Tuesday, February 19, 2013

అభిమాన నటుడిపై అభియోగపత్రం

'అంతులేని కథ' సినిమాలో అయిదారు నిమిషాల పాటు కనిపించి ఆ పంచెకట్టు అందగాడు అమితంగా ఆకర్షించాడు. తెలుగు 'తూర్పు పడమర'కు తమిళ మాతృక 'అపూర్వ రాగంగళ్'తోనూ, బాలచందర్‌దే ఇంకో సినిమా డబ్బింగ్ 'మన్మథలీల'తోనూ అతని పేరు అప్పటికే సినిమాప్రేక్షకులకు సుపరిచితమైపోయింది. ఆ తరువాత వచ్చిన '16 వయతినిలే' (పదహారేళ్ల వయసు) వికలాంగ నాయకపాత్రలో అతను అద్భుతంగా రాణించాడు. కానీ, కమల్ హాసన్ నటనను పూర్తిస్థాయిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా మాత్రం బాలచందర్ 'మరోచరిత్ర'. అప్పటికే అరవైల దగ్గరపడిన అగ్రనటులు, నడివయసుకు చేరిన తరువాతి తరం నటులు గుప్పిస్తున్న అతినటనతో, మూసనటనతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఆ నవయువకుడు కొత్త అభినయాన్ని పరిచయం చేశాడు. అల్లరి, ఆగ్రహం, తపన, అంకితభావం, విదేశీయాసలో ఆంగ్ల ఉచ్చారణ, పాశ్చాత్యనాట్యంతో చేసే శరీరవిన్యాసం- వీటితో కమల్ అంటే యువతరం విభ్రమతో కూడిన ఆరాధనలో పడిపోయింది. 'బలెబలే మగాడివోయ్' అతనిలోని యవ్వనవేగాన్ని సూచిస్తే, 'ఇలాగే ఇలాగే సరాగమాడితే' అతని భావుక గాంభీర్యాన్ని పలికింది. ఆ కాలపు నవయువకులంతా, అతనిలో తమ ప్రతిబింబాలను అన్వేషించుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు భిన్నమైన సినిమావ్యాకరణాన్ని పరిచయం చేసిన బాలచందర్ యుగం 'ఆకలిరాజ్యం' తో తగ్గుముఖం పట్టింది. ఆ సినిమాలో కమల్ ఆగ్రహంతో పాటు అవగాహన కూడా కలిగిన యువకుడు. శ్రీశ్రీ అభిమాని. తరాల మధ్య భావసంఘర్షణను, స్వాతంత్య్రఫలాలు దక్కని కొత్త తరం నిస్ప­ృహను, తిరుగుబాటు తత్వాన్ని కమల్ నటన ప్రతిభావంతంగా ప్రతిఫలించింది. బాలచందర్ చేయిపట్టుకుని నడుస్తూనే
కమల్ తన ఆకాశాలను వెదుక్కోవడం మొదలుపెట్టాడు. ఎర్రగులాబీలు (భారతీ రాజా), అమావాస్య చంద్రుడు (సింగీతం శ్రీనివాసరావు) అతని బహుముఖాలను ఆవిష్కరించాయి. కానీ క్రమంగా అతను భావప్రాధాన్యాన్ని వదిలిపెట్టి, నటనలో సంక్లిష్టతకు ఆస్కారమున్న పాత్రలను ఇష్టపడడం మొదలుపెట్టాడు. పాత్రల వ్యక్తిత్వాలకు కాకుండా, వెలుగునీడల హావభావాలకు మనసును అంకితం చేసుకున్నాడు. అందగాడైనవాడు, తన ముఖాన్ని తానే వికృతం చేసుకోవడమో, వైకల్యాన్ని అభిమానించడమో, సాంకేతికత తోడు చేసుకుని అద్భుతాలు సృష్టించాలనుకోవడమో- తనను తానొక ప్రత్యేకతలోకి, విభిన్నతలోకి, అనితరసాధ్యతలోకి తరలించుకున్నాడు.

నటనను ఒక కళగా అమితంగా ప్రేమించేవాడికి, పాత్రలతో తాదాత్మ్యం అవసరం అని వేరే చెప్పనక్కరలేదు. ఆ తాదాత్మ్యాన్ని కొత్త శిఖారాలకు తీసుకువెళ్లినవాడు కమల్ హాసన్. 'మెథడ్ యాక్టింగ్' అని చెప్పే కోవలో అతను ఆరితేరాడు. ఒకసారి ఆ తాదాత్మ్యాన్ని అనుభవించినవాడు, నిత్యం కొత్త కొత్త పాత్రానుభవాల కోసం తాపత్రయపడక తప్పదు. మూస వ్యక్తీకరణలకు ఆస్కారం లేకుండా, ఒకే సమయంలో విభిన్న భావానుభావాలను ప్రకటించవలసి వచ్చే సందర్భాలు కలిగిన స్క్రిప్ట్‌లను, ఇతివృత్తాలను ఎంచుకోవడం కమల్‌కు అందుకే వ్యసనంగా మారింది. అయిష్టంగానే హింస ఊబిలోకి దిగిపోయి, అంతరాత్మ వద్దంటున్నా హత్యాకాండకు పాల్పడవలసి వచ్చిన పాత్రలో 'క్షత్రియపుత్రుడు' సినిమాలో కమల్ అర్జునుడి ద్వైధీభావం వంటిదాన్ని సమర్థంగా ప్రదర్శించాడు. వ్యవస్థ, అది పెట్టే ప్రలోభాలు, మనుషుల్లోని దుర్మార్గాలు- ఇవన్నీ కలిసి ఒక ముక్కుపచ్చలారని పిల్లను రెడ్‌లైట్ ఏరియాలోకి ఎగుమతి చేస్తే, దాన్ని కనుగొన్నప్పుడు ఆ అమ్మాయి తండ్రి గుండెలు పగిలి విలపించడమూ, క్రోధంతో రగిలిపోవడమూ 'మహానది' కమల్‌లో చూస్తాము.

కానీ, కమల్ ఎవరు? అతను ఒక గాఢప్రేమికుడా? వ్యవస్థపై ఆగ్రహించిన శ్రీశ్రీభక్తుడా? మనసు ఎదగకున్నా మంచితనమే గుణంగా కనిపించిన స్వాతిముత్యమా? ఒక గ్రామీణ ముఠాకోరా? పెళ్లైనవారిని ప్రేమించే ఆధునిక యువతులకు బుద్ధిచెప్పే సతీలీలావతులకు అండగా నిలిచే సంసారియా? మతిభ్రమణంలోనే తాత్వికతను గుప్పించే తెనాలియా? అగ్రరాజ్యపు స్వార్థంతో ముంచుకువచ్చే పెనుప్రమాదాన్ని దశావతారాలతో నిగ్రహించినవాడా? .. కమల్‌ను అతని పాత్రలతో కలిపి ఆలోచించడంలో ఉన్న ప్రమాదమే అది. అతని అభినయధోరణిలో ఎంతో ఆధునికత ఉన్నది, జీవితపు సకల పార్శ్వాలను తెరమీదికి రప్పించగలిగే ప్రజ్ఞ ఉన్నది, మంచి ఇతివృత్తమే ఉంటే దానికి పరమార్థాన్ని అందించగలిగే అవగాహనా ఉన్నది. కానీ, కమల్ వేరు, అతని పాత్రలు వేరు. అతను 'ఉలగనాయకుడే', కానీ, లోకనాయకుడా అని సంబోధిస్తున్నది తననా, జార్జిబుష్‌నా అని ప్రేక్షకులను గందరగోళపరిచే చాకచక్యమూ అతనికి ఉన్నది.

కొన్ని రకాల పాత్రలలో నటులను చూసి, వారు తెరబయట కూడా అట్లాగే ఉండాలనుకోవడంలోని అమాయకత్వం మొదటిసారి నాకు స్మితాపాటిల్ విషయంలో అర్థమయింది. అంతగా అభిమానించిన ఆ నటి, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకో జీర్ణం కాలేదు. ఆ అమాయకత్వపు ఆఖరిపొరను కమల్‌హాసన్ 'విశ్వరూపం' ఛేదించింది. సినిమా నిర్మాణకళను గొప్ప ఎత్తులకు తీసుకువెళ్లాడని సాంకేతిక అంశాలకు ప్రశంసించే ముందు, అతను రాజకీయంగా విచిత్రసోదరులలో ఒకరికంటె మరుగుజ్జుగా మారిపోయాడని అనిపించింది. 'సత్యం శివం'లో నటించిన కమలేనా ఇతను? అందులో కార్మికనాయకుడిగా మాట్లాడింది కమల్ కాదా?

ఉగ్రవాదంపై పోరు పేరుతో జరుగుతున్నదేమిటో కమల్‌కు తెలియదనుకోవాలా? కమల్ ఆలోచించిన చట్రంలోనే ఆలోచించినప్పటికీ- భారత్- అమెరికా కలసి ఉగ్రవాదంపై పోరాడడంలోని హాస్యాస్పదత అతనికి అర్థం కాలేదా? భారతదేశపు టెర్రరిస్టుభయాలను అమెరికా ఏనాడైనా ఖాతరు చేసిందా? భారతీయ సినిమా కన్నును సాంకేతికంగా ఆకాశానికి తీసుకువెళ్లిన కమల్, తన దృక్పథాన్ని ఎంతటి సంకుచితం చేసుకున్నాడు?

ఒక అమాయకపు యువక సామాజికుడు, అరవైకి సమీపిస్తున్నవేళ, ఏ పశ్చిమాద్రిలో గుంకుతున్నాడు?

2 comments:

  1. అభినందనల జల్లు కురిపిస్తూ చివరికొచ్చేసరికి చక్కగా కడిగేశారు. కమల్ ని అడిగితీరాల్సిన ప్రశ్నే!

    ReplyDelete