహదం చేశారు. 'నైజాము రాష్ట్ర ప్రశంస' పేరుతో ఆయన రాసిన కావ్యం తెలంగాణ ప్రాంతానికి ఎత్తిన తొలి నీరాజనం. 'గోలకొండ కవుల సంచిక'లోని కవులలో అతి పెద్ద వర్గం శ్రీవైష్ణవులే. ఇంగ్లీషు విద్యతో, జాతీయోద్యమంతో, ఆంగ్ల ప్రభుత్వోద్యోగ వ్యవస్థతో సంపర్కం లేకపోవడం వల్ల- తెలంగాణ శ్రీవైష్ణవులు ఆధునికతలోకి, విద్యా ఉద్యోగ రంగాల్లోకి అతి ఆలస్యంగా మాత్రమే ప్రవేశించారు. అందుకే తెలంగాణ బాధల్లోను, పోరాటాల్లోనూ శ్రీవైష్ణవుల ప్రాతినిధ్యం ఆళ్వారుస్వామంత స్పష్టంగా కనిపిస్తుంది.

సమాజం దృష్టిలో బ్రాహ్మలే అయినా, శ్రీవైష్ణవుల బ్రాహ్మణీకరణ మాత్రం ఈ మధ్యనే మొదలయింది. సమాజంలో మరో పర్యాయం జరుగుతున్న పునరేకీకరణలో శ్రీవైష్ణవులు కూడా బ్రాహ్మణుల మహాపంక్తిలో చేరడానికే ఉత్సాహపడుతున్నారు. ఆ ప్రయాణంలో రామానుజతత్వం అందించిన మంచి విలువలు కూడా మరుగైపోతున్నాయి.

3 comments:

 1. Nice.
  S.Ramu
  apmediakaburlu.blogspot.com.

  ReplyDelete
 2. వ్యాసం బాగుంది. నిజాలు నిజాలుగా వ్రాసారు. మీకున్న ఏదో అభిప్రాయాన్ని సమర్దించే ప్రయత్నంగా కాక, ఒక వర్గం చరిత్ర, వర్తమానం భవిష్యత్తు ఆవిష్కరించారు.
  <>

  సమాజం దృష్టిలో డబ్బు కు ఇప్పుడు ఉన్న ప్రాధాన్యత ఇతర విషయాలకు లేదు కనుక. డబ్బు లేని, భక్తి, ఆచారం, చాదస్తం గల వాళ్ళందరూ సమాజం దృష్టిలో ఒకటే కనుక. కనీసం రెంటా చెడ్డ రేవడి కావటం కన్నా సామాజిక పరంగా బ్రాహ్మణులతో కలవటం నయమను కొంటుండవచ్చు. మరొ పక్క బ్రాహ్మణులలోనూ శాఖా పరమైన తేడాలు పల్చపడుతున్నవి కదా!

  ReplyDelete
 3. ****ఇంగ్లీషు విద్యతో, జాతీయోద్యమంతో, ఆంగ్ల ప్రభుత్వోద్యోగ వ్యవస్థతో సంపర్కం లేకపోవడం వల్ల- తెలంగాణ శ్రీవైష్ణవులు ఆధునికతలోకి, విద్యా ఉద్యోగ రంగాల్లోకి అతి ఆలస్యంగా మాత్రమే ప్రవేశించారు. అందుకే తెలంగాణ బాధల్లోను, పోరాటాల్లోనూ శ్రీవైష్ణవుల ప్రాతినిధ్యం ఆళ్వారుస్వామంత స్పష్టంగా కనిపిస్తుంది.
  **********


  Interesting !

  ReplyDelete