Tuesday, February 26, 2013

పరిషత్తుకు ప్రణామాలు!

డెబ్భయిల మొదట్లో హైదరాబాద్‌లో ఇన్ని ఆటోలు లేవు. ఫ్లయివోవర్లు, రయ్యిన దూసుకుపోయే కార్లూ లేని కాలం కాబట్టి, చిన్న చిన్న ఉతార్లూచడావులతో నగరం చదునుగానే ఉండే రిక్షాలకు అనువుగా ఉండేది. ఎప్పుడన్నా అవసరమై రిక్షాలో కాలేజీకి వెళ్లాలంటే, రిక్షా అతనికి ఆంధ్రసారస్వత పరిషత్ ప్రాచ్యకళాశాల అని చెపితే ఏమి తెలుస్తుంది? తిలక్‌రోడ్డు, ఎస్పీహాలు అంటే కూడా తెలిసేది కాదు. బొగ్గులకుంట, షాదీఖానా అని చెప్పాలి.

రామ్‌కోటి చౌరస్తా నుంచి ఆబిడ్స్‌ను కలిపే రోడ్డే తిలక్‌రోడ్డు. ఈ రోడ్డు మొదట్లో మహారాష్ట్ర మండల్ ఉంటుంది. మరాఠీల ప్రాతినిధ్యం కోసం రోడ్డుకు తిలక్ పేరు పెట్టారు కానీ, అసలుపేరు బొగ్గులకుంట. ఒకప్పుడు ఉండిన చెరువుకు ఆ పేరు ఒక అవశేషం. చరిత్ర తెలియాలే కానీ, ఆ రోడ్డు మీద నడుస్తుంటే కాలనాళికలో ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. సరోజినీదేవి హాలు, ఆ తరువాత చర్చి, పోస్‌నెట్ భవన్, ఆ పక్కన వందే ళ్ల పాతదైన మనోరంజితం స్కూల్ , ఆ పక్కనే పరిషత్తు. గేటు దాటి లోపలికి వెళ్లాక, ఎడమవైపు పరిషత్ కార్యాలయం పైన మొదటి అంతస్థులో మా సాయంకళాశాల. కుడివైపు పరిషత్ హాలు, దాని వెనుక బహిరంగ సమావేశస్థలి. పెళ్లిళ్లకు కూడా దాన్ని అద్దెలకు ఇస్తుండేవారు కాబట్టి పరిషత్ హాలుకు షాదీఖానా అని పేరు.

దాన్ని పెళ్లిళ్ల హాలు అని చెబితే చరిత్రకు అన్యాయం చేసినట్టే. ఆ హాలులో సమస్త ప్రజాసంఘాల సభలూ జరిగేవి. ఆర్ఎస్‌యు, పిడిఎస్‌యు, డిఎస్‌వో విద్యార్థి సంస్థల సమావేశాలన్నీ జరిగేవి. సాహిత్యఅకాడమీ, యువభారతి, సారస్వత పరిషత్తు, అరసం, విరసం, జనసాహితి సభలన్నీ జరిగేవి. కొన్ని సభలకు మా ఓరియంటల్ కాలేజీ పిల్లలే నిర్బంధ సభికులు. మరి కొన్ని సభలకు మా విద్యార్థులు స్వచ్ఛంద సభికులు. సమాజ సంచలనాలన్నీ సభల రూపంలో మా కాలేజీ ప్రాంగణానికి వచ్చేవి.

'సింగంబాకటితో గుహాంతరమున' సంచరించినట్టు, దేవులపల్లి రామానుజరావు అటూ ఇటూ తచ్చాడుతుండేవారు. ఆయన గొంతు నుంచి వచ్చే పిలుపులన్నీ సింహగర్జనల్లాగే ఉండేవి. ఏమ్ దాశరథీ, ఓయ్ కాళోజీ- అంటూ కవి దిగ్గజాల బుజాల మీద చేతులు వేసి ఆయన పలకరిస్తూ ఉండేవారు. ప్రసిద్ధులయిన కవులూ
రచయితలూ పండితులూ అందరూ అక్కడ మాకు దర్శనమిచ్చేవారు. పండగల్లాగా జరిగే సాహిత్యోత్సవాలు, సమరోత్సాహంతో జరిగే కవికవాతులు- అదొక సంరంభం. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే అయితే, దేశంలో వెల్లివిరిసిన ప్రజాస్వామిక స్ఫూర్తి అంతా మా పరిషత్ హాలులోనే ప్రతిఫలించింది.

డెబ్బైనాలుగు నుంచి ఎనభై ఒకటి దాకా ఆ కాలేజీలో చదివినప్పుడు, ప్రతి సాయంత్రం కొత్త ఉద్వేగం, కొత్త జ్ఞానం, కొత్త కుతూహలం మూటగట్టుకునేవాడిని. ప్రాచ్యకళాశాల అంటే సాహిత్యభాషాధ్యయనాల కేంద్రమే అయినప్పటికీ, యూనివర్సిటీల్లో బియ్యే ఎమ్మే తెలుగు కోర్సుల కంటె భిన్నంగా, గాఢంగా మా చదువులు ఉండేవి. అలంకార శాస్త్రం చెప్పిన పరాయితం కృష్ణమూర్తిగారు, సంస్కృతం బోధించిన సింగరాచార్యులుగారు, సంప్రదాయ కావ్యరహస్యాలను విప్పిచెప్పిన కె.వి. సుందరాచార్యులు గారు మాలో వ్యుత్పత్తిని తీర్చిదిద్దితే, ప్రబంధాలను వివరించిన విదుషి నాయని కోటేశ్వరిగారు, సుబోధక గానం జోడించి, పద్యాలను ద్రాక్షపాకంలోకి అనువదించిన పి.వి. చలపతిరావుగారు, హిందీ ఇంత అందమైన భాషనా అనిపించిన ఆమంచి గోపాలరావుగారు మాకు అధ్యయనాన్ని ఆహ్లాదకరంగా మలిచారు. ఇక చరిత్ర బోధించిన డి. చంద్రశేఖరరెడ్డిగారు, బాలవ్యాకరణం చెబుతూనే శ్రీశ్రీని మాకు హృదయస్థం చేసిన మోతుకూరు నరహరిగారు, ప్రిన్సిపాల్‌గా మా భయభక్తులను పొందుతూనే, స్నేహపూర్వకమైన వైఖరితో మా ఆరాధనను గడించిన కె.కె. రంగనాథాచార్యులుగారు- నన్ను నాబోటి వాళ్లను వీలయినంత 'అప్రాచ్యులు'గా మార్చేశారు. సాహిత్యాభిలాషిగా, సృజనాత్మక రచయితగా సుప్రసిద్ధులయిన కాకాని చక్రపాణిగారు నాకు పాఠం చెప్పకపోయినా, స్ఫూర్తిని అందించారు. గ్రంథపాలకుడు, అగ్రజ మిత్రుడు గడియారం శ్రీవత్స దుర్గమ అక్షరారణ్యంలోకి విసిరేస్తే, ఇప్పటికీ విముక్తి లేక అల్లాడిపోతున్నాను.

ఆ కాలేజీలో చేరినప్పుడు దాన్ని నిర్వహిస్తున్న సంస్ధ గురించి మాకు అవగాహన లేదు. దాన్ని సురవరం ప్రతాపరెడ్డి స్థాపించాడన్నదీ పెద్దగా విశేషమనిపించలేదు. నిజాం వ్యతిరేక ప్రజా ఉద్యమం రాజకీయాలే ప్రధానంగా సాగుతుండడంతో సాహిత్య భాషా రంగాలలో కార్యక్రమాలు నిర్వహించడం కోసం 1940లలో ఏర్పడిన సారస్వత పరిషత్తు, తెలుగు భాషలో విశారదాది కోర్సులు నిర్వహించి, నిజాం నుంచి విముక్తి తరువాత తెలంగాణ ప్రాంతంలో తెలుగు ఉపాధ్యాయులను అందించింది. 1960లలో ఓరియంటల్ కాలేజీని స్థాపించింది. ఎందరో దిగ్దంతులు ఆ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. అసంఖ్యాకమైన ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఆ కాలేజీ సమాజానికి అందించింది. అందులో ఎంతో చైతన్యవంతమైన, సంచలనాత్మకమైన సంవత్సరాలలో విద్యార్థిగా ఉండడం అయాచితమైన గొప్పఅవకాశం అనే చెప్పాలి. ఛాందసం, సంకుచితత్వం వంటి గుణాలనే ప్రాచీన విద్యలు అందిస్తాయనే అభిప్రాయాన్ని పరిషత్ కాలేజీ అబద్ధం చేసింది. అదే సమయంలో, ప్రగతి శీల ఆలోచనలకు, విమర్శనాత్మక దృక్పథానికి గట్టి పునాది అవసరమనే అంశాన్నీ అక్కడి విద్య నిరూపించింది.

ఇప్పుడు అకాడమీ సభలూ లేవు, అందమైన అనుభవంగా జరిగే యువభారతి సమావేశాలూ లేవు. ఒకప్పుడు నగరం నడిబొడ్డుగా ఉన్న విశాలమైన స్థలం ఇప్పుడు మారుమూల ఉన్న ఇరుకైన చోటుగా కనిపిస్తుంది. పార్కింగ్ కూడా కష్టం కాబట్టి, ఇప్పుడక్కడ సభలెవరూ పెట్టుకోవడం లేదు. రామానుజరావుగారు వెళ్లిపోతూ, అప్పగించిన సారస్వత పరిషత్ స్థలాన్ని, వ్యవస్థనూ అన్యాక్రాంతం కాకుండా సి.నారాయణరెడ్డిగారు కాపాడగలిగారు కానీ, పూర్తి పూర్వవైభవం తేవడం ఆయన చేతిలో లేదు. ప్రాచ్యకళాశాలలన్నీ వరుసగా మూతపడుతున్నాయి. పరిషత్ కాలేజీ కూడా అదే కోవలోకి పోతుందా? తెలియదు. వేగం పెరిగిన మనుగడల పోరాటంలో తెలుగుకు చెల్లుబాటు లేక- మా అనంతర విద్యార్థులు మథన పడుతున్నారు. మేం చదివిన కాలపు వైభవాన్ని గుర్తుచేసి వారిని మరింత బాధ పెడుతున్నానా?

No comments:

Post a Comment