Friday, March 15, 2013

అశ్రువులను పేని..

నయాగరా జలపాతాన్ని చూసి- నిలుచున్న సముద్రం లాగా ఉన్నది- అన్నాడట తమిళ కవి వైరిముత్తు. పోలిక అద్భుతమే అయినా, నీళ్లను నీళ్లతో పోల్చగలిగే సులువు అందులో ఉన్నది.

నల్లగొండ సభావేదిక మీద తెల్లదుస్తుల బవిరి గడ్డపు ఆ మనిషిని చూసినప్పుడు మాత్రం మంచినీళ్లకు లాల్చీపైజమా తొడిగినట్టు కనిపించింది. అతని చూపులు దాహంతో తీక్షణంగా ఉన్నాయి. అతని మాటలు ఎత్తిపోతల్లాగా ఎగిరి దుముకుతున్నాయి. జ్ఞాపకాలను, చరిత్రను, బాధానుభవాలను తట్టిలేపి అతను సొరంగ స్వప్నానికి మళ్లీ రెక్కలు తొడుగుతున్నాడు. దుశర్ల సత్యనారాయణ. నల్లగొండకు జలభిక్ష పెట్టింది అతనే అంటే అతిశయోక్తి అవుతుంది కానీ, అతనూ అతనితో నడచిన జనమూ అంటే మాత్రం అందులో అబద్ధం ఏమీ లేదు. కృష్ణ పక్కనే పారుతున్నా, సేద్యం ఒక మృగతృష్ణగా, నేల బోరుబావుల క్షతగాత్రిగా, మంచినీరు విషంగా మారిపోయిన నల్లగొండలో, సుమారు ఇరవయ్యేళ్ల కిందట జలసాధన సమితి పేరుతో దుశర్ల ఒక ప్రయత్నం ప్రారంభించారు. దుర్భిక్ష రైతాంగాన్ని, ఫ్లోరోసిస్ బాధితులను హైదరాబాద్ వీధుల్లోకి తరలించారు, వందలాది మంది తో నామినేషన్లు వేయించి నల్లగొండ పార్లమెంటు స్థానం బ్యాలట్ పత్రాన్ని నల్లగొండ బావుల చేంతాడంత విస్తరించారు.

ముఖ్యమంత్రుల ముందు నివేదనలు చేయించారు. చివరకు ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఆందోళన చేయించారు. ప్రధాని వాజపేయి ముందు ఫ్లోరైడ్ పంజా తిన్న వికలాంగులను ప్రవేశపెట్టారు. మంచినీళ్లు కావాలి మహాప్రభూ అని దిక్కులు పిక్కటిల్లేలా ఆక్రోశించారు. తిరుమల వెంకన్న ముందు వేలాదిమంది చేత మొరపెట్టించారు. శ్రీశైలం జలాశయంలో మెడలోతు నీళ్లలో నిరసన తెలిపారు. నాయకత్వంలో దృఢత్వం, ఉద్యమరూపాల్లో సృజనాత్మకత, లక్ష్యశుద్ధితో పాటు చిత్తశుద్ధి జలసాధనసమితి ప్రదర్శించిన సుగుణాలు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం ఆశయం సిద్ధించలేదు కానీ, ఎత్తిపోతల ద్వారా నల్లగొండ జిల్లాలోని కొన్ని జలాశయాలకు

Thursday, March 7, 2013

వెనెజులా వీరుడు

"ఆ పిశాచం నిన్న ఇక్కడికి వచ్చింది, ఇక్కడే ఈ చోటనే నేను నిలబడ్డ చోటునే నిలబడి మాట్లాడింది, ఇంకా దాని గంధకపు వాసన గుప్పుమంటూనే ఉంది'' అని శిలువకు అభివాదం చేస్తున్నట్టు అభినయించి ఆ వక్త ఒక్క క్షణం ఆగాడు. "అయ్యలారా, అమ్మలారా, అమెరికన్ అధ్యక్షులవారు, అదే నేనిప్పుడు పిశాచం అని చెప్పానే ఆ పెద్దమనిషి, ప్రపంచం అంతా తన సొంతజాగీరన్నట్టు ఈ వేదిక ముందునుంచి మాట్లాడారు...'' అంటూ నిప్పులు కురిపిస్తూ, ఉపన్యాసం కొనసాగించాడు. 2006 సెప్టెంబర్ 20 నాడు అమెరికా గడ్డ మీద, ఐక్యరాజ్యసమితి వేదిక మీద జార్జి బుష్‌ను పిశాచి అని పిలిచిన వాడి పేరే హ్యూగో చావెజ్.

చావెజ్ లేకపోతే, వెనెజులా పేరు ప్రపంచానికి ఇంతగా పరిచయమయ్యేది కాదు. అమెరికాను ఎదిరించడమొక్కటే సుగుణమయి ఉంటే, చావెజ్‌కు ఇంతటి ప్రఖ్యాతి వచ్చేది కాదు. బుధవారం నాడు అతను మరణించినప్పుడు ఆ దేశపు బీదాబిక్కీ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కష్టజీవులు కంట తడి పెట్టేవారు కాదు. అతను జాతీయవాదా, సోషలిస్టా, విప్లవకారుడా- ఎవరి విశేషణాలు వారు పెట్టుకోవచ్చు. ఆధిక్యాలూ ఆధిపత్యాలూ దోపిడీలూ లేని సమసమాజమూ న్యాయసమాజమూ తప్ప మరిదేనికీ, మరే తాత్కాలిక సంస్కరణలకీ రాజీపడకూడదని అనుకుంటే, చావెజ్ పెద్దగా సాధించిందేమీ కనిపించకపోవచ్చు. కానీ, వనరులపై ఉక్కు పిడికిలి బిగించి, ప్రపంచీకరణ పేరుతో సర్వం భుక్తం చేసుకునే అగ్రరాజ్యవాదాన్ని, ఒక మూడో ప్రపంచదేశం ప్రతిఘటించడం ఒక గొప్ప విలువ అనుకుంటే, దాన్ని ఆచరించినందుకు చావెజ్‌ను చరిత్ర గుర్తు పెట్టుకోవలసిందే.

అన్ని ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల వలెనే వెనెజులా కూడా కొలంబస్ రాకడతో ప్రారంభించి వలసగా మారినదే. ఇతర పోటీవలసవాదులతో నెగ్గి స్పానిష్ సామ్రాజ్యవాదులు చేజిక్కించుకున్న వెనెజులా, రెండువందలేళ్ల కిందటే 'స్వతంత్రం' సాధించుకున్నప్పటికీ, సైనిక, నియంతృత్వ పాలనల్లో మగ్గుతూ వచ్చింది. సౌదీ అరేబియా కంటె అధికమైన చమురు నిల్వలు కలిగిన ఆ దేశంలో బహుళజాతి చమురు కంపెనీలు పాగావేశాయి. చమురుపరిశ్రమను జాతీయం చేయడం చాలా కాలం కిందటే జరిగినప్పటికీ, ప్రభుత్వ అజమాయిషీ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగి క్రమంగా విదేశీ కంపెనీలదే పెత్తనం అయింది.

1980, 90 దశాబ్దాలలో ఆర్థిక సంక్షోభం ముదిరి, దేశంలో అశాంతి నెలకొన్నది. నాటి అధ్యక్షుడు కార్లోస్ ఆండ్రెజ్ పెరెజ్ ప్రభుత్వంపై 1992లో రెండుమార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. అందులో ఒక తిరుగుబాటుకు

Monday, March 4, 2013

మీడియా స్పందనలు, మంచిచెడ్డలు

మొన్న బుధవారం నాడు హైదరాబాద్‌లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నిజానికి అది రౌండ్ టేబుల్ కాదు. రౌండ్ టేబుల్ అంటే ఒక అంశం మీద విభిన్న అభిప్రాయాలు, వివిధ అభిప్రాయాలు కలిగినవారు కూర్చుని సమాన స్థాయిలో సంప్రదించుకునే వేదిక. అక్కడ జరిగింది అది కాదు. అక్కడ ఉన్న సభ్య ప్రపంచం లేదా పౌర సమాజం ప్రతినిధులు, అంతో ఇంతో బాధితవర్గాలకు తోడుగా ఉంటున్నామనుకునే బృందాలు- తామెంత అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నాయో, ఎన్నెన్ని వాస్తవాలకు తమ కళ్లు మూసుకుపోయాయో తెలుసుకుని కుంగిపోయాయి, అపరాధభావనలో మునిగిపోయాయి.

దళిత స్త్రీ శక్తి అనే సంస్థ వార్షిక సభల కార్యక్రమంలో దళిత స్త్రీలు కొందరు తమ బాధానుభవాలను వేదిక మీద నివేదించినప్పుడు, ఆ నివేదనలను విని తీర్పులు నిర్ధారణలు ప్రకటనలు చేయవలసిన వివిధ రంగాలకు చెందిన బాధ్యతాయుతులైన ప్రతినిధులు ఎదుర్కొన్న సంకటస్థితిని వర్ణించలేము. ప్రేమ పేరుతో సవర్ణులు చేసిన మోసాలు, పెళ్లి తరువాత సొంత భర్తా అత్తమామలే పెట్టిన హింసలు, చదువుకుందామని ప్రయత్నిస్తే ఎదురయిన సామాజిక అవమానాలు, ఉద్యోగాలలోకి వెడితే పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి వచ్చిన ఈసడింపులు- ఒక్కొక్కరు కన్నీళ్లతో కలిపి పూసగుచ్చుతుంటే, మీడియా వేయికళ్ల నుంచి, అధికార యంత్రాంగం సహస్రబాహువుల నుంచి ఈ నేరాలు ఘోరాలు ఎట్లా తప్పించుకున్నాయా అనిపిస్తుంది. సాంకేతికత, కమ్యూనికేషన్స్ ఇంతగా విస్తరించినప్పటికీ, ఇప్పటికీ మానవజీవన పార్శ్వాలలో అణుభాగం కూడా వెలుగుచూడడం లేదని అర్థమయింది.

బాధితుల నివేదనలు విని, వ్యాఖ్యానించవలసిన జ్యూరీలో వివిధ శాఖల ప్రభుత్వాధికారులతో పాటు, మీడియా సంపాదక ప్రతినిధులు కూడా ఉన్నారు. దళితస్త్రీశక్తి నిర్వాహకులు మాట్లాడుతూ, ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి అంతటి ప్రచారం ఇచ్చిన మీడియా, ఇటువంటి మానవీయ విషాదాలను, సామాజిక దుర్మార్గాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దానితో పాత్రికేయులు స్పందనలను కాక, సంజాయిషీలను ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తప్పేమీ లేదు. సమాజ సంక్షేమానికి కానీ, దురన్యాయాలకి కానీ ప్రజాజీవితంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించవలసిందే. ఇటీవలి కాలంలో, రాజకీయ నేతలను, అధికారులను నిలదీసి ప్రశ్నించే ధోరణి పెరుగుతున్నట్టే, మీడియా పాత్ర గురించిన ప్రశ్నలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామిక స్ఫూర్తి విస్తరిస్తున్నదనడానికి ఇది ఒక సంకేతం కూడా కావచ్చు.

'నిర్భయ' సంఘటనగా ప్రసిద్ధమయిన ఢిల్లీ సామూహిక అత్యాచారానికి ప్రజల్లో అంతటి స్పందన ఎందుకు వచ్చిందో, మీడియా కూడా దానికి విశేష ప్రాధాన్యం ఎందుకు ఇచ్చిందో - అంత సులువుగా అంతుబట్టే విషయం కాదు. నిత్యం అటువంటివో, అంతకు ఎక్కువవో, తక్కువవో అనేకం జరుగుతున్నా రాని స్పందన ఆ సంఘటనకు ఎందుకు లభించిందన్నది పాత్రికేయులకు కూడా కలిగిన ప్రశ్నే. ఆ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయో,