Wednesday, February 13, 2013

భావోద్వేగాలు, బేరసారాలు

మాటల్లో నిప్పులు చెరగడం చేతలకు ప్రత్యామ్నాయమని కేసీఆర్ఎప్పుడో కనిపెట్టారు. పార్టీ స్థాపించి, తొలి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలోను, రాష్ట్రంలోను పాలకపక్షాల్లో ఒకటైన తరువాత, జనంలో ఉద్యమకారులుగా గుర్తింపు మిగుల్చుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం- దూషణలు, భీషణ ప్రతిజ్ఞలు, ప్రగల్భాలు. అప్పట్లో కేసీఆర్‌కాదు కానీ, మరో కేంద్రమంత్రిగా ఉన్న ఆలె నరేంద్ర వారం వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి, ఒక డోసు మాటలరక్తపాతాన్ని వదిలి వెళ్లేవారు. రెండువేల ఒకటి నుంచి తొమ్మిది దాకా- ఎనిమిది సంవత్సరాల కాలం, మధ్యలో వచ్చివె ళ్లిన ఉప ఎన్నికల హడావుడి మినహాయిస్తే- టిఆర్ఎస్ సమయాన్ని సద్వినియోగం చేసిందని చెప్పలేము. పార్టీని అట్టడుగునుంచి నిర్మించడం కానీ, తెలంగాణ ఉద్యమ అవగాహనను జనహృదయాల్లోకి బలంగా తీసుకువెళ్లడం కానీ - చేయగలిగి ఉండీ ఆ పార్టీ చేయలేదు. ప్రచారాన్ని, ఉద్యమవాతావరణాన్ని నిర్వహించినదంతా విద్యావంతులూ కళాకారులే.

అందువల్లనే, తెలంగాణ ఉద్యమానికి మనోభావాల మద్దతు ఉన్నంతగా, రాజకీయ నిర్మాణం లేకుండా పోయింది. ఎంతో పరిశ్రమ అవసరమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించడానికి ప్రత్యామ్నాయంగా భావోద్వేగాల వ్యాప్తిని, భౌతిక ఉద్యమానికి బదులుగా వాగాడంబరాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యం నుంచి చూస్తే, కేసీఆర్ తాజాగా వదిలిన దూషణాస్త్రాలను అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం అనుసరిస్తున్న బాధ్యతారహితమైన వాయిదా వైఖరిపై తెలంగాణవాదులలో, ప్రజలలో ఉన్న అసహనానికి, టిఆర్ఎస్, ఇతర తెలంగాణ ఉద్యమభాగస్వాములు అనుసరిస్తున్న పోరాటాల తీవ్రతకు ఉన్న అంతరాన్ని గుర్తించినవారు, ఆ ఖాళీని భర్తీ చేయడానికి లేదా జనంలోని ఉద్వేగాలను సంతృప్తిపరచడానికే అటువంటి తిట్లపర్వాన్ని ఆశ్రయించారని సులువుగానే అర్థం చేసుకోగలరు. అయితే, కెసిఆర్ దూషణలను అడ్డం పెట్టుకుని, అసలు సమస్య అదేనన్నట్టు కాంగ్రెస్‌వారు చేస్తున్న యాగీ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది.

కుట్టిన తేలు గుణవంతురాలే, కూసేదే గయ్యాళిది- అన్న సామెత మాదిరిగా- తెలంగాణ సమస్యతో చెలగాటమాడడడం, వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తేలికచేయడం, వారమంటే వారమా, నెలంటే నెలనా అని పిచ్చిప్రశ్నలు వేయడం గొప్ప సంస్కారమైనట్టు, కెసిఆర్‌కు మాత్రమే సంస్కారం
లేనట్టు ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్‌వారందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడున్నదాని కంటె మెరుగైన, ధీరోదాత్తమైన నాయకత్వం ఉండి ఉంటే బాగుండేది నిజమే. కానీ, ఉన్న నాయకత్వం ఇది. అది ఒక వాస్తవం. ఇంత జరిగినా ఇంకా కాంగ్రెస్ అధిష్టానంమీద నమ్మకమున్నది అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న నేతలు, ఎవరు టికెటిస్తే ఆ పార్టీలోకి వెళ్లాలి కాబట్టి తెలంగాణ విషయంలో ఆచితూచి మాటాడుతున్నవారు, ప్రభుత్వాన్ని ఒక్కమాట కూడా అనకుండా, ఉద్యమనాయకత్వం మీద మాత్రమే నిత్యం విమర్శలు గుప్పించేవాళ్లు- ఉన్న ప్రాంతం తెలంగాణ. ఇక్కడి మహత్తర పోరాట వారసత్వాన్ని, వేల ప్రాణాలను బలి ఇచ్చిన త్యాగశీలతను కీర్తించవలసిందే, గొప్పగా చెప్పుకుని స్ఫూర్తి పొందవలసిందే కానీ, ఈ ప్రాంతపు ప్రధానస్రవంతి రాజకీయవర్గానికి ఉన్న వెన్నెముక బలమైనది కాదు. సమర్థతకు, కాఠిన్యానికి కూడా పేరుపొందిన చెన్నారెడ్డి వంటి వారే, సకల సానుకూలతలున్న సమయంలోనే దాసోహం అనేశారు.

ఆ తరువాత ఈ ప్రాంతపు కాంగ్రెస్‌వారిని సమీకృతం చేయడానికి తెలంగాణ ఒక సాధనంగా మారిపోయింది. రాజశేఖరరెడ్డి కూడా ఆ సాధనాన్ని ఉపయోగించుకుని లబ్ధిపొందారు, కానీ, నిలబడి కలబడదామనే నేత ఎవరూ కాంగ్రెస్ కుదురు నుంచి రాలేకపోయారు. ఇంద్రారెడ్డి ప్రయత్నించారు కానీ, శక్తి చాలలేదు. తెలంగాణకు లేకలేక దొరికిన స్థిరమైన నాయకత్వం కేసీఆర్. ఎన్ని విమర్శలు చేసినా, కొన్ని విషయాలలో ఎంతగా ఏవగించుకున్నా- అతని ప్రత్యేకతను గుర్తించవలసిందే. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నిర్మించి సాగించడం కాదు, ఉద్యమమే కెసిఆర్‌ను నాయకుడిగా నిలబెట్టుకుంటూ వస్తున్నది. అట్లా ఉద్యమానికి పర్యాయపదంగా ఆయన స్థిరపడ్డాడు కాబట్టే, ఉద్యమాన్ని ఇష్టపడనివారు కేసీఆర్‌ను విమర్శిస్తారు, దూషిస్తారు. కేసీఆర్‌ను ఎవరైనా తప్పుపట్టినా, తిట్టినా ఉద్యమాన్నే తిట్టినట్టు తెలంగాణవాదులు భావిస్తారు. కేసీఆర్ అట్లా నోరుపారేసుకుని ఉండకూడదని అనుకుంటున్నవారు కూడా, ఈ అంశాన్ని అనవసరంగా అతిచేస్తున్నారని కూడా అంటున్నారు. కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించే తెలుగుదేశంనేతలు కూడా ఆయన దూషణలను ఈ సందర్భంలో అందుకే వెనకేసుకు వస్తున్నారు.

తిట్లలోని పారుష్యాన్ని పక్కనబెడితే, వాటిలోని విమర్శాంశాన్ని స్వీకరించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. నెహ్రూ-ఇందిర కుటుంబమేమీ విమర్శలకు అతీతమైనది కాదు. నెహ్రూకు అనేక ఘనతలున్నాయి. ఆయనను అభిమానించడానికి అనేక ఇతర కారణాలున్నాయి. కానీ, తెలంగాణ సాయుధపోరాటం విషయంలో చూపిన కాఠిన్యం ఆయన విద్వత్తుకు, గులాబీ ధరించిన మార్దవానికి తగినదేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణను తప్పుపట్టేవారు, అందుకు ఆమోదముద్ర వేసినవారిని కూడా తప్పుపడతారు. ఇందిరాగాంధీని అభిమానించడానికి ఆమెలో అనేక సుగుణాలుండవచ్చు. కానీ, అత్యవసర పరిస్థితిని విమర్శిస్తున్నాము కదా? రాష్ట్రంలోని ఉభయప్రాంతాల్లో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో అటూ ఇటూ కలిపి ఏడువందల మంది చనిపోవడానికి, విశాఖ ఉక్కు ఉద్యమంలో జరిగిన ప్రాణనష్టానికి, పంజాబ్ విషయంలో తప్పువ్యూహాలు రచించి తనతో సహా వేల ప్రాణాలు పోవడానికి- ఇందిర బాధ్యత లేదనగలమా? ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం విషయంలో జరుగుతున్న కప్పదాట్లకి, అమానుషమైన జాప్యానికి సోనియాగాంధీని ఎంతో కొంత తప్పుపట్టకుండా ఎలా ఉండగలం? కాంగ్రెస్‌పార్టీవారికి నె హ్రూ కుటుంబం ఆరాధ్యంకావచ్చును కానీ, బాధితులు మరో రకంగా భావిస్తారు కదా?

అలాగే, ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడిన మాటల్లోనూ దూషణలను, పరుషపదజాలాన్ని మినహాయించి, సారాంశాన్ని గుర్తించాలి. సీమాంధ్రులను దొంగలని, దోపిడీదారులని నిందించకుండా ఉంటే, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అంటున్నారు. తాము అందరినీ నిందించడంలేదని, తెలంగాణను అడ్డుకుంటున్నవారినే అంటున్నామని ఇవతలిపక్షం చేస్తున్న వాదనను పక్కనబెడితే, కలసి చర్చిస్తే చిక్కుముడి వీడుతుందని ఉండవల్లి చెబుతున్న మాటలను సీరియస్‌గానే తీసుకోవాలి. మంచి వాతావరణంలో చర్చించుకుంటే, విభజనకు వ్యతిరేకత ఏమీ ఉండదన్నట్టు ఆయన మాట్లాడారు.

ఉండవల్లి రాజమండ్రి సభలో వేసిన వీరంగాన్ని మాత్రమే గమనించినవారు, ఆయన మాటల్లో వ్యక్తమయిన సానుకూల అంశాలను గమనించినట్టు కనిపించదు. అయితే, ఆయన ఆ ప్రతిపాదనను ఏ హోదాలో చేస్తున్నారు, కాంగ్రెస్ అధినాయకత్వం అనుమతి ఆయనకు ఉన్నదా వంటి సందేహాలు కలుగుతాయి. ఒక సాధారణ తెలంగాణవాదికి వచ్చే ప్రశ్నలు ఏమిటంటే- వివిధ ప్రాంతాల రాజకీయనేతలు కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది? టిఆర్ఎస్‌ను మినహాయించి అయినా, కాంగ్రెస్‌పార్టీలోని వివిధ ప్రాంతాల వారి మధ్య అంతర్గత సంభాషణ ఎందుకు జరగలేదు? ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన నేతలను విడివిడిగా కలసి విన్నపాలను వింటున్న అధిష్ఠానం పెద్దలుఎందుకని అందరినీ కలిపి మాట్లాడాలని ఆలోచించలేదు? అటువంటి చర్చలకు తెలంగాణపక్షమే అవరోధమన్నట్టుగా ఎందుకు ఉండవల్లి మాట్లాడుతున్నారు? సరే, ఆలస్యంగా అయినా మంచి ఆలోచన వచ్చింది కాబట్టి ఆహ్వానించవలసిందే, కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

తెలంగాణవాదుల నుంచి అయినా, సమైక్యవాదుల నుంచి అయినా వినిపిస్తున్న దూషణలు, తిట్లు- అసలు సమస్య కాదు. అవి సమస్యకు సంబంధించిన ప్రతిఫలనాలు మాత్రమే. అసలు సమస్య ప్రయోజనాల ఘర్షణ. రాష్ట్రవిభజన అయినా, ఉన్నదున్నట్టు ఉంచడమైనా - అట్టడుగు స్థాయి నుంచి వ్యక్తమయ్యే ఆకాంక్షల ఆధారంగా, ఎగువ నుంచి తీసుకోవలసిన రాజకీయ, వైధానిక నిర్ణయం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. అయితే, ప్రజల ఆకాంక్షలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు రాజకీయవాదులు మాట్లాడతారు కానీ, వారికి విడిగా కూడా కొన్ని ఎజెండాలు ఉంటాయి. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కనుక, అందుకు ప్రతిగా టిఆర్ఎస్ విలీనం కావాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. అందుకు తాను సిద్ధమే కానీ, అది తన షరతులతో, తనకు అనుకూలమైన సమయంలో జరగాలని టిఆర్ఎస్ వాదిస్తోంది. ఈ రాజకీయ బేరసారాలు బాహాటంగానే జరుగుతున్నాయి.

అన్ని ప్రాంతాల నేతలు కూర్చుని చర్చించాలన్న ఉండవల్లి ప్రతిపాదనపై కదలిక లేదు కానీ, ఇచ్చిపుచ్చుకోవడాల మీద మాత్రం రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. ప్రాంతాల మధ్య సంభాషణలు అక్కరలేదు, టిఆర్ఎస్, కాంగ్రెస్ పెద్దల మధ్య మాటలు జరిగితే చాలు తెలంగాణ వచ్చేస్తుందన్న ధోరణిలో ప్రకటనలు వస్తున్నాయి. ప్రజలను, ఉద్యమాన్ని మినహాయించి జరిగే బేరసారాలు, పారదర్శకత లోపించి, జనంలో అనుమానాలను కలిగిస్తాయి. ప్రజాప్రయోజనాలకు కూడా భంగకరంగా పరిణమిస్తాయి. తెలంగాణ పరిష్కారం నుంచి వచ్చే రాజకీయప్రయోజనాన్ని ఎవరు ఎక్కువ పొందాలనే పోటీ - ఉద్యమంతో మరో చెలగాటంగా మారే ప్రమాదం ఉన్నది. రాజకీయపక్షాల మధ్య బేరసారాలు- ఎవరి సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వారు వ్యవహరించేట్టు చేస్తుంది. ఉండవల్లి సభకు సమాధానంగా కేసీఆర్ విప్పిన తిట్ల దండకం వెనుక- ప్రస్తుత వాతావరణాన్ని జటిలం చేసే ఉద్దేశం ఉన్నదా అని వినిపిస్తున్న అనుమానానికి అక్కడే బీజం ఉన్నది. ఉండవల్లి మాటల్లో వినిపించిన ధ్వనికి భిన్నంగా బుధవారం సాయంత్రం లగడపాటి మళ్లీ పాతధోరణిలో అశ్శరభ శ్శరభ అంటూ మాట్లాడడం వెనుక పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చే ఆలోచన స్పష్టంగానే కనిపిస్తున్నది.

ఫలసాయం కోతకు వచ్చే సమయంలో పార్టీలు తమ తమ లాభాల కోసం చూసుకుంటే, ఉద్యమం ఏమి కావాలి? నిన్నా మొన్నా ఇవాళా ఆందోళనతో, కలవరంతో, బాధతో, నిస్ప­ృహతో ప్రాణాలు తీసుకున్న యువకుల ఆకాంక్షలు ఏమి కావాలి

No comments:

Post a Comment