Thursday, March 7, 2013

వెనెజులా వీరుడు

"ఆ పిశాచం నిన్న ఇక్కడికి వచ్చింది, ఇక్కడే ఈ చోటనే నేను నిలబడ్డ చోటునే నిలబడి మాట్లాడింది, ఇంకా దాని గంధకపు వాసన గుప్పుమంటూనే ఉంది'' అని శిలువకు అభివాదం చేస్తున్నట్టు అభినయించి ఆ వక్త ఒక్క క్షణం ఆగాడు. "అయ్యలారా, అమ్మలారా, అమెరికన్ అధ్యక్షులవారు, అదే నేనిప్పుడు పిశాచం అని చెప్పానే ఆ పెద్దమనిషి, ప్రపంచం అంతా తన సొంతజాగీరన్నట్టు ఈ వేదిక ముందునుంచి మాట్లాడారు...'' అంటూ నిప్పులు కురిపిస్తూ, ఉపన్యాసం కొనసాగించాడు. 2006 సెప్టెంబర్ 20 నాడు అమెరికా గడ్డ మీద, ఐక్యరాజ్యసమితి వేదిక మీద జార్జి బుష్‌ను పిశాచి అని పిలిచిన వాడి పేరే హ్యూగో చావెజ్.

చావెజ్ లేకపోతే, వెనెజులా పేరు ప్రపంచానికి ఇంతగా పరిచయమయ్యేది కాదు. అమెరికాను ఎదిరించడమొక్కటే సుగుణమయి ఉంటే, చావెజ్‌కు ఇంతటి ప్రఖ్యాతి వచ్చేది కాదు. బుధవారం నాడు అతను మరణించినప్పుడు ఆ దేశపు బీదాబిక్కీ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కష్టజీవులు కంట తడి పెట్టేవారు కాదు. అతను జాతీయవాదా, సోషలిస్టా, విప్లవకారుడా- ఎవరి విశేషణాలు వారు పెట్టుకోవచ్చు. ఆధిక్యాలూ ఆధిపత్యాలూ దోపిడీలూ లేని సమసమాజమూ న్యాయసమాజమూ తప్ప మరిదేనికీ, మరే తాత్కాలిక సంస్కరణలకీ రాజీపడకూడదని అనుకుంటే, చావెజ్ పెద్దగా సాధించిందేమీ కనిపించకపోవచ్చు. కానీ, వనరులపై ఉక్కు పిడికిలి బిగించి, ప్రపంచీకరణ పేరుతో సర్వం భుక్తం చేసుకునే అగ్రరాజ్యవాదాన్ని, ఒక మూడో ప్రపంచదేశం ప్రతిఘటించడం ఒక గొప్ప విలువ అనుకుంటే, దాన్ని ఆచరించినందుకు చావెజ్‌ను చరిత్ర గుర్తు పెట్టుకోవలసిందే.

అన్ని ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల వలెనే వెనెజులా కూడా కొలంబస్ రాకడతో ప్రారంభించి వలసగా మారినదే. ఇతర పోటీవలసవాదులతో నెగ్గి స్పానిష్ సామ్రాజ్యవాదులు చేజిక్కించుకున్న వెనెజులా, రెండువందలేళ్ల కిందటే 'స్వతంత్రం' సాధించుకున్నప్పటికీ, సైనిక, నియంతృత్వ పాలనల్లో మగ్గుతూ వచ్చింది. సౌదీ అరేబియా కంటె అధికమైన చమురు నిల్వలు కలిగిన ఆ దేశంలో బహుళజాతి చమురు కంపెనీలు పాగావేశాయి. చమురుపరిశ్రమను జాతీయం చేయడం చాలా కాలం కిందటే జరిగినప్పటికీ, ప్రభుత్వ అజమాయిషీ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగి క్రమంగా విదేశీ కంపెనీలదే పెత్తనం అయింది.

1980, 90 దశాబ్దాలలో ఆర్థిక సంక్షోభం ముదిరి, దేశంలో అశాంతి నెలకొన్నది. నాటి అధ్యక్షుడు కార్లోస్ ఆండ్రెజ్ పెరెజ్ ప్రభుత్వంపై 1992లో రెండుమార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. అందులో ఒక తిరుగుబాటుకు
నాయకుడు సైనికాధికారి చావెజ్. తిరుగుబాట్లు విఫలమైనా, పెరెజ్ అభిశంసన తీర్మానం ద్వారా పదవీ భ్రష్ఠుడయ్యాడు. అతని వారసుడు చావెజ్‌కు క్షమాభిక్ష పెట్టాడు. ఉనికిలో ఉన్న రాజకీయపార్టీలన్నీ ప్రజల విశ్వాసం కోల్పోవడంతో, 1998లో చావెజ్ ఎన్నికల ప్రక్రియ ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 'నేను మితవాదినీ కాదు, అతివాదినీ కాదు' అని చెప్పి ఎన్నికలలో పోటీచేసిన చావెజ్, ఎన్నికయిన తరువాత సోషలిస్టు విధానాలకు తన విధేయతను ప్రకటించాడు. తరతరాలుగా స్పానిష్ శిష్టవర్గం చేతిలో ఉన్న దేశపు రాజకీయాధికారం, మొదటి సారిగా మిశ్రమవర్ణస్థుడు, మధ్యతరగతి వ్యక్తి అయిన చావెజ్ చేతికి చిక్కింది. దేశంలోని సంపన్నేతర వర్గాలన్నీ అతని వెనుక నిలబడ్డాయి.

ఇంతకీ చావెజ్ ఆ దేశానికి చేసిందేమిటి? చమురు అమ్మకాల ద్వారా సాధించిన ఆదాయంలో 80 శాతాన్ని బహుళజాతి కంపెనీలే తీసుకునేట్టు ఉన్న ఏర్పాటును చావెజ్ మార్చాడు. ఆ ఆదాయాన్ని 70 శాతానికి తగ్గించాడు. దేశపు వనరులపై జాతీయ ప్రభుత్వానికే అధికారం ఉంటుందనే సూత్రాన్ని కేవలం సూత్రప్రాయంగా అమలుచేశాడు. అట్లా మిగిల్చిన పదిశాతం ఆదాయాన్ని దేశంలోని బీదాబిక్కీ సంక్షేమానికి ఉపయోగించాడు. కొన్ని బహుళజాతి కంపెనీలను పాక్షికంగా జాతీయం చేశాడు. అట్లా చేసిన కంపెనీల్లో హింజ్ కార్పొరేషన్ ఒకటి. టమాటా కెచప్ తయారుచేసేది. ఆ కంపెనీకి, అటువంటి మరి కొన్ని కంపెనీలకు అనేక వ్యవసాయక్షేత్రాలున్నాయి. ఆ క్షేత్రాలలో వినియోగంలో లేని భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాడు. అందుకు నిరసనగా హింజ్ కంపెనీ తన ప్లాంట్లను అనేకం మూసివేసి, కార్మికులను వీధిన పడేసింది. తన విధానాల పర్యవసానంగా జరిగిన ఆ పరిణామాన్ని ఎదుర్కొనడానికి, ఆ కంపెనీ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుని కార్మికులను తిరిగి పనిలోకి తీసుకున్నాడు. హింజ్ అమెరికాలో రాజకీయ ప్రాబల్యం ఉన్న కంపెనీ. కొత్త విదేశాంగ మంత్రిగా ఒబామా నియమించిన జాన్‌కెర్రీ హింజ్ కుటుంబపు అల్లుడే.

చావెజ్ విదేశీ కంపెనీలను నిరోధించి మిగిల్చిన కొద్దిపాటి సొమ్ముతోనే గత పదేళ్లలో సామాన్యులలో విద్యను, ఆరోగ్యాన్ని పెంచాడు. చమురు మీద ప్రభుత్వం సాధించిన రాయల్టీ నుంచే అమెరికాలోని నిరాశ్రయులకు సహాయం చేసే దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించాడు. క్యూబాకు వస్తుమార్పిడి పద్ధతిలో చమురు సరఫరా చేశాడు. లాటిన్ అమెరికాలోని చిన్నా చితకా దేశాలకు ఆర్థిక సహాయం చేశాడు. అమెరికా తీరాన్ని కత్రినా తుఫాను అతలాకుతలం చేసినప్పుడు, బాధితులకు సహాయం అందిస్తానని తక్షణ ప్రకటన చేసిన మూడో ప్రపంచదేశం వెనెజులానే.

దేశవ్యవస్థను చావెజ్ సమూలంగా ఏమీ మార్చలేదు. అక్కడ నేరాల రేటు అమెరికా కంటె ఎక్కువ. చావెజ్ మీద కూడా ఆశ్రిత పెట్టుబడిదారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, అక్కడి ప్రజలు అతను తమ కోసం చేసినదానికి, అమెరికాకు ఎదురొడ్డితే కలిగే ప్రమాదానికి సిద్ధపడినదానికీ కృతజ్ఞులై ఉన్నారు. ఇప్పటికీ ఆ దేశంలో ఆర్థికాధిపత్యం స్పానిష్ శిష్టులదే. ఇప్పటికీ అనేక బహుళజాతి సంస్థలు అక్కడ ఉనికిలోనే ఉన్నాయి. కాకపోతే, వాటి మీద భారత్ వంటి దేశాలు ఊహించలేనంత ప్రభుత్వ నియంత్రణ ఉన్నది. రెండేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న చావెజ్, తన అనంతరం దేశంపై తిరిగి అమెరికా పట్టు బిగియకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుత ఉపాధ్యక్షుడు, ఒకనాటి బస్ కార్మికనాయకుడు అయిన నికొలస్ మదురోను తన వారసుడిగా ప్రకటించారు. నెలరోజుల్లో జరిగే ఎన్నికల్లో అతనికి లభించే జనాదరణను బట్టి వెనెజులా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

No comments:

Post a Comment