Saturday, February 9, 2013

 నిరాశకు మందు నిబ్బరమే


ఏమీ చేయకపోవడం అంటే కూడా ఏదో ఒకటి చేయడమే- పి.వి. నరసింహారావు సుప్రసిద్ధమైన మాటలు అవి. అయితే, తాను చేయాలనుకున్న పనుల విషయంలో ఎటువంటి తాత్సారమూ ఉదాసీనతా లేకుండా చాకచక్యంతో, చాణక్యంతో వ్యవహరించిన ఘనత పీవీ కి ఉన్నదని మనం మరచిపోలేము. పీవీతో వ్యక్తిగతంగా సరిపడకపోయినా సోనియాగాంధీకి పీవీమార్గంపై విముఖత ఏమీ లేదు. చేతలే కాదు, మాటలు కూడా కరువైన వ్యక్తిని ఆమె ప్రధానిగా ఎంచుకున్నారు. సమస్యలను పరిష్కరించడానికి కాక, సాచివేయడంలో ఆరితేరిన మనుషులను కోర్‌కమిటీగా సమకూర్చుకున్నారు.

కావలసిన పనుల విషయంలో వేగాన్ని, ఇతర నిర్ణయాల విషయంలో నత్తనడకని అనుసరించడంలో సోనియా, ఆమె బృందమూ పీవీ బాటలోనే నడుస్తున్నారు. వారమంటే ఏడురోజులా, నెల అంటే ముప్పైరోజులా- అని కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. పదిహేనేండ్ల నుంచి తెలంగాణ ఉద్యమం సాగుతున్నదని మరచి, తాము ఉద్యమక్రమంలో జోక్యం చేసుకుని తెలంగాణ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎనిమిదేళ్లు గడిచిందని విస్మరించి- ఇంత పెద్ద సమస్యను రోజుల గడువులోపల పరిష్కరించడం సాధ్యమా- అని నిలదీస్తున్నారు. తెలంగాణపై ప్రకటన ఎప్పుడంటే, నిర్ణయం తీసుకున్నాక ప్రకటన ఎంత సేపు- అని గడుసుతనం ప్రకటిస్తున్నారు. ఇటువంటి పరిహాసవైఖరి కారణంగానే దేశంలో అనేక సమస్యలను మురగబెట్టి, వేల లక్షల ప్రాణనష్టానికి కారకులు కావడంతో పాటు, స్వయంగా తమకే ముప్పు తెచ్చుకున్న విద్రోహ, విషాదచరిత్ర కాంగ్రెస్ నాయకత్వానిది.

కాబట్టి, ఏమీ చేయకపోవడానికి కూడా ఒక అర్థం ఉంటుందని మరోసారి గుర్తించాలి. సమస్య సంక్లిష్టమయినది, జటిలమయినది కాబట్టి బుర్ర బద్దలు కొట్టుకున్నా పరిష్కారం దొరకక కాంగ్రెస్ అధినాయకులు గడువుమాట తప్పారని అనుకుంటే పొరపాటు. పరిష్కరించే సాహసం లేక, సంకల్పం లేక, యథాస్థితినుంచి అంగుళం కూడా కదలగలిగే చైతన్యం లేక, ప్రజాకాంక్షల మీద కనీస సానుభూతి లేక- ప్రదర్శిస్తున్న నిశ్చేతనే తప్ప
మరొకటి కాదు. కల్లోల జలాలలో లాభాలను అన్వేషించే హ్రస్వదృష్టి, దీర్ఘకాలిక సామాజిక, రాజకీయ కర్తవ్యాలను నెరవేర్చలేని అశక్తత కాంగ్రెస్‌పార్టీని కుంగదీస్తున్నాయి. అది నేడు తెలంగాణ విషయంలో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడవచ్చును కానీ, అనేక జాతీయ సమస్యల విషయంలో మాత్రం ఇటువంటి వైఖరి కారణంగా ఆత్మహత్యా సదృశమైన పర్యవసానాలను అనుభవించవలసి వస్తుంది.

ఇంకో నాలుగు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వస్తుందని ఆశగానో ఆసక్తిగానో ఎదురుచూస్తున్న ప్రజలకు, బుధవారం నాటి 'వాయిదా' ప్రకటన తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది. ఇంకో నాలుగురోజులో, వారమో ఆగలేక కాదు, కానీ, ఈ వాయిదా వెనుక వ్యక్తమవుతున్న ఢిల్లీపెద్దల వైఖరి అసహనాన్ని కలిగిస్తుంది. ఇప్పుడున్నంత ఉత్కంఠ తెలుగు సమాజంలో మునుపెన్నడూ ఉండి ఉండదు. నాలుగు దశాబ్దాల పాటు కొంత కాలం నెమ్మదిగా, జాతీయోద్యమంలో విరామం దొరికినప్పుడల్లా ఉధృతంగా సాగిన ఆంధ్రోద్యమం చివరకు సఫలమై 1953లో ఆంధ్రరాష్ట్రం అవతరించినప్పుడు కూడా ఇంతటి ఆందోళన, ఉత్సుకత ఉండి ఉండకపోవచ్చు.

తెలుగు వారు విడిపోవడానికి తమిళులకు అభ్యంతరం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా రాష్ట్రం ఇవ్వడానికి సముఖంగా ఉండడం- నాడు ఒక ధీమా కలిగించాయి. వివాదమంతా రాజధాని మీదనే. మదరాసు మీద పట్టుబట్టిన ఒక వర్గం కారణంగా రాష్ట్రం ఏర్పాటులో ఆలస్యమయింది, చివరకు పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానంతో రాష్ట్రం ఏర్పడడమే కాక, దేశంలోనే భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మార్గం ఏర్పడింది. దేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం కర్నూలు రాజధానిగా 1953లో ఏర్పడిన ఆంధ్రరాష్ట్రమే. ఒక భాష మాట్లాడేవారు ఒక రాష్ట్రంలో ఉండాలన్నదే భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక. అంతే తప్ప, ఒక భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంలో ఉండడం కానీ, ఒక భాషకు ఒకే రాష్ట్రమని కాదు.

1953లో ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం, నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ కలయికపై తెలంగాణలో గట్టి అసమ్మతి ఉన్నప్పటికీ, విశాలాంధ్ర ఏర్పడింది. పునాదిలేని కలయిక, తరువాత కూడా గట్టిపడే పరిణామాలు సాగలేదు. 1969లో పెద్ద ఉద్యమం జరిగింది. 1973లో ఆంధ్రప్రాంతంలోనూ ప్రత్యేక ఉద్యమం తీవ్రంగా సాగింది. 1995 నుంచి తెలంగాణలో మలిదశ ఉద్యమం నిలకడగా, దృఢంగా నిర్మాణమవుతూ వచ్చింది. ఈ పదిహేడేళ్ల ప్రయాణం ఒక కొలిక్కి వచ్చి, కనీసం కాంగ్రెస్ వైఖరి అయినా తెలుస్తుందనుకుంటున్న తరుణంలో- మళ్లీ బాధ్యతారహితమయిన స్పందనలే లభిస్తున్నాయి.

అన్నిటికంటె బాధాకరమైన విషయమేమిటంటే- రేపోమాపో ఫలితం తెలుస్తుందనుకుంటున్న తరుణంలో సైతం- అతి ప్రాథమికమయిన, మౌలికమయిన అంశాల మీదనే నేతల మధ్య వాదులాటలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం అబద్ధాల పుట్ట అని చెప్పే పుస్తకాలు వెలువడుతున్నాయి.

దాని మీద తిరిగి చర్చలు, ఆవేశాలు.. గణాంకాల వివరాలు, అసమానతల సాక్ష్యాలు ప్రాతిపదికగా వివాదపడే ఘట్టమా ఇది? ఉభయప్రాంతాల్లో ఒకరిమీద ఒకరికి విశ్వాసాన్ని, ప్రేమను, పరస్పర సహజీవనంలో ఉమ్మడిప్రయోజనాలను కల్పించడంలో సమైక్యరాష్ట్రం విఫలమయిందని అర్థం కావడం లేదా? విడిపోవాలని నిశ్చయించుకున్న పక్షాన్ని ఏమి చేసి కలుపుకోగలరు? ఒక ఇంట్లో ఉండగలరు కానీ, కలసి కాపురం చేయగలరా? ఎవరి మౌలికవైఖరికి వారు కట్టుబడి తక్కిన అంతటినీ నిరాకరించే ధోరణి వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రవిభజనలో తెలంగాణకు ప్రయోజనాలున్నాయనుకుంటున్నవారు, ఇతర ప్రాంతాలవారికి, ముఖ్యంగా ఆ ప్రాంతపు పెద్దమనుషులకి, నష్టాలుంటాయన్న స్పృహ కూడా ఉండాలి. సీమాంధ్రప్రాంత నేతలు సంపన్నులు, పలుకుబడి కలిగినవారు, శక్తివంతులు అని అంగీకరిస్తున్నప్పుడు- వారు విభజనను శాయశక్తులా అడ్డుపడతారన్న అవగాహన తెలంగాణ ఉద్యమానికి ఉండాలి.

లాబీయింగ్ ద్వారా ఆశయాన్ని సాధించాలనుకున్న నాయకుడికి, అవతలిపక్షం ఆ విద్యలో నాలుగాకులు ఎక్కువ చదివిందని తెలియవద్దా? 2009లో చిదంబరం ప్రకటనలకు దారితీసిన పరిణామాలు, సీమాంధ్రవారిని కుంభకర్ణ నిద్రనుంచి లేపితే, తెలంగాణ ఉద్యమానికి అనూహ్యమయిన ఎదురుదెబ్బను తినిపించింది. వందలాది మంది విద్యార్థుల బలిదానానికి కారణమయింది. తెలంగాణ ఉద్యమానికి 2009 దాకా నాయకత్వం వహించిన పార్టీ, సవ్యమైన పద్ధతిలో ఉద్యమనిర్మాణం చేసి ఉంటే, ఉద్వేగాల స్థానంలో అవగాహనలను వ్యాపింపజేసి ఉంటే- ఈ రోజు అది ఎంతో పటిష్టమైన యంత్రాంగంతో, కార్యకర్తలకు అభిమానులకు నిబ్బరాన్ని మనోధైర్యాన్ని అందించగలిగి ఉండేది.
ఇప్పుడు మళ్లీ మూడేళ్ల కిందటి పరిస్థితి ఎదురవుతున్నది. నెలరోజులుగా పెంచుకున్న ఆశలు, ఏమవుతుందో అన్న ఉత్కంఠ- తుది నిర్ణయం ప్రకటన తరువాత ఎటువంటి వ్యక్తీకరణలకు ప్రేరేపిస్తాయోనన్న ఆందోళన- అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా సమాజ శ్రేయోభిలాషులందరినీ బాధిస్తున్నది, బాధించాలి. అనుకూలంగానే నిర్ణయం లభిస్తుందని అవాస్తవికమైన స్థాయిలో ఆశపడడం కానీ, ఇక ఈ ఘట్టంతోనే సర్వమూ ముగిసిపోతుందని భయపడడం కానీ సరైనది కాదు.

నిర్ణయాన్ని ప్రభావితం చేయాలనే అమాయకపు సంకల్పంతోనో, ఉత్కంఠను భరించలేకనో, నిర్ణయం ప్రతికూలమేనని ముందే నిర్ధారించుకోవడం వల్లనో తెలంగాణ యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలు ఒకటీ రెండూ రోజూ బయటకు వస్తున్నాయి. ఒక మానవీయ సంక్షోభమే ఏర్పడితే, అది ఆత్మహత్యల రూపం మాత్రమే తీసుకుంటుందని ఎవరూ హామీ ఇవ్వలేరు.

జనంలోని ఆశాంతి ఎట్లా కట్టలు తెంచుకుంటుందో ఎవరూ చెప్పలేరు. అటువంటి పరిణామాలు ఉద్యమానికి, సమాజానికి మంచివి కావు. సానుకూలమైన దృక్పథాన్ని, ఆశావాదాన్ని వదలకుండానే, ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా ఉండే మనస్స్థితిని తెలంగాణవాదులు అలవరచుకోవాలి. రాజకీయపార్టీలు, సంయుక్త కార్యాచరణ సమితులు, నేతలు, కవులు, కళాకారులు- ప్రజల్లో నిర్మాణాత్మకమైన ప్రతిస్పందనలను ప్రోత్సహించాలి. ధైర్యాన్ని చెప్పాలి.

ఎదురుదెబ్బ తగిలినా, గాయం మాన్పుకుని భవిష్యత్ ప్రయాణం సాగించాలని ఊరట ఇవ్వాలి. ప్రాణాలు తీసుకునే, విధ్వంసానికి పాల్పడే జీవశక్తిని- గొప్ప ఉద్యమస్ఫూర్తిగా మలచుకోవచ్చునని, నాలుగు గోడల మధ్య తీసుకునే నిర్ణయాలు కావు, జనచైతన్యమే పరిణామాలను శాసిస్తుందని చాటి చెప్పాలి. గడువువాయిదా వేసినవారు, ఈ ఉత్కంఠను, అనిశ్చితిని కూడా వాయిదా వేశారు. ఆశను, సంకల్పాన్ని, నిశ్చయాన్ని ప్రకటించడానికి కూడా మరింత వ్యవధిని ఇచ్చారు. అది గుర్తిస్తే, నిరాశ దరిచేరదు. నిస్ప ృహ సోకదు. - కె. శ్రీనివాస్

2 comments:

  1. brillant piece of information, I had come to know about your web-page from my friend hardkik, chennai,i have read atleast 9 posts of yours by now, and let me tell you, your webpage gives the best and the most interesting information. This is just the kind of information that i had been looking for, i'm already your rss reader now and i would regularly watch out for the new posts, once again hats off to you! Thanx a million once again, when was starts Thanx

    ReplyDelete