Tuesday, April 2, 2013

సమాధానం లేని సంకీర్ణ ప్రశ్నలు

జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రుడు అడిగాడు- "పోయిన సంవత్సరమే మా రాష్ట్రం కొంత కుదుటపడింది. పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి, అభివృద్ధికి శాంతియుత పరిస్థితులే పునాది అని మీరు అంటున్నారు కదా, కానీ, కేంద్రం వ్యవహరించిన తీరు వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది కదా?''- అఫ్జల్ గురు ఉరితీత వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే అతను ఆ ప్రశ్న అడిగాడని ఆర్థిక మంత్రి చిదంబరం అర్థం చేసుకున్నారు. ఆయన గతంలో హోంశాఖ మంత్రి కూడా కదా మరి! ఆయన అప్పుడు అన్నారు- "దాన్ని అట్లా అర్థం చేసుకోగూడదు, ఉరితీత అనేది న్యాయప్రక్రియ అమలులో భాగంగా జరిగింది, అంతా పద్ధతి ప్రకారం జరిగింది, దర్యాప్తు, ప్రాసిక్యూషన్, కిందికోర్టు తీర్పులు, పైకోర్టు నిర్ధారణలు, క్షమాభిక్ష పిటిషన్, నిరాకరణ.. అన్నీ సవ్యంగా జరిగాయి. అందువల్ల నిరసనలు, అశాంతి అంటారా, వాటిని ఊహించాము కూడా, త్వరలోనే సమసిపోతాయని ఆశిస్తున్నాను''

యూపీఏకు డీఎంకే మద్దతు ఉపసంహరించిన మరునాడే, స్టాలిన్ ఇంటి మీద సీబీఐ దాడి చేయడం, ఇతర పక్షాలను బెదిరించడానికే కదా అని మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒక పాత్రికేయుడు అడిగినప్పుడు- సంబంధిత మంత్రి నారాయణస్వామి కాస్త తడబడ్డారు. విదేశీ కార్లు, పాతకార్లుగా చెప్పి దిగుమతి చేసుకోవడం, సుంకాలు ఎగవేయడం వంటి వివరాలన్నీ ఏకరువు పెట్టారు. అంతా సక్రమంగానే జరిగిందన్నట్టు మాట్లాడారు. దాడి చేసిన సమయం వల్ల జనం దాన్ని అక్రమమనే భావిస్తారు కదా అని మళ్లీ అడిగితే, అదే, అదే, తగిన సమయం కాదని ప్రధానమంత్రి దగ్గర నుంచి అంతా అన్నారు కదా, టైమింగే తప్పు- అని ముక్తాయించారు. దర్యాప్తు సమయంలో కానీ, ప్రాసిక్యూషన్ సందర్భంగా కానీ, సీబీఐ పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకోనే చేసుకోదని గట్టిగా ప్రకటించారు.

అన్నీ చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం జరిగాయని, తమకు ఎటువంటి ఉద్దేశాలూ లేవని చిదంబరం, నారాయణ స్వామి మాత్రమే కాదు, జాతీయ సంపాదకుల సదస్సులో పాల్గొన్న ప్రతి మంత్రీ, అధికారీ చెప్పడానికి ప్రయత్నించారు. అటువంటి మాటలను వినడానికి, విని దేశ ప్రజలకు ఆ సందేశాన్ని అందించడానికే ఈ సదస్సును ఉద్దేశించారు. మొన్న 23, 24 తేదీలలో న్యూఢిల్లీ విజ్ఞానభవన్‌లో పీఐబీ నిర్వహించిన ఈ సదస్సులో వివిధ భాషలకు, వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఏటా సాధారణంగా ఆర్థిక వ్యవహారాల సంపాదకులను పిలిచి, కేంద్ర బడ్జెట్‌కు, ఆర్థికంతో ముడిపడిన ఇతర విధాన నిర్ణయాలకు సంబంధించి సమాచార ప్రసంగాలను మంత్రుల ద్వారా ఇప్పించడం పీఐబీ చేస్తుంటుంది. 2012 బడ్జెట్‌కు సంబంధించిన ఆర్థిక సంపాదకుల సదస్సు అక్టోబర్ 8, 9 తేదీలలో జరిగింది. ప్రస్తుత సంపాదక సదస్సును రెండు నెలల కిందటే జైపూర్‌లో నిర్వహించ తలపెట్టినప్పటికీ, ఏ కారణం వల్లనో అది వాయిదాపడి న్యూఢిల్లీలోనే జరిగింది. తిరిగి ఆర్థిక సంపాదకుల సదస్సు జరిగే నాటికి కేంద్రంలో పరిస్థితి మారిపోవచ్చునన్న అనుమానంతో కావచ్చు, 2013 బడ్జెట్ తరువాత తేదీలకు సంపాదక సదస్సును వాయిదావేసి ఉండవచ్చు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్రం ఆర్థిక కార్యకలాపాలను, కేటాయింపులను రాజకీయ కోణంలో వ్యాఖ్యానించవలసిన అవసరం ఉన్నందునే సాధారణ సంపాదకులను ఉద్దేశించి ఆర్థికాది మంత్రులు సుదీర్ఘ సందేశాలు ఇచ్చారని స్పష్టంగానే తెలుస్తోంది.

ఆర్థికశాఖతో పాటు, రైల్వేలు, స్త్రీ శిశు సంక్షేమం, కమ్యూనికేషన్లు-ఐటీ, మైనారిటీ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సిబ్బంది-ప్రజాసమస్యలు-పింఛన్లు, పెట్రోలియం-సహజవాయువు, గృహనిర్మాణం-పట్టణ పేదరిక నిర్మూలన, కార్మిక-ఉపాధి, వాణిజ్యం-పరిశ్రమలు, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, పర్యావరణం-అడవులు, మానవవనరులు, సామాజిక న్యాయం-సాధికారత శాఖల మంత్రులో, ఉన్నతాధికారులో వరుసగా తమ తమ విభాగాల ఘనకార్యాలను ఏకరువు పెట్టారు. కేవలం బడ్జెట్ కేటాయింపులను వివరించడం మాత్రమే కాక, అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వపు కట్టుబాటును పదేపదే నొక్కి చెప్పడం జరిగింది. సుదీర్ఘమైన ప్రసంగపాఠాల తరువాత- కాసేపు ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. సదస్సు నిర్వాహకులు ప్రత్యేకంగా దేశ రాజధానిలోని వారిని కాక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పాత్రికేయులకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రఖ్యాతులైన జాతీయ సంపాదకులెవరూ సదస్సులో కనిపించలేదంటే, బహుశా వారిని మినహాయించడం కారణం కావచ్చు. లేదా మఫసిల్ పాత్రికేయుల సహపంక్తిలో కూర్చుని ప్రభుత్వ ప్రవచనాలు వినడానికి వారికి ఆసక్తి లేకపోయి ఉండవచ్చు.

మమతా బెనర్జీ అంటున్నట్టుగా బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారా అని బెంగాలీ పాత్రికేయుడు, చత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వరంగ పరిశ్రమలు స్థాపించవచ్చును కదా అని ఆ రాష్ట్ర పాత్రికేయుడు, బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తున్నారా అని మరొకరు.. ఇట్లా చిదంబరంపై వివిధ ప్రాంతాల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. ప్రతి ప్రాంతానికీ ప్రత్యేక ప్రతిపత్తి, విశేష నిధులు ఇస్తే, ప్రత్యేకతకు, విశేషతకు అర్థమే ఉండదని, పరిశ్రమలు స్థాపించడానికి ప్రజల నుంచి వస్తున్న విముఖతను తొలగించవలసినది పత్రికలూ పౌరసమాజమేనని చిదంబరం తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాను విశ్వసించే ఆర్థిక సిద్ధాంతాల విషయంలో దృఢంగా కనిపిస్తూనే, చిరునవ్వు చెదరకుండా మాట్లాడే ప్రయత్నం ఆయన చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆయన ఆలోచనకు అందినట్టు లేదు. వాళ్లసలు వ్యతిరేకిస్తున్నారో లేదో, వాళ్లు వ్యతిరేకిస్తున్నట్టు మనకెవరన్నా అభిప్రాయం కలిగిస్తున్నారేమో- అని చిదంబరం వ్యాఖ్యానించినప్పుడు- ఔరా- అనిపించింది. ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులకు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు వైరుధ్యం ఎందువల్ల తలెత్తుతోంది, దాన్ని ఎట్లా పరిష్కరించవచ్చు- అని ఏలినవారి మేధావులు కొంత ఆలోచించగలిగితే సమస్యే ఉండదు. అలా కాక, జనవ్యతిరేకతే కల్పితమన్న దృష్టితో వ్యవహరిస్తే, ఆయా ప్రాంతాల ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి ఏమి గౌరవం ఉంటుంది?

ఇతర శాఖల ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యానికి, ప్రభుత్వ ద్వంద్వత్వానికి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రికి ఎక్కువగా నిర్భయ ఉదంతం, స్త్రీలపై జరిగే అత్యాచారాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. సిబ్బంది- ప్రజాసమస్యల మంత్రి సీబీఐ పనితీరుపై, లోక్‌పాల్ బిల్లుపై, అధికారయంత్రాంగంలో అవినీతిపై సంజాయిషీలు ఇచ్చుకోవలసి వచ్చింది. పెట్రోలియం మంత్రి పెరుగుతున్న ధరల గురించి వివరణలు ఇవ్వవలసి వచ్చింది. గృహనిర్మాణ మంత్రి- గణాంకాలతో తమ ప్రభుత్వ పురోగతిని చెప్పుకున్నారు. మైనారిటీలపై వివక్ష గురించి దాదాపు అందరు మంత్రులూ ప్రశ్నలు ఎదుర్కొనవలసి వచ్చింది.

యూపీఏ ప్రభుత్వ సందేశాన్ని పాత్రికేయులు దేశం నలుమూలలకు తీసుకుపోవడం సంగతేమో కానీ, ఢిల్లీ బయట దేశం ఏమనుకుంటుందో అమాత్యులకు ఈ సదస్సు ద్వారా తెలిసే ఉండాలి. ప్రతిప్రాంతం, ప్రతి వర్గం- ప్రతి రంగంలోనూ తమ ప్రాతినిధ్యం గురించి, న్యాయమైన కేటాయింపుల గురించి ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మీద వారికి ఉన్న ఫిర్యాదులన్నీ అభివృద్ధికి సంబంధించినవే. అదే సమయంలో జాతీయ సమస్యగా మారిన అవినీతి, దాన్ని ఎదుర్కొనే క్రమంలో రాజకీయ లబ్ధి చూసుకుంటున్న కేంద్ర వైఖరి గురించి అన్ని ప్రాంతాల వారికి అభ్యంతరాలున్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి యూపీఏ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా అసమ్మతే వ్యక్తం అయింది.

మీడియా, ముఖ్యంగా పత్రికారంగం- దేశప్రజల నాడిని దాదాపుగా తెలియజెబుతుంది. ప్రభుత్వం సాధించిన పురోగతిని, అది చెప్పే అంకెలను స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నిజంగా ప్రభుత్వం ఏ రంగంలో అయినా ఏమయినా చేసి ఉంటే కూడా దాన్ని పెద్దగా ఖాతరు చేసేవారు లేరు. ఎందుకంటే, జన జీవితానుభవం భిన్నంగా ఉన్నది. వారికి మనుగడే సమస్య. మార్కెట్ మాయాజాలంతో మరింత దుర్భరంగా మారుతున్న జీవితంలో కాసింత ఉపశమనం తెచ్చే వారి కోసం ఓటర్లు నిరీక్షిస్తున్నారు. మొత్తంగా జీవితాన్ని మార్చేస్తామని ఎవరన్నా చెబితే వారు నమ్మేట్టు లేరు. యూపీఏ-2 విజయగాధలను పాడాలని మీడియా అనుకున్నా జనం వినరు. పక్షపాతాలను నిలదీయాలని, మెరుగైన భాగస్వామ్యం కావాలని వారు కోరుతున్నారెందుకంటే, అటువంటి వ్యక్తీకరణలకు మాత్రమే ప్రస్తుత వ్యవస్థలో అనుమతి లభిస్తోంది కాబట్టి. పాక్షిక ప్రయోజనాలు, వర్గ ఆకాంక్షలు, ప్రాంత వ్యక్తీకరణలతో చెల్లాచెదరుగా కనిపిస్తున్న ప్రజాభిప్రాయం వెనుక- ఒక ఏకసూత్రత ఉన్నది. ఆ ఏకసూత్రతే సంకీర్ణ ప్రభుత్వాలుగా వ్యక్తమవుతున్నది. ఒకరు కాకపోతే, మరొక భాగస్వామిని సంపాదించుకుని ప్రభుత్వాలు గట్టెక్కడానికి పనికివచ్చే సంకీర్ణతే, ఒక్కోసారి ప్రజాస్వామిక ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు వేయించడానికి కూడా పనికివస్తుంది. చాలా కాలం పాటు ఎంతో గొప్పగా, కాల్పనికంగా చెప్పుకుంటూ వచ్చిన జాతీయత, భారతీయత- వంటివేవీ సంపాదక సదస్సులో ప్రస్తావనకు రాలేదు.

ఆకాంక్షల రీత్యా, ఆలోచనల రీత్యా, ప్రయోజనాల రీత్యా విచ్ఛిన్నమై కనిపిస్తున్న భారతీయ జనాన్ని- ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి, లేదా ఒకరంటే ఒకరికి భయం కలిగించి, మరొకరిని అదుపుచేయడమే తమ విజయంగా భావించే స్థితి కల్పించి- 2014లో గెలుపు సాధించాలని రాజకీయపక్షాలు ప్రయత్నిస్తాయి. గెలిచేవారెవరైనా- చాణక్యంతో గెలవాల్సిందే తప్ప, జనాభిమానంతో కాదు.

No comments:

Post a Comment